భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేసిన తహసీల్దార్‌‌ అరెస్ట్‌‌

భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేసిన తహసీల్దార్‌‌ అరెస్ట్‌‌

చందుర్తి, వెలుగు : వ్యవసాయ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేసిన ఓ తహసీల్దార్‌‌ను పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అనంతపల్లికి చెందిన సలేంద్ర మల్లేశానికి గ్రామ శివారులోని 104, 105/అ/ఆ సర్వే నంబర్‌‌లో వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సుమారు రెండేండ్ల కింద అదే గ్రామానికి చెందిన సలేంద్ర లక్ష్మి, సలేంద్ర వేణు కలిసి అప్పటి తహసీల్దార్‌‌ నరేశ్‌‌, మరో ఐదుగురి సహాయంతో అక్రమంగా రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారు.

ఈ డాక్యుమెంట్‌‌తో 2024 జులై 25 చందుర్తి గ్రామీణ బ్యాంక్‌‌లో లోన్‌‌ కూడా తీసుకున్నారు. దీంతో మల్లేశం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేశారు. ధరణి పోర్టల్‌‌లో తప్పుడు డాక్యుమెంట్లు అప్‌‌లోడ్‌‌ చేసి పట్టా మార్పిడి చేశారని తేలింది. దీంతో తహసీల్దార్‌‌ నరేశ్‌‌ను అరెస్ట్‌‌ చేసి వేములవాడ కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌‌కు తరలించనట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నరేశ్‌‌ ప్రస్తుతం కలెక్టరేట్‌‌లో పనిచేస్తున్నాడు.