జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు

జాబ్ కన్నా.. బిజినెస్ బెటర్ అంటున్న యువతులు

‘‘ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుని జాబ్ చేయడం ఇష్టం లేదు. నచ్చిన పని చేసి రిలాక్స్ అయ్యేందుకు టైం దొరక్క లైఫ్‌లో ఏదో కోల్పోయిన ఫీలింగ్. అందుకే నన్ను నేను ఫ్రూవ్ చేసు కోవాలనుకున్నా. జాబ్ మానేసి ఆర్ట్ అండ్ స్క్రాఫ్ట్‌లో లైఫ్ వెతుక్కుంటున్నా” అంటోంది కూకట్ పల్లికి చెందిన మన్విత. ఈ ఒక్క అమ్మాయి మాత్రమే కాదు సిటీలో చాలామంది యువతులు క్రియేటివిటీతో ఓన్ బిజినెస్ చేస్తున్నారు. 

హైదరాబాద్, వెలుగువ్యాపారం చేస్తే లాభామో, నష్టమో.. రిస్క్ ఎందుకు. జాబ్ మేలు అనుకునే వారు చాలామంది ఉంటారు. నేటితరం అమ్మాయిలు మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే కొద్దిపాటి జీతం కన్నా క్రియేటివ్‌గా ఆలోచించి తమకు నచ్చిన బిజినెస్‌లో రాణించాలనుకుంటున్నారు. హాబీని కెరీర్‌గా మలుచుకునే వారు కొందరైతే.. ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్స్ట్ తయారు చేసి వ్యాపారం చేసేవారు ఇంకొందరున్నారు. చాక్లెట్ కవర్‌తో క్రియేటివ్ గిఫ్ట్లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆర్ట్ అండ్ క్రాఫ్స్ట్ గిఫ్టింగ్‌లో న్యూస్ పేపర్‌తో బెడ్ ల్యాంప్, బైండింగ్ వైర్లతో ల్యాంపులు, గ్లాస్ పెయింటింగ్స్, అగ్గిపెట్టెల గిఫ్ట్ బాక్స్, మట్టితో స్మైలీలు, ఇమోజీలు, ఉన్నితో వాల్ హ్యాంగింగ్స్, పేపర్‌తో ఫ్లవర్స్, పాత బట్టలతో హోమ్ డెకరేషన్ ఐటమ్స్, చాక్లెట్ కవర్‌తో హంసలు, మట్టి బొమ్మలు ఇలా ఎన్నో డెకరేటివ్ ఐటమ్స్ చేస్తున్నారు. మినియేచర్ కూడా ట్రెండింగ్‌లో ఉండడంతో చాలామంది యువతులు ఆ తరహా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న కుండీలలో ఇంటీరియర్ మొక్కలు నాటి వాటి మధ్యలో ఒక థీమ్‌తో మినియేచర్ చేసి ఫంక్షన్స్, బర్త్ డేస్, ఈవెంట్స్‌కు రిటర్న్ గిఫ్ట్‌లు రూపొందించి ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్‌లో సేల్ చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ , రీసైకిల్ ప్రోడక్స్ట్ రూపొందిస్తూ తాము సంపాదించడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నారు.

వేస్టేజ్, ఆర్గానిక్ ప్రోడక్స్ట్‌తో బొమ్మలు

దివ్యాంగులకు ఉపాధి కల్పించాలని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. వేస్టేజ్‌తో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారు చేయించి ఉపాధి కల్పిస్తున్నా. వాటర్ బాటిల్స్, పూల కుండీలు, పెద్ద చెట్టు కాండాలు, అద్దాలు, పేపర్లు, గోనె సంచి తాళ్లతో గిఫ్ట్స్, డెకరేటివ్ ఐటమ్స్ తయారుచేస్తున్నాం. ‑సింధు శ్రీరామ్, తార్నాక

జాబ్ సాటిస్ఫాక్షన్ లేక..

జాబ్ చేయడం అంతా పరుగుల జీవితం అయిపోయింది. అందుకనే మానేశా. డ్రాయింగ్, క్రాఫ్ట్స్‌తో గిఫ్ట్స్ తయారు చేస్తున్నా. సోషల్ మీడియాలో నేను చేసిన క్రాఫ్ట్స్ పోస్ట్ చేయడంతో నచ్చిన వాళ్లు ఆర్డర్ ఇస్తున్నారు. ‑మౌనిక, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, కేపీహెచ్‌బీ కాలనీ

మినియేచర్ గార్డెనింగ్

మాది శ్రీనగర్ కాలనీ. సాఫ్ట్ వేర్ జాబ్ ఆఫర్ వచ్చినా వదులుకున్నా. చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ అంటే ఇష్టం కాబట్టి మొక్కలు, రంగురాళ్లు, ఇసుక, బొమ్మలతో మినియేచర్ చేస్తున్నా. నెలలో 10, 15 ఆర్డర్స్ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా ఆర్డర్స్ ఇస్తున్నారు. – రుచిత, మినియేచర్ గార్డెనింగ్, శ్రీనగర్ కాలనీ

గ్రాఫిక్ డిజైన్ ఇంట్రెస్ట్

నేను ఆర్కిటెక్చర్‌ని, గ్రాఫిక్ డిజైన్ కోర్స్ కూడా చేశా. డిజైన్లతో ఈ–ఇన్విటేషన్లను తయారు చేస్తున్నా. ఇన్‌స్టాగ్రామ్‌లో వెడ్డింగ్స్, బర్త్‌ డేలు, యానివర్సరీలు, ఆఫీస్ ఓపెన్సింగ్, షష్టి పూర్తి ఇలా అన్ని రకాల ఫంక్షన్లకు డిఫరెంట్ థీమ్‌లలో ఉంటాయి. – యశశ్విని,ఈ–ఇన్విటేషన్స్, జూబ్లీహిల్స్