కాళేశ్వరం వల్ల  రాష్ట్రానికి లక్ష కోట్లు ఆదా

కాళేశ్వరం వల్ల  రాష్ట్రానికి లక్ష కోట్లు ఆదా

కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోవాలని కొందరు కోరుకుంటున్నరని .. అలా కోరుకున్న వాళ్లే కాళేశ్వరం పంపు హౌస్ లు మునిగితే సంకలు గుద్దుకున్నరని ఆర్థిక మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం వల్ల ఉపయోగం లేదనడం సరికాదన్నారు. ఆ ప్రాజెక్టు వల్లే రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల పంట పండిందని ఆయన గుర్తు చేశారు. గత మూడేళ్లలో మొత్తం లక్ష కోట్లు విలువ చేసే పంట పండిందన్నారు. ‘‘కాళేశ్వరం వల్ల డబ్బు వృథా కాలేదు.. ముమ్మాటికి ఆదా అయింది’’ అని హరీశ్ రావు స్పష్టం చేశారు.   సీఎం కేసీఆర్ ముందుచూపుతో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు లక్ష కోట్లు ఆదా అయ్యాయని తెలిపారు. ఇవాళ శాసన మండలి సమావేశాలలో హరీశ్ రావు మాట్లాడారు. 

ప్రాజెక్టు కట్టిన సమయం నాటితో పోలిస్తే.. ఇప్పుడు సిమెంటు ధరలు, స్టీలు ధరలు,  భూ సేకరణ వ్యయాలు బాగా పెరిగాయన్నారు. ప్రస్తుతం సిమెంటు రేటు దాదాపు  డబుల్ కాగా, స్టీలు ధరలు 113 శాతం పెరిగాయని చెప్పారు. ఇవాళ ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే దాదాపు రూ.2 లక్షల కోట్లు అవసరమవుతాయని వివరించారు. కాళేశ్వరానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణపై, తెలంగాణ ప్రజలపై  నిజమైన ప్రేమ ఉంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చిన లోన్లపై వడ్డీని తగ్గించాలని బీజేపీ నాయకులకు హరీశ్ రావు సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు చలువ వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరిగిందన్నారు. వరదలను ప్రభుత్వ తప్పిదంలా చూపించే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు మానుకోవాలని ఆయన  హితవు పలికారు. ‘‘ కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్ హౌజ్ ల  మరమ్మతులను ఏజెన్సీ ద్వారానే చేయిస్తం. 21 పంప్ హౌజ్ లకుగానూ .. మేడిగడ్డ, అన్నారంలలోకి కొన్ని వరద నీళ్లు వచ్చాయి. సెప్టెంబరు మూడోవారంలో అన్నారం పంప్ హౌజ్ మళ్లీ నీళ్లు పోస్తుంది. అక్టోబరు చివరికల్లా మేడిగడ్డ మోటార్లు పనిచేస్తాయి’’ అని హరీశ్ రావు వెల్లడించారు.