ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : 20 నెలల్లోనే ఇస్తానంటున్న తేజస్వీ యాదవ్

ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం : 20 నెలల్లోనే ఇస్తానంటున్న తేజస్వీ యాదవ్

బీహార్ లో ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఇందుకు సంబందించిన ఆర్డినెన్స్ తీసుకొస్తామని అన్నారు తేజస్వి యాదవ్. 

వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ అధికారంలోకి ప్రతి ఇంటి నుండి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు తేజస్వి యాదవ్. గురువారం ( అక్టోబర్ 9 ) మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈమేరకు కీలక ప్రకటన చేశారు.తమ ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చట్టాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. అధికారం చేపట్టిన 20 నెలల్లోపు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా అమలు చేస్తామని పేర్కొన్నారు తేజస్వి యాదవ్.

Also Read : విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న బీర్ కంపెనీ యజమాని, SBI బ్యాంక్ ఉన్నతాధికారి

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఉండేలా చూస్తామని ... ప్రభుత్వం ఏర్పడిన 20 రోజుల్లోపు కొత్త చట్టం రూపొందిస్తామని అన్నారు. 20 నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం లేని ఇల్లు లేకుండా చేస్తామని అన్నారు తేజస్వి యాదవ్.

డేటా ఆధారంగానే హామీ ఇచ్చా.. జుమ్లా వాగ్దానం కాదు..

తను డేటా ఆధారంగానే హామీ ఇచ్చానని.. ఇది జుమ్లా వాగ్దానం కాదని అన్నారు.బీహార్ ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని అన్నారు తేజస్వి యాదవ్. సామాజిక న్యాయంతో పాటు, బీహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం కూడా అందేలా చూస్తామని... దృఢ సంకల్పం ఉంటే ఈ హామీ అమలు చేయచ్చని అన్నారు.

నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి... 243 స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.