
మూడు దశాబ్దాల కిందట మహిళలు బతుకమ్మ ఆడుతుంటే ‘వాటీజ్ దిస్’ అని ఎలైట్ కమ్యూనిటీ వాళ్లు, వేరే రాష్ట్రంవాళ్లు ముక్కు విరుస్తూ అడిగేవాళ్లు. కానీ, నేడు రాష్ట్రంలోని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, జాతీయ పరిశోధనా సంస్థలు, అత్యంత సంపన్నులు ఉండే గేటెడ్ కమ్యూనిటీతో సహా రాష్ట్రం అంతటా మహా వేడుకగా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఇస్లాం దేశాలైన సౌదీ అరేబియా మొదలుకొని ఎన్నో దేశాల్లో తెలుగువాళ్లున్న ప్రతిచోట నేడు బతుకమ్మ వేడుకలు జరుపుతున్నారు. ‘తెలంగాణ సంప్రదాయ వేడుక పట్ల పెరిగిన క్రేజ్ ఇది’ అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.
గణేశ్ ఉత్సవాల్లాగే బతుకమ్మ వేడుక క్రమ క్రమంగా మహా వేడుకగా మారింది. స్వాతంత్ర్యసమరం వేళ ఉద్యమకారులందరినీ ఏకం చేసేందుకు బాలగంగాధర్ తిలక్ ప్రారంభించిన గణేశ్ ఉత్సవాలు నేడు భారతదేశం అంతటా పల్లె నుంచి మహా నగరం దాకా గల్లీ గల్లీలో ఏవిధంగానైతే నిర్వహిస్తున్నారో.. బతుకమ్మ వేడుకలు కూడా అదేవిధంగా విస్తరించాయి.
గతంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. ఆ గ్రామాల్లో కూడా జమీందారులు, దొరలు ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేవారు కాదు. బడుగు, మధ్యతరగతి ప్రజలు మాత్రమే ఎక్కువగా బతుకమ్మను ఆడేవారు.
తెలంగాణకు పర్యాయపదమే బతుకమ్మ
కర్నాటక సరిహద్దు జిల్లాల్లో ఈ ఉత్సవాలు అంతంత మాత్రమే ఉండేవి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ పల్లెల్లోని పేద, మధ్యతరగతి మహిళలు జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు నేడు తెలంగాణ అంతటా మహా వేడుకగా సాగుతున్నాయి.
గతంలో కొన్నివర్గాలకే పరిమితం అయిన బతుకమ్మ పండుగను నేడు ధనిక, పేద అన్న తేడా లేకుండా, పల్లె-, పట్నం అన్న భేదం లేకుండా రాష్ట్రం అంతటా జరుపుకుంటున్నారు. ఒకప్పుడు హైదరాబాద్లో బస్తీలకే పరిమితమైన బతుకమ్మ నేడు ఎలైట్ గ్రూపు నివసించే అన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రధాన వేడుకగా మారింది. తెలంగాణ అంటేనే బతుకమ్మగా మారింది.
ఉద్యమానికి బతుకమ్మ ఆక్సిజన్ అందించింది
బతుకమ్మ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మలి తెలంగాణ ఉద్యమానికి బతుకమ్మ ఒక టూల్. ఉద్యమం వేళ ఆందోళన అయినా, ధర్నా అయినా, గ్రామం నుంచి మొదలుకొని పట్టణం దాకా ఎక్కడ సమావేశమైనా సరే అక్కడ బతుకమ్మ ఉండేది. సీజన్ తో సంబంధం లేకుండా ఉద్యమానికి బతుకమ్మ ఆక్సిజన్ అందించిందని ఒక ఉద్యమకారుడు తన కవితలో రాసుకున్నాడు.
ఉద్యమంలో బతుకమ్మ భాగస్వామిగా మారిన తర్వాత ఆ వేడుకపై యావత్ ప్రజానీకానికి గౌరవం, భక్తి పెరిగింది. క్రమక్రమంగా బతుకమ్మ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసింది. వివిధ వర్గాలుగా, కులాలుగా విడిపోయిన తెలంగాణను, సైద్దాంతిక వైరం ఉన్న రాజకీయ పార్టీలను సైతం బతుకమ్మ ఏకం చేసింది. కమ్యూనిస్టు పార్టీలో బతుకమ్మ వేడుకలు జరిగాయి, ఇటు బీజేపీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడారు.
న్యూజనరేషన్లో పెరిగిన ఆసక్తి
జనరేషన్ మారుతున్నకొద్దీ మన అలవాట్లు, మన జీవన గమనంలోనే మార్పులు రావడం సహజం. అట్లానే బతుకమ్మ వేడుకలో కూడా సౌండ్ బాక్సులు, డిజే పాటలు వచ్చాయి. పది, - ఇరవై మంది మహిళల నుంచి నేడు వేల మంది ఏకకాలంలో బతుకమ్మ ఆడే స్థితి వచ్చింది.
ఇలాంటి వేళ ‘సంప్రదాయన్ని మంట గలుపుతున్నారు’... ‘ఇదేం పద్ధతి’, ‘అదేం పద్ధతి’ అంటూ యువతులను నిరుత్సాహపరచొద్దని నేను కోరుతున్నా. కాలేజీ అమ్మాయిలు, ఐటీ యువతులు మొదలుకొని యావత్ మహిళా సమాజం ఈ పండుగ కోసం ఎదురు చూస్తున్నది. బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తం అవుతోంది. బతుకమ్మ కేవలం పండుగ కాదు.. మన సంప్రదాయాన్ని, సంస్కృతిని తరతరాలకు అందించే వేడుక.
మలుపు తిప్పింది V6 న్యూస్
తెలంగాణ పోరాటంలో బతుకమ్మ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజాన్నీ ఆకర్షించింది. బతుకమ్మ నేడు విశ్వవ్యాప్తం కావడంలో మీడియా కీలకంగా పనిచేసింది. బతుకమ్మ వేడుకలను మలుపు తిప్పింది V6 News అని చెప్పక తప్పదు.
పురాతన బతుకమ్మ వేడుకకు ఆధునికతను జోడించింది V6 News మాత్రమే. గ్రామీణ పాటల నుంచి నేడు నవీన పాటలతో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయంటే.. అది V6 News చేసిన టర్నింగ్ పాయింట్ అని ఒప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నవేళ బతుకమ్మకు ఆధునిక సంగీతంతో కూడిన సంప్రదాయక పాట ఉండాలని V6 News చేసిన ప్రయత్నం తర్వాత అదొక విప్లవంలా మారింది.
తమ ఛానల్లో బతుకమ్మ వేడుకను చూపాలంటేనే విసుక్కునే న్యూస్ చానల్స్ కూడా ప్రత్యేకంగా బతుకమ్మ కోసం పాటలు అందించాయి. V6 News లో బతుకమ్మ పాటలు పాడినవాళ్లకు, రాసిన వాళ్లకు సినిమాల్లో రెడ్ కార్పెట్ ఎంట్రీ దొరికిందంటే సంగీత ప్రపంచంలో ఇంతకంటే పెద్ద విప్లవం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను.
- జె.సంగప్ప,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి–