రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ.. చైర్మన్‎గా MP ఆర్.కృష్ణయ్య

రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ.. చైర్మన్‎గా MP ఆర్.కృష్ణయ్య
  • చైర్మన్​గా ఎంపీ ఆర్​.కృష్ణయ్య.. వర్కింగ్​ చైర్మన్​గా జాజుల శ్రీనివాస్​గౌడ్
  • వైస్ చైర్మన్ గా వీజీఆర్​ నారగోని, కో చైర్మన్లుగా దాసు సురేశ్, రాజారాం యాదవ్, కో ఆర్డినేటర్​గా గుజ్జ కృష్ణ 
  • బీసీ సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమై జేఏసీగా ఆవిర్భావం
  • స్థానిక ఎన్నికల్లోనే కాదు చట్టసభల్లోనూ బీసీ కోటా కోసం ఉద్యమిస్తామని ప్రకటన
  • ఈ నెల 13న నేషనల్​ హైవేల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్​ వాయిదా.. ఉమ్మడిగా ఈ నెల 18న రాష్ట్ర బంద్​
  • దేశాన్ని కదిలించేలా ఉద్యమిస్తం: ఆర్​.కృష్ణయ్య
  • అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది: జాజుల


హైదరాబాద్/ బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లేందుకు ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఏర్పాటైంది. జేఏసీ చైర్మన్ గా ఎంపీ ఆర్​.కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్​గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా వీజీఆర్​ నారగోని, కో చైర్మన్లుగా దాసు సురేశ్, రాజారాం యాదవ్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణను ఎన్నుకున్నారు. 

ఆదివారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, ఉద్యోగులు సమావేశమయ్యారు. స్థానిక ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టు ద్వారా కూడా అడ్డుకోవాలని కొందరు ప్రయత్నిస్తుండడంతో ఉమ్మడి ఎజెండాతో ఉద్యమించాలని సమావేశంలో నిర్ణయించారు. 

ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ‘తెలంగాణ బీసీ జేఏసీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేను నిరసిస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిన ‘ఈ నెల 13న జాతీయ రహదారుల దిగ్బంధం’, ఆర్. కృష్ణయ్య ఇచ్చిన ‘ఈనెల 14న రాష్ట్ర బంద్​’ కార్యక్రమాలను వాయిదా వేసి.. ఈ నెల 18న రాష్ట్ర బంద్‎ను చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. 

చట్టసభల్లోనూ కోటా దక్కేదాకా: ఆర్​.కృష్ణయ్య

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్​, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు.  ఈ అన్యాయాన్ని నిరసిస్తూ బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై పోరాడాలని.. అట్ల పోరాడితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి బీసీ రిజర్వేషన్లు చేపడ్తాయని ఆయన తెలిపారు. 

ఇకపై జరిగే బీసీ రిజర్వేషన్ల ఉద్యమం భవిష్యత్తులో చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు సాధించే వరకు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ఈ నెల 14న నిర్వహించాల్సిన రాష్ట్ర బంద్​ను 18కి వాయిదా వేశామని.. 18న జరిగే బంద్​ను పార్టీలకతంగా బీసీలు పాల్గొని విజయవంతం చేయాలని ఆర్​.కృష్ణయ్య కోరారు.

 బీసీల్లోని ప్రతి కుల సంఘాల నుంచి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, వాళ్లకు తగిన బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదని, చట్టసభల్లోనూ కోటా దక్కే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో తెలంగాణ బీసీ జేఏసీ తరఫున చేపడ్తున్న రాష్ట్ర బంద్​ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  

రాబోయే వారం రోజుల కార్యాచరణను ఇప్పటికే మొదలు పెట్టామని, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పని చేశామో, అంతకన్నా ఎక్కువగా బీసీ ఉద్యమాన్ని నడిపిస్తామని ఆయన చెప్పారు. అన్ని పార్టీలను ఉద్యమంలో కలుపుకొని పోతామన్నారు. ఒక రాష్ట్రంలో ఉద్యమం జరిగితే ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల్లో కూడా పడుతుందని, దేశాన్ని కదిలించే విధంగా  బీసీ ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆర్​.కృష్ణయ్య స్పష్టం చేశారు.

బీసీల బలం చూపిస్తం: జాజుల

రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు దక్కాల్సిన నోటికాడి ముద్దను పిడికెడు శాతం లేని వాళ్లు అడ్డుకున్నారని తెలంగాణ బీసీ జేఏసీ వర్కింగ్​ చైర్మన్​ జాజుల శ్రీనివాస్ గౌడ్  మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులకు, ప్రభుత్వాలకు సెగ పుట్టియడానికి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. అందుకు రాష్ట్రంలో ఉన్న ప్రధాన బీసీ సంఘాలను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని బీసీ జేఏసీగా ఏర్పాటయ్యామని తెలిపారు.

 ఈ నెల 18న జరిగే బంద్​ ద్వారా బీసీల బలం, శక్తి ఏందో రుచి చూపిస్తామని ఆయన హెచ్చరించారు. పార్టీలుగా, సంఘాలుగా విడిపోయిన బీసీ శ్రేణులను ఒక్కటిచేసి తెలంగాణలో బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేస్తామన్నారు. ‘‘బీసీలు తినే కంచంలో మన్ను పొసే వారికి వ్యతిరేకంగా బీసీ జేఏసీ ఏర్పడింది. 60 శాతం జనాభాకు 5 శాతం ఉన్నవాళ్లు సవాల్​ విసిరారు. దాన్ని స్వీకరిస్తున్నం. ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఉద్యమానికి సిద్ధమవుతున్నం.

 అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. 60శాతం ఉన్న బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే రెడ్డి జాగృతి అడ్డుకున్నది. మాధవ రెడ్డి , గోపాల్ రెడ్డి  ఇద్దరు వ్యక్తులకే రెడ్డి సమాజం అండగా ఉందా? వీళ్ల ఆధిపత్యాన్ని బొంద పెట్టడానికి బీసీ జేఏసీ ఏర్పడింది. బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకునేలా జేఏసీ పనిచేస్తుంది” అని ఆయన చెప్పారు.

 చట్టసభల్లోనూ బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ బంద్ కార్యక్రమాన్ని ఆయుధంగా మారుస్తామన్నారు. బంద్​ తర్వాత ఢిల్లీ వేదికగా పోరాటాలు చేస్తామని.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పునపరిశీలన, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేసే దిశగా ప్రతిపక్షాలను ఐక్యం చేసి, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పేర్కొన్నారు. 

బంద్​కు విద్యా సంస్థలు , ఆర్టీసీ యాజమాన్యం, వ్యాపారులు, ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీల ఓట్లు కావాలంటే రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ కు మద్దతు ఇవ్వాలన్నారు. మద్దతు ఇవ్వని పార్టీలకు బీసీల ఓట్లు బంద్ పెడ్తామని చెప్పారు.

 సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 బీసీ కుల సంఘాలతో పాటు నేతలు కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్, కొండ దేవయ్య పటేల్ , శేఖర్ సగర, నీల వెంకటేష్, తాటికొండ విక్రంగౌడ్, కనకాల శ్యాం కుర్మా  తదితరులు పాల్గొన్నారు.