
సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో సివిక్ సెన్స్‌పై, అందులోనూ భారతీయుల సివిక్ సెన్స్‌పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటీ సివిక్ సెన్స్? తెలుగులో ‘పౌర స్పృహ’ అనలేం గానీ ‘సామాజిక స్పృహ’ అనొచ్చు! మనది భరత జాతి. మనది గొప్ప సంస్కృతే. కాదనలేం. మన సింధూ నాగరికత(ఇండస్వ్యాలీ సివిలైజేషన్), ఘనమైన హరప్పా సంస్కృతి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికి 5వేల ఏండ్ల క్రితమే మనది పరిణతి చెందిన అర్బన్ సొసైటీ. అప్పట్లో ప్రణాళికాబద్ధమైన పట్టణాలను నిర్మించుకున్నాం. పక్కారోడ్లు, భూగర్భ డ్రైనేజీలు, పరిశుభ్రమైన వీధులు, పబ్లిక్‌హెల్త్ సిస్టమ్.. ఇదీ మన గతం.
ప్రపంచానికే దిక్సూచిలా నిలిచిన ఒకప్పటి ఇండియా ఇప్పుడు ఎలా ఉంది? ఏ పట్టణాన్ని చూసినా, ఏ నగరాన్ని చూసినా ఏమున్నది గర్వకారణం? అడ్డగోలు నిర్మాణాలు, అధ్వానపు రోడ్లు, గల్లీ మొదలు మెయిన్‌రోడ్ల దాకా అంతా గజిబిజి గందరగోళం. నిత్య ట్రాఫిక్ జామ్‌లు.. నడవ వీలులేని ఫుట్పాత్లు.. మొహం మీదికి కొట్టుకొచ్చే దుమ్ము, ధూళి, చెత్త.. వీధుల్లో పొంగిపొర్లే నాలాలు.. కవర్లు, ప్లాస్టిక్బాటిళ్లతో నిండిన డ్రైన్లు.. పబ్లిక్ ప్లేసుల పరిస్థితి మరీ అధ్వానం. పార్కులు, బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ఆఖరికి రైలు పెట్టెల్లో కంపుగొట్టే టాయిలెట్లు, సింకుల్లో సిగరెట్ పీకలు.. నమిలి పడేసిన బబుల్‌గమ్‌లు.. గోడలపై గుట్కా మరకలు.. ఇలా మన అర్బన్ వ్యవస్థ కాస్తా సరిదిద్దుకోలేని అవస్థగా మారింది.
ఎందుకిలా..?
ప్రస్తుత దుస్థితికి పాలకుల తప్పు లేదని కాదు. కానీ పౌరులుగా మనం ఏంచేస్తున్నామో ఆత్మ విమర్శ చేసుకోవాలి. చట్టాలను గౌరవించడం, ప్రజా ఆస్తులను పరిరక్షించడం, వాటిని పరిశుభ్రంగా ఉంచడం, సకాలంలో పన్నులు చెల్లించడం, ప్రభుత్వ సిబ్బందికి సహకరించడం, తోటివారితో మర్యాదగా నడుచుకోవడం, ఇతరుల గోప్యతను కాపాడడం.. ఇవన్నీ సివిక్ సెన్స్‌లో భాగమే. కానీ మనమేం చేస్తున్నాం? నో పార్కింగ్ జోన్లలో వెహికల్స్ పార్క్ చేస్తున్నాం. ఎక్కడికైనా ముందు చేరుకోవాలంటే ముందుగా బయలుదేరాలి. కానీ లేటుగా బయలుదేరి ముందుగా పోవాలనుకుంటున్నాం. ఈ క్రమంలో సిగ్నల్ జంపింగ్‌లు, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌లతో ట్రాఫిక్‌జామ్‌లకు కారణమవుతున్నాం. దీనికితోడు సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవింగ్‌లతో ప్రమాదాలు తెచ్చుకుంటున్నాం. కొందరు ట్రాఫిక్‌లో బైకులపై వెళ్తూనో, బస్సు కిటికీ పక్కన కూర్చొనో తుపుక్కున ఉమ్మివేస్తారు. అది వెనుక, పక్కన వచ్చేవాళ్లపై
పడుతుందనే కనీస సోయి ఉండట్లేదు.
వాక్స్వాతంత్ర్యానికీ హద్దులున్నాయ్!
