బ్యాంకాక్: తెలంగాణ స్టార్ ఆర్చర్ తానిపర్తి చికిత.. ఆసియా కప్ స్టేజ్–1 టోర్నమెంట్‌లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ నెగ్గి డబుల్ ధమాకా మోగించింది. శుక్రవారం జరిగిన కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్లో రజత్ చౌహాన్‌తో కలిసి బరిలోకి దిగిన పెద్దపల్లి అమ్మాయి చికిత 158–156 స్కోరుతో రెండోసీడ్ ఫాటిన్ నూర్ఫతేహా మత్ సల్లె–మొహమ్మద్ జువైదీ మజుకి (మలేసియా)పై గెలిచి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది.
కాంపౌండ్ టీమ్ విభాగం ఫైనల్లో చికిత–రాజ్ కౌర్–తేజల్ సాల్వేతో కూడిన ఇండియా టీమ్ 227–229 తేడాతో కజకిస్తాన్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మెన్స్ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ఇండియా ఆర్చర్లు క్లీన్‌స్వీప్ చేశారు. ఫైనల్లో ఉదయ్ కాంబోజ్145–144తో ప్రథమేశ్ జావ్‌కర్‌పై గెలవగా, కాంస్య పతక పోరులో రజత్ చౌహాన్ 145–144తో పీరవత్ రత్తనపొంగ్‌కియాత్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. కాంపౌండ్ విమెన్స్ వ్యక్తిగత కేటగిరీలో తేజల్ సాల్వే కాంస్యం గెలవగా, విమెన్స్ రికర్వ్ ఫైనల్లో ఓడిన రిధి ఫోర్ రజతంతో సంతృప్తిపడింది. దేవాంగ్ గుప్తా–సుక్‌చైన్ సింగ్–జుయెల్ సర్కార్‌తో కూడిన మెన్స్ రికర్వ్ జట్టు కూడా సిల్వర్ అందుకుంది. ఓవరాల్‌గా రెండు గోల్డ్, నాలుగు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ సాధించిన ఇండియా.. గత ఎడిషన్‌లో నెగ్గిన ఎనిమిది పతకాలను దాటేసింది.
