గతి తప్పుతున్న టీనేజ్..50కి పైగా పోక్సో కేసులు

గతి తప్పుతున్న టీనేజ్..50కి పైగా పోక్సో కేసులు

 

  •     జగిత్యాల జిల్లాలో నెలకు 20కి పైగా ఘటనలు
  •     జిల్లాలో ఏటా 50కి పైగా పోక్సో కేసులు 

జగిత్యాల, వెలుగు: టీనేజీ పిల్లలు సోషల్​మీడియా ఎఫెక్ట్‌తో గతితప్పుతున్నారు.ఫేస్‌బుక్ , ఇన్‌ ‌స్ట్రాగ్రాం, వాట్సప్​వంటి సోషల్​మీడియా వాడకంతో పిల్లలు పెడదోవ పడుతున్నారు. కరోనా కాలం నుంచి ఆన్ లైన్​ విద్య అందుబాటులోకి రావడంతో పిల్లలు సెల్ ఫోన్ కు అలవాటవయ్యారు. దీంతో తెలిసీ తెలియని వయస్సులో తప్పుడు మార్గాల్లోకి వెళ్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీం కింద  చైల్డ్ డెవలప్మెంట్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో ప్రతి నెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. 

అయినప్పటికీ టీనేజీ పిల్లల్లో ఆశించినంత మార్పు రావడం లేదు. జగిత్యాల జిల్లాలో నెలకు 20కి పైగా ఇల్లీగల్​యాక్టివిటీస్, ఏటా 50 నుంచి 60 పోక్సో కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో నాలుగేళ్లుగా దాదాపు 250కి పైగా పోక్సో కేసులు అయ్యాయి. 2023 జనవరి నుంచి మే వరకు 14 పోక్సో కేసులు రావడం గమనార్హం. కొందరు బాలురు గుట్కా, లిక్కర్, మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. గుట్కా విచ్చలవిడిగా దొరకడంతోనే చిన్నారులు బానిసలవుతున్నారని పేరెంట్స్​ఆవేదన చెందుతున్నారు. బాలికలు సైతం వేధింపులకు గురవుతున్నారు. 

సోషల్ మీడియాతో కొత్త చిక్కులు 

అత్యున్నత టెక్నాలజీ సెల్ ఫోన్ రూపంలో అరచేతిలోకి వచ్చింది. తెలిసీతెలియని తనం, ఇట్టే ఆకర్షణకు లోనయ్యే వయసు కావడంతో టీనేజర్స్ గతి తప్పుతున్నారు. ఇందుకు ఇటీవల జిల్లాలో జరిగిన సంఘటనలే నిదర్శనం. అయితే ఇలాంటి ప్రమాదాల నుండి 
టీనేజర్స్ ను కాపాడే అవకాశం తల్లిదండ్రుల చేతిలోనే ఉందని మానసిక, సామాజిక వేత్తలు 
అంటున్నారు. 

పిల్లల సంరక్షణలో పేరెంట్స్ అలర్ట్​గా ఉండాలి

చిల్డ్రన్,​టీనేజర్ల విషయంలో పేరెంట్స్ అలర్ట్‌‌గా ఉండాలని సూచిస్తున్నారు. కాలానికి అనుగుణంగా పేరెంట్స్ వైఖరిలోనూ మార్పు రావాలని, పిల్లలు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినిపించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలతో చనువు పెంచుకోవడం.. ఎలాంటి సమస్యనైనా పేరెంట్స్ తో షేర్ చేసుకునేలా బాండింగ్ ఏర్పర్చుకుంటే చాలా సమస్యలు క్లియర్ అవుతాయంటున్నారు. అంతే కాకుండా టీనేజర్స్ వైఖరి, మాటలు, వారిలో వస్తున్న మార్పులను పేరెంట్స్ త్వరగా పసిగడితే పిల్లలను కాపాడుకోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా టీనేజర్స్ తో ఫ్రెండ్లీ గా ఉంటూ వారి ఆసక్తులు, ఆలోచనలను గమనించాల్సి ఉంటుంది.  ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగంపై పిల్లలకు అవగాహన కల్పించాలని, వారు ఏం చూస్తున్నారో గమనించాలని సూచిస్తున్నారు.

గొల్లపల్లి మండలానికి చెందిన ఓ పదమూడేళ్ల బాలిక ఇన్ స్టాగ్రాంలో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసేది. మూడు నెలల కింద గుర్తుతెలియని బాలిక తరచూ మెసెజ్ లు చేయడం తో ఇద్దరి మధ్య చాటింగ్ నడిచింది. తెలిసీతెలియని వయస్సు కావడంతో అవతలి వ్యక్తి  ప్రైవేట్ పార్ట్ ఫొటోలు అడగడంతో పంపింది. అనంతరం అవతలి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడంతో విషయం పేరెంట్స్  ‌‌ ‌‌కు చెప్పింది. వారు సీడీపీవోకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయగా అవతలి వ్యక్తి అబ్బాయని తెలిసి కంగుతిన్నారు.కథలాపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్లు, పన్నెండేళ్లు గల ఇద్దరు బాలురు గుట్కాకు బానిసలయ్యారు. ప్రతి రోజు ఇంట్లో ఉన్న ఒక రూం లో గొల్లెం పెట్టుకొని గుట్కా కొనుగోలు చేసుకునేందుకు డబ్బులు ఇస్తేనే గొల్లెం తీసి బయటకు వచ్చేవారు. విసిగిపోయిన పేరెంట్స్ సీడీపీవోకు కంప్లైట్ ఇవ్వడంతో వారు కౌన్సెలింగ్​ఇచ్చారు. దీంతో వారిలో కొంత మార్పు వచ్చింది.

పిల్లల్లో వచ్చే మార్పును గమనించాలి

 ముఖ్యంగా టీనేజర్ల  ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. వారు ఫోన్​ఎలా వాడుతున్నారో పరిశీలిస్తుండాలి. కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లను పసిగట్టాలి. పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటూ సెన్సిటీవ్  ‌‌ ‌‌గా ట్రీట్ చేయాలి. ప్రవర్తనలో తేడాగా అనిపిస్తే కౌన్సెలింగ్ ఇప్పించాలి.1098 ద్వారా పిల్లలతోపాటు పేరెంట్స్ కు కూడా కౌన్సెలింగ్ ఇస్తాం. పిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు న్యాయసేవలు అందిస్తూ న్యాయం జరిగేలా ఆఫీసర్లు కృషి చేస్తారు.

- బోనగిరి నరేశ్ ‌‌, డీడబ్ల్యూవో, జగిత్యాల