రాజ్యాంగంలోని ఆర్టికల్19 మనకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. మన వాక్స్వాతంత్ర్యం పరిమితి.. ఎదుటి వాళ్ల మనోభావాలు గాయపడనంతవరకే! కానీ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ముమ్మాటికీ తప్పే! ముఖ్యంగా సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వ్యక్తిత్వ హననం చేయడం ఇటీవలి కాలంలో పెరిగింది. ఆ మధ్య మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ రఘునందన్‌రావు నూలు దండ వేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో తప్పుడు అర్థం వచ్చేలా కొందరు ట్రోల్ చేశారు. మరో మంత్రి సీతక్కతో పలుమార్లు కంటతడి పెట్టించారు. ఏపీలో గత సర్కారు ద్వారా పొందిన లబ్ధిని వివరిస్తూ ఓ యూట్యూబ్ చానల్ ముందు హర్షం వ్యక్తం చేసిన గీతాంజలి అనే మహిళపై.. పలు సోషల్ మీడియా మూకలు, ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు చేసిన విపరీత చేష్టల వల్ల ఆమె సూసైడ్ చేసుకుంది.
ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి ఇంటిగుట్టును రచ్చకీడుస్తున్నారు. ఈ దాడి మన సెలబ్రెటీలతోనే ఆగలేదు. విదేశీయులను, ముఖ్యంగా వెస్ట్రన్ యువతులను సైతం రాయలేని భాషలో ట్రోల్ చేస్తున్న వారిలో భారతీయులే ముందున్నారని ఇటీవలి ఓ అధ్యయనం తేల్చింది. విదేశీ వనితలు అంటేనే వేశ్యలు అన్న ట్లుగా ఇండియన్స్ ప్రవర్తన ఉంటోందని, భారతీయుల్లో లోపించిన సివిక్ సెన్స్‌కు ఇది అద్దం పడ్తోందని ఇటీవల లండన్‌లోని ఓ ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో వాపోయాడు.
తెలంగాణకు 11వ స్థానం
ఈ ఏడాది మార్చిలో ఇండియా టుడే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ‘సివిక్ బిహేవియర్, పబ్లిక్ సేఫ్టీ, జెండర్ ఆటిట్యూడ్, డైవర్సిటీ అండ్ డిస్క్రిమినేషన్’ కేటగిరీల్లో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో సహజంగానే కేరళ, తమిళనాడు మొదటి రెండు స్థానాల్లో ఉంటే తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రజల్లో సామాజిక స్పృహ కాస్త ఫర్వాలేదనిపించినా అర్బన్ ఏరియాల్లో ముఖ్యంగా నగరాల్లో సివిక్ సెన్స్ తగ్గుతోందని ఈ సర్వే తేల్చింది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది జనంలోని సివిక్ సెన్స్‌కు ఓ సంకేతం. హైదరాబాద్‌లాంటి నగరంలోనే కాదు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదాహరణకు 3 లక్షల జనాభా మాత్రమే ఉండే కరీంనగర్‌లాంటి ఒక చిన్న సిటీలో పరిస్థితిని చూద్దాం.
ఈ ఏడాది జూన్ 27 నుంచి ఈ సిటీలో సీసీ టీవీ కెమెరాలు అందుబాటులోకి తెచ్చిన ట్రాఫిక్ పోలీసులు 21 రోజుల్లో జరిగిన ఉల్లంఘనలు చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. మూడువారాల్లో ఏకంగా 13వేల869 ట్రాఫిక్ వాయిలేషన్స్ జరగగా, అందులో 8,808 ట్రిపుల్ రైడింగ్ కేసులు, 418 రాంగ్‌రూట్ డ్రైవింగ్‌లు కేసులున్నాయి. కార్లలో సీట్ బెల్ట్ ధరించకుండా చిక్కినవాళ్లు 3,437 మంది ఉన్నారు. ఏకంగా 1.13 కోట్ల ఫైన్లు పడ్డాయి. ఇంకా ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు లెక్కలోకి తీసుకోలేదు.
అందరూ బాగుండాలి..
‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి..’ అనే మాట ఈ మధ్య బాగా ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి అందరం బాగుంటేనే మనం బాగుంటాం. అదే సివిక్ సెన్స్. ఇలాంటి ఆలోచనాపరులంతా కలిసి కమ్యూనిటీ సొసైటీలు ఏర్పాటుచేసుకోవాలి. కనీసం వీకెండ్స్‌లో ఉదయమో, సాయంత్రమో అందరూ కలిసి రోడ్లను, కాలువలను, చెరువులను, పార్కులను శుభ్రం చేసుకోవడంతోపాటు మిగిలిన వారికి అవగాహన కల్పించాలి.
జపాన్‌లో ఇలాంటి సివిక్ సొసైటీలు ప్రతివారం వాళ్ల కాలనీల్లో రోడ్లు,కాలువలను, వాటర్‌ట్యాంకులను శుభ్రం చేసుకోవడం ఒకవేడుకలా నిర్వహిస్తున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా చేయిచేయి కలుపుతున్నారు. ఇలాంటి కల్చర్ మన దగ్గర వస్తే క్రమంగా అందరిలోనూ మార్పువస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కండ్లు తెరవాలి. సివిక్ సెన్స్‌ను ఒక సబ్జెక్టుగా విద్యార్థులకు బోధించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలి.
మన సివిక్ సెన్సే.. మన హ్యాపీనెస్!
ఏటా ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ డబ్ల్యూహెచ్ఆర్ విడుదల చేస్తుంది. అంటే ప్రపంచంలో ఏ దేశ ప్రజలు అత్యంత సంతోషంగా ఉన్నారో లెక్కేసి ఈ రిపోర్ట్ ఇస్తోంది. ఇందులో ప్రధానంగా జీడీపీ, పాలనలో ప్రజల భాగస్వామ్యం, ప్రజారోగ్యం, స్వేచ్ఛ, నీతి, నిజాయితీలాంటి అంశాలతోపాటు ఒకరిపట్ల ఒకరికి ఉన్న విశ్వాసం, సామాజిక సంబంధాలు, తోటివారిపట్ల దయ, సమాజం పట్ల కృతజ్ఞత లాంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.
2025 వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్‌లాంటి దేశాలు మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా, మన ఇండియా స్థానం ఎంతో తెలుసా? ఏకంగా 118. మనకంటే నేపాల్(92), పాకిస్థాన్(109) ముందువరసలో ఉండడం విచారకరం. అందుకే మన సంతోషం మన చేతుల్లోనే, అంటే మన సివిక్ సెన్స్‌లో ఉందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ఎయిర్ ఇండియా తిరుగు ప్రయాణమే ఓ ఉదాహరణ
ఇటీవలి ఓ ఉదాహరణ చెప్పుకుందాం. 2025 మార్చి 5న 300 మంది ప్రయాణికులతో చికాగో నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం AI126 ఐదు గంటల ప్రయాణం తర్వాత తిరిగి వెనక్కి వచ్చింది. ఇండియన్ ప్యాసింజర్ ప్లంబింగ్ సిస్టమ్‌లోకి పాలిథీన్ బ్యాగులు, గుడ్డలు కుక్కడం వల్ల 12 టాయిలెట్లలో ఎనిమిది పనిచేయకుండా పోయాయి. ఈ సంఘటన ఆ రోజు ప్రపంచవ్యాప్త మీడియాలో ప్రధాన వార్తగా నిలిచింది.
ఇది భారతీయులందరికీ జరిగిన అవమానం కాదా? చారిత్రక నగరాలు, టూరిజం స్పాట్లు, టెంపుల్ టౌన్స్ ఇలా దేశంలో ఎక్కడికి వెళ్లినా చెత్త, మురుగుతో నిండిన రోడ్లు.. అడుగడుగునా సహనాన్ని పరీక్షించే ట్రాఫిక్.. నడవ వీలులేని ఫుట్పాత్లు.. ప్రాణం విలువ తెలియని డ్రైవర్లు, విదేశీ పర్యాటకుల మీద పెరుగుతున్న అత్యాచారాలతో ఇండియా టూరిజానికి ఇప్పటికే ఎనలేని నష్టం జరిగింది. దీనిని సరిదిద్దే కనీస ప్రయత్నం చేయని మన ప్రభుత్వాలకు ఎయిర్ ఇండియా ఘటన అంతపెద్ద అవమానకరంగా అనిపించకపోవచ్చు!
- మల్లేశం చిల్ల,
సీనియర్ జర్నలిస్ట్