కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు.. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇచ్చేదే లేదు.. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం
  • అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం.. ఏకగ్రీవంగా సభ ఆమోదం 
  • క్యాచ్ మెంట్ ఏరియా, ఆయకట్టు ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలి 
  • రాష్ట్ర వాటాలో వాడుకోగా మిగిలిన నీళ్లను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయాలి
  • నాగార్జునసాగర్ నుంచి బలగాలను వాపస్ తీసుకోవాలని,  ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని మరో తీర్మానం 
  • ఉమ్మడి ఏపీ పాలన కంటే.. కేసీఆర్ పాలనలోనే  తెలంగాణకు తీవ్ర అన్యాయం :  ఉత్తమ్ 
  • మనకు రావాల్సిన వాటానూ ఏపీకే వదిలేసిండు
  • 299 టీఎంసీలే తీసుకుని, 512 టీఎంసీలు ఇచ్చిండు
  • జగన్​తో కలిసి బిర్యానీలు తిని, నీళ్లు ఎత్తుకుపోయేందుకు ఏపీకి సహకరించిండు
  • రాయలసీమ ప్రాజెక్టు కడుతున్నా అడ్డుకోలేదు 
  • కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు ఒప్పుకున్నదే కేసీఆర్ అని ఫైర్ 
  • కృష్ణా జలాల వాటా, ప్రాజెక్టులు, నాటి బీఆర్ఎస్ సర్కార్ తీరుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్  

హైదరాబాద్, వెలుగు : కృష్ణా జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని, కృష్ణా రివర్ మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్ఎంబీ)కు ప్రాజెక్టులను అప్పగించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా, దానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నది పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్​లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీ మధ్య నీటి పంపకాలను చేపట్టాలని తీర్మానంలో కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. నాగార్జునసాగర్​పై మోహరించిన సీఆర్​పీఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని, ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించాలని పేర్కొంటూ మరో తీర్మానాన్ని కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 

దీనికి కూడా సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అనంతరం కృష్ణా ప్రాజెక్టులు, నీటి వాటాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు చేసిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారు. మధ్యలో పదేపదే బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​రావు అడ్డుతగలగా, ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి నీళ్లు దోచిపెట్టిందే గత బీఆర్ఎస్ సర్కార్ అని, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులకు కేసీఆర్​పాపాలే కారణమని మండిపడ్డారు. 

ఎన్నికల ముందు సాగర్​పై కుట్రలు 

అసెంబ్లీ ఎన్నికలకు ఒక్క రోజు ముందు (2023 నవంబర్​29) ఏపీ సీఎం జగన్​తో కలిసి కేసీఆర్​కుట్రలు పన్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ‘‘ఆనాడు 400 మందికి పైగా ఏపీ పోలీసులు సాగర్ డ్యామ్​పైకి వచ్చి రైట్​సైడ్​మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. కేఆర్ఎంబీ పర్మిషన్​లేకుండానే కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసుకున్నారు” అని గుర్తు చేశారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ తరలించుకుపోయిన నీళ్ల కంటే.. 2014లో తెలంగాణ ఏర్పడినంక కేసీఆర్ హయాంలో ఏపీ అక్రమంగా తరలించుకుపోయిన నీళ్లే ఎక్కువ. కేసీఆర్ హయాంలోనే ఏపీ నీళ్ల దోపిడీ ఎక్కువైంది. ఈ పదేండ్లలో తెలంగాణకు రావాల్సిన నీళ్లలో 1,500 టీఎంసీలు ఏపీకి డైవర్ట్​ అయ్యాయి. అంటే 60 ఏండ్ల పాలనలో కన్నా.. పదేండ్ల బీఆర్ఎస్​పాలనలోనే తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది” అని మండిపడ్డారు. ‘‘కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించిందే కేసీఆర్. 2015 జూన్​18, 19న తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాలపై ఒప్పందం జరిగింది. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలను బచావత్​ ట్రిబ్యునల్​ కేటాయించగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక ఎక్కువ నీటి వాటాను తీసుకురావడంలో కేసీఆర్​ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తెలంగాణకు 299 టీఎంసీల వాటాకే ఒప్పుకుందన్నారు. పరీవాహక ప్రాంతం పెద్దగా లేని ఏపీకి మాత్రం 512 టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు ఒప్పుకుని, కేసీఆర్​సంతకం చేసి వచ్చారు” అని ఫైర్ అయ్యారు. 

కేసీఆర్, జగన్​ కలిసే నీళ్ల దోపిడీ..  

నీళ్ల విషయంలో అప్పటి సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్​ఎన్నోసార్లు చర్చలు జరిపారని ఉత్తమ్ తెలిపారు. ‘‘ఆ చర్చల్లో అలయ్​బలయ్​ చేసుకున్నారు. బిర్యానీలు తిన్నారు. కృష్ణా నీటి వాటాలపై కుమ్మక్కు రాజకీయాలు చేశారు. ఏపీ నీళ్లు ఎత్తుకుపోయేలా కేసీఆర్​చేశారు. తెలంగాణ నీళ్లను కూడా కేసీఆర్​ఏపీకి ఇస్తున్నారంటూ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం జగన్​స్వయంగా చెప్పారు. రాయలసీమ లిఫ్ట్​(సంగమేశ్వరం) ద్వారా శ్రీశైలం నుంచి రోజూ 3 టీఎంసీలను 779 అడుగుల నుంచి తీసుకునేందుకు ప్రాజెక్టు మొదలుపెట్టారు. కానీ అప్పుడు కేసీఆర్​స్పందించలేదు. కనీసం కోర్టుకు కూడా పోలేదు. ఆ ప్రాజెక్టుపై సీఎం రేవంత్​రెడ్డి రైతు గవినోళ్ల శ్రీనివాస్​తో కోర్టులో పిటిషన్​ వేయించారు. ఆ తర్వాత చాలా నెలలకు గవినోళ్ల శ్రీనివాస్​వేసిన కేసులోనే అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం ఇంప్లీడ్​అయింది’’ అని తెలిపారు. 

సాగర్​ ఎండిపోయే పరిస్థితి..

గత బీఆర్ఎస్​ప్రభుత్వ నిర్వాకం వల్లనే నాగార్జునసాగర్​ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘రాయలసీమ లిఫ్ట్​ఇరిగేషన్​స్కీమ్ ప్రాజెక్ట్ టెండర్​ప్రక్రియ జరగకుండా చూడాలంటూ కేఆర్ఎంబీకి 2020 జులై 25న నాటి ఈఎన్సీ లేఖ రాశారు. అదే ఏడాది ఆగస్టు 10 నాటికి ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టు టెండర్​ప్రక్రియను పూర్తి చేయాలని భావించింది. నిజానికి దానికి ఐదు రోజుల ముందే అంటే ఆగస్టు 5న అపెక్స్​కౌన్సిల్​మీటింగ్​జరగాల్సి ఉంది. కానీ, ఆ మీటింగ్​ను వాయిదా వేయాలంటూ 2020 జులై 30న నాటి చీఫ్​సెక్రటరీ కేంద్రానికి లేఖ రాశారు. ఆగస్టు 20 తర్వాత మీటింగ్​పెట్టాలని కోరారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతోనే రాయలసీమ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచేసింది. అపెక్స్ కౌన్సిల్​షెడ్యూల్​చేసిన రోజు మీటింగ్​కు పోయి ఉంటే టెండర్​ ప్రక్రియను ఆపి ఉండవచ్చు. కానీ, ఏపీకి సాయం చేయాలనే కేసీఆర్ ఇలా చేశారు. సుప్రీంలో ఉన్న కేసుపైనా నాటి ప్రభుత్వం స్పందన ఇవ్వలేదు’’ అని చెప్పారు.  

ప్రాజెక్టులు అప్పగిస్తామని కేంద్రానికి లేఖ రాసింది.. 

పోయినేడాది నవంబర్​29న ఏపీ పోలీసులు నాగార్జునసాగర్​డ్యామ్​ను ఆక్రమించుకోగా.. డిసెంబర్​1న కేంద్ర హోంశాఖ వర్చువల్​సమావేశాన్ని ఏర్పాటు చేసి, సాగర్​ డ్యామ్​ను కేఆర్ఎంబీకి అప్పగించిందని ఉత్తమ్ తెలిపారు. అదే రోజు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రెండు రాష్ట్రాలూ సూత్రప్రాయంగా అంగీకరించాయంటూ కేంద్రానికి నాటి ఇరిగేషన్​సెక్రటరీ స్మితా సబర్వాల్​లేఖ రాశారని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఏపీ ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేసుకుంది. 2004–05 నుంచి 2013–14 మధ్య పదేండ్లలో ఏపీ 727.15 టీఎంసీలు తరలించుకుపోతే.. 2013–14 నుంచి కేసీఆర్ పదేండ్ల పాలనలో 1,201.54 టీఎంసీలను అక్రమంగా తరలించుకుపోయింది’’ అని తెలిపారు.

మనకే ఎక్కువ నీళ్లు రావాలి.. 

