తెలంగాణ పెద్ద పండుగ : దసరా సంబురం.. పల్లె పల్లెలో వేడుకలు

తెలంగాణ పెద్ద పండుగ : దసరా సంబురం.. పల్లె పల్లెలో వేడుకలు

తెలంగాణ ప్రజలకు పెద్ద పండుగ దసరా. పల్లె.. పట్నం తేడా లేకుండా చిన్నాపెద్దా అందరికీ పెద్ద సంబురం. ఈ పండుగకి ఉన్నోళ్లు, లేనోళ్లు అని లేకుండా అంతా కొత్త బట్టలు కట్టుకుంటారు. యాట కూర తింటారు. ప్రతి ఇంట్లో పిండి వంటలూ ఘుమఘుమ లాడతాయి. పట్నాలకు పోయి బతికెటోళ్లు, అత్తగారింటికెళ్లిన ఆడబిడ్డలు కూడా ఈ పండుగకి సొంతూళ్లకొచ్చి ఆనందంగా ఆడిపాడతారు. 'జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకవర్ధిని శైలసుతే".. అంటూ అమ్మవారికి ఘనంగా పూజలు చేస్తారు. జమ్మి ఆకుని బంగారం'గా పంచుకుంటూ అలయ్ బలయ్ చేసుకుంటారు. పాలపిట్టల్ని వెతుక్కుంటూ పొలం గట్లపైకి వెళ్తారు. నవరాత్రుల్లో వివిధ రూపాల్లో రాక్షసులను వెంటాడి అంతం చేస్తుంది దుర్గాదేవి. చివరి రోజున శాంతి స్వరూపిణిగా శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. చేతిలో చెరకు అభయం ఇస్తుంది. ఆ విజయానికి గుర్తుగా పదో రోజు దసరా పండుగ చేసుకుంటారు. ఎన్నో విజయాలను మోసుకొచ్చిన దసరా రోజు అమ్మని భక్తితో కొలుస్తారు అంతా. ఈ పండుగలో జమ్మి ఆకు, పాలపిట్ట కూడా ప్రత్యేక ఆకర్షణ.

ఎర్రటి చీరలో

సద్దుల బతుకమ్మ దాకా రకరకాల పూలతో బతుకమ్మల్ని పేర్చి చుట్టూ చేరి సంబురాలు జరుపుకుంటారు ఆడపడుచులు. దశమి రోజు మాత్రం అమ్మకి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి పూజలు చేసేవాళ్లు పొద్దుపొడవక ముందే నిద్రలేస్తారు. తలస్నానాలు చేసి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుంటారు. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టి పూజ గదిని అందంగా పూలతో అలంకరిస్తారు. దసరా రోజు ఎర్రటి పట్టు బట్టలు కట్టుకుని పూజ చేస్తే రాజరాజేశ్వరి దేవి అనుగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు పూజలో కూర్చునేవాళ్లు ఎర్ర రంగు సందర్భం బట్టలు కట్టుకుంటారు. అమ్మవారి ముందు ఎర్రటి అక్షింతలు, ఎర్రటి గాజులు, కనకాంబరం పూలు పెడతారు. ఆయుధ పూజ కూడా చేస్తారు.

ఆయుధ పూజ

మహాభారతంలో పాండవులు జమ్మిచెట్టు పై నుంచి ఆయుధాల్ని దించి పూజించారట.. ఆనాటి నుంచి తరతరాలుగా ఆయుధపూజ ఒక సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజు పిల్లల పుస్తకాల నుంచి రైతుల నాగళ్ల దాకా.. సైకిల్ నుంచి యుద్ధ విమానాల దాకా, కూలీ పనులు చేసేవాళ్లు, కులవృత్తుల వాళ్లు, వ్యాపారులు...అందరూ తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని పూజించి గౌరవిస్తారు. అలాగే సైకిల్ నుంచి ట్రాక్టర్ వరకు అన్ని వాహనాలకు పూజలు చేస్తారు.

జమ్మి చెట్టు

పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు క్షీరసాగర మథనం చేపట్టినప్పుడు... పాలకడలి నుంచి కల్పవృక్షంతో పాటు మరికొన్నిదేవతా వృక్షాలు పుట్టాయట. వాటిల్లో జమ్మి చెట్టు కూడా ఉంది. ఇంతకుముందు యజ్ఞ యాగాల్లో జమ్మిచెట్టు కర్రలతో నిప్పు పుట్టించేవాళ్లట. అలాగే వనవాసానికి వెళ్లిన రాముడు జమ్మి చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. రావణుడితో యుద్ధానికి ముందు జమ్మి ఆకులతో ఆదిపరాశక్తిని పూజించాడు. తిరిగి అయోధ్యకి వెళ్లేటప్పుడు కూడా జమ్మి చెట్టుకు పూజలు చేశాడు. మహా భారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లేముందు తమ బట్టల్ని, ఆయుధాల్ని జమ్మి చెట్టుపైన దాచి ఉంచారు పాండవులు. అజ్ఞాత వాసం ముగిశాక జమ్మి చెట్టుకి పూజలు చేసి ఆయుధాల్ని దించి కౌరవ సేనని తరిమికొట్టారు. ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే విజయదశమి రోజు జమ్మి చెట్టుని దేవీ ప్రతిరూపంగా కొలుస్తారు అంతా. జమ్మి ఆకుని బంగారంగా పంచుకుంటూ అలయ్ బలయ్ చేసుకుంటారు. పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు.

పాలపిట్ట

పాండవు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా వాళ్లకు పాలపిట్ట మొదట కనిపించిందట! అప్పటినుంచి వాళ్లు వరుస విజయాలు సాధించారు. అందుకే విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్టను చూడాలనే నమ్మకం ఏర్పడింది. దసరా రోజు సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు పూజ చేసి... ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళ్తారు అంతా. దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని, దోషాలు తొలగి చేసే పనిలో విజయం దక్కుతుందని నమ్ముతారు.

నైవేద్యాలు, పిండి వంటలు

నవరాత్రుల్లో ఒక్కో రూపంలో ఉండే అమ్మవారికి ఒక్కో నైవేద్యం పెడతారు. అలాగే దసరా రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు. దాంతో పాటు గారెలు, పులిహోర, పొంగలి, అరటిపండ్లు, లడ్డూలు, పాయసం.. ఇలా స్తోమతను బట్టి అమ్మవారికి నైవేద్యాలు పెడతారు. దసరా వచ్చిందంటే ప్రతి ఇంట్లో అప్పాలు కచ్చితంగా ఉండాల్సిందే. దసరా రోజు నాన్వెజ్, రకరకాల పిండి వంటలతో పండుగని ఎంజాయ్ చేస్తారు. కారం అప్పాలు, కారప్పూస, మాంసం కూరలోకి పప్పు గారెలు, పూరీలు.. తోడుగా కొన్నిస్వీట్స్ వండుకుని తింటారు.

పటాసులు

దీపావళి కంటే ముందే దసరాకి పటాకుల మోత మొదలవుతుంది. జమ్మి చెట్టు పూజలు జరిగే టైంలోనూ పటాకులు పేలుస్తుంటారు చాలామంది. రావణ దహనం ఘట్టానికి పటాకులే ప్రత్యేక ఆకర్షణ.

ALSO READ : Food Special : దసరా పండక్కి తియ్యని వేడుక చేసుకుందామా..