ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

కాటారం, వెలుగు: కరీంనగర్ లో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర 5వ విడత ముగింపు సభలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సమక్షంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు బీజేపీలో చేరారు. ఇందులో తెలంగాణ ఉద్యమకారుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి బండం వసంత రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ ఉపాధ్యక్షుడు నాగుల తిరుపతి రెడ్డి, మాజీ కార్యదర్శి దోమల సమ్మయ్య, ఖమ్మంపల్లి సంజీవ్ ఉన్నారు. ఈ సందర్భంగా వసంత రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆది నుంచి ఉద్యమకారులకు విలువ ఇవ్వడం లేదన్నారు. తెలంగాణ కోసం రేయింబవళ్లు కష్టపడి, కేసులపాలైన తమను పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఉద్యమకారులను కాదని, ఉద్యమద్రోహులను, కబ్జాదారులను అక్కున చేర్చుకుందన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలపై బండి సంజయ్ పోరాటం నచ్చి, బీజేపీలో చేరానన్నారు. కార్యక్రమంలో బీజేపీ మంథని నియోజకవర్గ ఇన్ చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి, కాటారం బీజేపీ మండలాధ్యక్షుడు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్, నాయకులు ఉడుముల వెంకట్ రెడ్డి, సాదుల శ్రీనివాస్ తదితరులున్నారు.

అవినీతి పాలన అంతానికి బీజేపీ పోరాటం

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: సీఎం కేసీఆర్ అవినీతి పాలన అంతానికి బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదాసు వెంకటేశ్​ అన్నారు. కరీంనగర్ లో నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు గురువారం పార్టీ శ్రేణులతో కలిసి తరలివెళ్లారు.  మాదాసు వెంకటేశ్ ​మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించిన బండి సంజయ్ తన 5వ విడత పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ స్టేషన్ ఘన్ పూర్, జఫర్​గఢ్ మండలాల అధ్యక్షులు గట్టు క్రిష్ణ, తౌటి సురేశ్​గౌడ్, జిల్లా లీడర్లు తిరుపతి, శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా నాయకుడు కొలనుపాక శరత్​కుమార్ ఉన్నారు.

గిరిజనేతరులను మైదాన ప్రాంతాలకు తరలించాలి

కొత్తగూడ, వెలుగు: ఏజెన్సీ ఏరియాల్లో నివాసం ఉంటున్న గిరిజనేతరులను మైదాన ప్రాంతాలకు తరలించాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు 
మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రాంతంలోకి వలస వచ్చిన గిరిజనేతరులు.. ఆదివాసీ హక్కులను ఉపయోగించుకుంటూ తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. క్విట్ ఏజెన్సీ పేరుతో త్వరలో ఉద్యమం చేపడతామన్నారు. ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తున్న గిరిజనేతరుల రేషన్ కార్డులు, ఓటు హక్కు, ఆధార్ కార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  వచ్చే నెల 8న కొత్తగూడలో నిర్వహించే బహిరంగ సభకు ఆదివాసీలు ఆధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ, ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఉద్యోగ, రచయితల, యువజన, విద్యార్థి, దొర పటేళ్ల సంఘాలు, భూపోరాట సంఘం, ఆదివాసీ సేన, అధ్యయన వేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

మహబూబాబాద్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక డాక్టర్లను కోరారు. గురువారం కలెక్టరేట్​లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల డాక్టర్లతో రివ్యూ నిర్వహించారు. జిల్లాలోని గూడూరు, గార్ల సీహెచ్​సీల పనితీరు మరింత మెరుగుపడాలన్నారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్లను వారంలో రెండ్రోజుల పాటు గూడూరు, గార్ల ఆసుపత్రుల్లో విధులు కేటాయించాలన్నారు. ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెంచాలన్నారు.

కేంద్రీయ విద్యాలయం తనిఖీ..

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని కేంద్రీయ విద్యాలయాన్ని కలెక్టర్ శశాంక తనిఖీ చేశారు. ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్కూల్ నిర్వహణను వివరించారు. ఈ స్కూల్​లో 389 స్టూడెంట్లు ఉన్నారని, అద్దె భవనం కావడంతో సౌకర్యాలు కల్పించలేకపోతున్నామన్నారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆర్డీవోను ఆదేశించారు. ఈ స్కూల్​నిర్మాణానికి కేటాయించిన జాగను వెంటనే అప్పగించాలని తహసీల్దార్​ను ఆదేశించారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించి 16 సంవత్సరాలు పూర్తిచేసుకున్న స్టూడెంట్లతో కలిసి కలెక్టర్ కేక్ కట్ చేశారు.

అర్హులందరూ రక్తదానం చేయాలి

కాజీపేట, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడేది రక్తం మాత్రమేనని తాళ్ల పద్మావతి విద్యా సంస్థల చైర్మన్ తాళ్ల మల్లేశ్​అన్నారు. గురువారం కాలేజీలో లయన్స్ కబ్ల్, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించగా... చీఫ్ గెస్టుగా కాలేజీ చైర్మన్ హాజరయ్యారు. రక్తం దొరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారికి ఆపన్నహస్తంలా నిలవాలన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారంతా రక్తదానం చేయాలన్నారు. అనంతరం ఈ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేసిన 120 మంది స్టూడెంట్లు, ఫ్యాకల్టీకి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కాలేజీ డైరెక్టర్ డా.తాళ్ల వంశీ, చైతన్య, ప్రిన్సిపల్ డా. మహేందర్ రెడ్డి తదితరులున్నారు.

ఆసుపత్రిలో పసికందు మృతి
డాక్టర్ల నిర్లక్ష్యమే కారణం: కుటుంబసభ్యులు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా  కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఓ పసికందు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల ప్రకారం.. జిల్లాలోని గణపురం మండలం బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన వీరగొని మమతకు బుధవారం రాత్రి పురిటినొప్పులు రావడంతో జిల్లాకేంద్రంలోని మాతా శిశు సంరక్షణా కేంద్రానికి తరలించారు. ప్రసవం చేస్తామని చెప్పి గురువారం ఉదయం ఆపరేషన్ చేశారు. అనంతరం శిశువును కుటుంబసభ్యులకు చూపించలేదు. ఉదయం 9 గంటల తర్వాత చూసేసరికి శిశువు మృతి చెందినట్లుగా గుర్తించారు. సకాలంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతోనే ఇలా జరిగిందని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


గ్రీన్ సిటీగా జనగామ

జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణాన్ని గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ శివలింగయ్య వెల్లడించారు. గురువారం ఆయన మున్సిపల్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పట్టణంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన రూట్లలో స్వాగత తోరణాలు నిర్మించాలన్నారు. ప్రజలకు వారాంతపు సంతలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రీనరీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం హర్టికల్చర్ ఆఫీసర్లతో కలెక్టర్ సమీక్ష చేశారు. జిల్లాలో 6వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ వారంలో 3వేల ఎకరాలు పూర్తి కావాలన్నారు. ఆయిల్​ఫామ్ సాగు కోసం మొదటి నాలుగు సంవత్సరాలు రైతుకు ఎకరాకు రూ.27,801 రాయితీ ఉంటుందన్నారు. బిందు సేద్యం పరికరాలపై కూడా సబ్సిడీ ఇస్తున్నామన్నారు.