క్యాచ్​మెంట్​ ఏరియా, కరువు ప్రాంతాలు, బేసిన్​ జనాభా, ఆయకట్టు తెలంగాణకే ఎక్కువగా ఉన్నాయని.. ఆ లెక్కన కృష్ణా జలాల్లో ఎక్కువ శాతం మనకే రావాలని ఉత్తమ్ తెలిపారు. ‘‘రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల్లో 70 శాతం వాటా కోసం అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డిమాండ్​ చేసి ఉండాల్సింది. కానీ, కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకున్నది. 2016 సెప్టెంబర్​ 21న తొలి అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​జరిగింది. ఆ సమావేశానికి నాటి తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. 2015–16 వర్కింగ్​అరెంజ్​మెంట్స్​ ప్రకారమే మరో ఏడాదిపాటు నీళ్లు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ మీటింగ్​లోనే ఎక్కువ వాటాను తెలంగాణ డిమాండ్​ చేసి ఉండాల్సింది. 2020 అక్టోబర్​ 6న రెండో అపెక్స్​ కౌన్సిల్​ మీటింగ్​ జరిగినప్పుడు.. ట్రిబ్యునల్​ఖరారు చేసే దాకా పాత పద్ధతిలోనే నీటి వాటాలను కేటాయించాలంటూ కేసీఆర్​స్పష్టం చేశారు. అప్పుడు కూడా అదే మాట చెప్పడంతో ఏపీ దాన్ని అలుసుగా తీసుకుని నీటిని తరలించుకుపోతున్నది. ప్రతి మీటింగ్​లోనూ ఆ పద్ధతిలోనే నీటిని కేటాయించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోరింది. దీంతోనే తెలంగాణ తీవ్రంగా నష్టపోతున్నది’’ అని వివరించారు. 

అప్పుడెందుకు వ్యతిరేకించలేదు? 

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పరిధిలోకి తీసుకొస్తూ 2021 జులై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్​నోటిఫికేషన్​ఇచ్చిందని.. దీన్ని అప్పుడున్న కేసీఆర్​ సర్కార్​ఎందుకు వ్యతిరేకించలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ‘‘శ్రీశైలంలోని తొమ్మిది ముఖ్యమైన కాంపోనెంట్లు, నాగార్జునసాగర్​ప్రాజెక్టులను ఏపీకి అప్పగించేందుకు 2021 అక్టోబర్​12న హైదరాబాద్​లో జరిగిన కేఆర్ఎంబీ 15వ సమావేశంలో నాటి కేసీఆర్​సర్కార్​ఒప్పుకుంది. దాని వల్ల విద్యుత్ కేంద్రాల నిర్వహణ, వరద ఎక్కువొచ్చే నెలల్లో వరద నియంత్రణలు మన చేతి నుంచి వెళ్లిపోయాయి. 2022 మేలో జరిగిన 16వ కేఆర్ఎంబీ మీటింగ్​లోనూ వాటిని అప్పగించేందుకు, రూల్​కర్వ్స్​ను ఖరారు చేసేందుకు నాటి కేసీఆర్​సర్కార్​ అంగీకరించింది” అని తెలిపారు. 

తీర్మానంలోని ముఖ్యాంశాలివీ..

  •     పరీవాహక ప్రాంతం, కరువు ప్రభావిత ప్రాంతాలు, బేసిన్​లోని జనాభా, ఆయకట్టును ప్రామాణికంగా తీసుకుని తెలంగాణ, ఏపీల మధ్య నీటి పంపకాలు చేయాలి.
  •     కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్–1 (కేడబ్ల్యూడీటీ–1) అవార్డ్​ ప్రకారం.. బేసిన్ ​అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటి వాటాలు కేటాయించాలి. 
  •     నాగార్జునసాగర్​ ప్రాజెక్టుకు 264 టీఎంసీల నీటిని తరలించే ఉద్దేశంతో శ్రీశైలం ప్రాజెక్టును కట్టారు. ప్లానింగ్​కమిషన్​సూచనల మేరకు దాన్ని 1962లో జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుగా నిర్మించారు. ఆ ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకునే కనీస నీటిమట్టాన్ని 830 అడుగులుగా కేడబ్ల్యూడీటీ–1 నిర్ధారించింది. దానికి కట్టుబడి ఉండాలి. 
  •     సెంట్రల్​వాటర్​కమిషన్​ఆదేశాలకు అనుగుణంగా చెన్నై తాగు నీటి అవసరాల కోసం 15 టీఎంసీలు, ఎస్ఆర్​బీసీకి 19 టీఎంసీలుగా లిమిట్​ పెట్టాలి.  
  •     కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రకారం తాగునీటి కోసం విడుదల చేసే నీళ్లలో కేవలం 20 శాతం నీటినే వాడుకున్నట్టుగా పరిగణించాలి. 
  •     కేడబ్ల్యూడీటీ–1 అవార్డు ప్రకారం రాష్ట్రానికి ఉన్న నీటి వాటాలో ఏటా వాడుకున్నంక.. మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకునేలా అనుమతించాలి. అలా వాడుకున్న నీళ్లను ఆ ఏడాది వాడుకున్న నీటి లెక్కల్లో కలపకూడదు.  
  •     కేంద్ర జలశక్తి శాఖ, సెంట్రల్​వాటర్​కమిషన్​అనుమతి లేకుండా బేసిన్​ అవతలకు (నది పరీవాహక ప్రాంతం కాని ఏరియాలు) నీటిని తరలించే అనధికారిక ప్రాజెక్టులు, ప్రాజెక్టుల విస్తరణ, కొత్త కాంపోనెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దు.