అప్పులపై ఆంక్షలు తెలంగాణ లోన్లపై కేంద్రం కొర్రీలు

అప్పులపై ఆంక్షలు తెలంగాణ లోన్లపై కేంద్రం కొర్రీలు
  •  రూ.75,807 కోట్లకు తగ్గిన 2026–27 స్థూల రుణ పరిమితి
  • తొమ్మిది నెలల మార్కెట్ రుణాల కోటా దాదాపు ఖతం
  • రూ.53,900 కోట్ల అప్పులు.. మిగిలిన వెసులుబాటు రూ.6,415 కోట్లు
  • పీడీ, పీఎఫ్, పబ్లిక్ అకౌంట్ నిధులపై సర్కారు ఆధారం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ రుణ పరిమితిపై కేంద్ర ఆర్థిక శాఖ ఆంక్షలు విధించడం, అనుమతించిన మార్కెట్ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం వేగంగా వినియోగించుకోవడంతో తెలంగాణ ఖజానాపై ఒత్తిడి పెరుగుతోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల రుణ పరిమితిని కేంద్రం రూ.16,043 కోట్లు తగ్గించింది. మరోవైపు తొమ్మిది నెలల మార్కెట్ రుణాల కోటాలో ఇప్పటికే రూ.53,900 కోట్లు తీసుకోవడంతో మిగిలిన వెసులుబాటు రూ.6,415 కోట్లకు పరిమితమైంది.

కాగ్, కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం.. రాష్ట్రానికి తొలుత నిర్ణయించిన సాధారణ నికర రుణ పరిమితి రూ.59,305 కోట్లు. పాత అప్పుల చెల్లింపుల కోటా కింద రూ.24,249 కోట్లు, జాతీయ పెన్షన్ విధానం (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్) జమలకు సమానమైన వెసులుబాటు కింద రూ.6,761 కోట్లు కలిపితే మొత్తం రూ.90 వేల కోట్లకు పైగా ఉండాలి.

అయితే గ్యారెంటీ రిడెంప్షన్ ఫండ్ (జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) నిబంధన పాటించలేదని రూ.4,942 కోట్లు, గతంలో పరిమితికి మించి అప్పులు వాడారన్న కారణంతో మరో రూ.11,101 కోట్లు కేంద్రం తగ్గించింది. దీంతో ఈ ఏడాది స్థూల రుణ పరిమితి రూ.75,807 కోట్లకు చేరింది. గతేడాది కాగ్ ఆమోదించిన రూ.83,010 కోట్లతో పోలిస్తే రూ.7,203 కోట్లు తగ్గింది.

ప్రత్యామ్నాయ నిధులపై ఆధారం

మార్కెట్ అప్పుల వెసులుబాటు తగ్గడంతో ప్రభుత్వం పీడీ ఖాతాలు, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), పబ్లిక్ అకౌంట్ డిపాజిట్లపై ఆధారపడుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్, పబ్లిక్ అకౌంట్ డిపాజిట్ల ద్వారా నికరంగా రూ.5,100 కోట్లు సర్దుబాటు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత మూడేళ్లలో పీడీ ఖాతాల నుంచి రూ.15,519 కోట్లు వినియోగించుకుంది.

ఇందులో 2023–24లో రూ.6,221 కోట్లు, 2024–25లో రూ.2,468 కోట్లు, 2025–26లో రూ.6,830 కోట్లు ఉన్నాయి. మరోవైపు పెన్షన్ ఫండ్ నిబంధనల కింద కాగ్ సెప్టెంబర్ వరకు రూ.5,025.66 కోట్లను తగ్గించింది. అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరో రూ.310 కోట్లు, రాబోయే ఐదు నెలల్లో నెలకు రూ.285 కోట్ల చొప్పున మొత్తం రూ.1,425 కోట్లు అదనంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

నెగోషియేటెడ్ రుణాలు, పబ్లిక్ అకౌంట్ నిధులు, మార్కెట్ అప్పులు కలిపి అనుమతించిన రుణాల వినియోగం, మిగిలిన రుణ వెసులుబాటుపై లెక్కల్లో స్పష్టత అవసరంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంస్థల (డిస్కం) నష్టాల పేరిట రూ.8,814 కోట్ల కోత, బడ్జెట్ వెలుపలి రుణాల సర్దుబాట్లను కేంద్రం కఠినతరం చేయడం వల్లే నిధుల సమస్య తలెత్తుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంటోంది.

పాత అప్పులు చెల్లించేందుకు కొత్త రుణాలపై ఆధారపడుతున్న తరుణంలో కేంద్రం సాంకేతిక నిబంధనల పేరుతో కోతలు విధిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. మరోవైపు ఇప్పటికే అనుమతించిన రుణాల్లో అధిక భాగం వినియోగించడంతో మిగిలిన ఆర్థిక సంవత్సరంలో నిధుల నిర్వహణ సవాలుగా మారనుంది. 

మార్కెట్ అప్పుల కోటా దాదాపు ఖతం

మార్కెట్ రుణాల విషయంలోనూ రాష్ట్రానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తొలి తొమ్మిది నెలలకు కేంద్రం అనుమతించిన మార్కెట్ రుణాల కోటా రూ.50,151 కోట్లు. ఏప్రిల్ 1 నాటి రూ.3,951 కోట్ల కోటాతో కలిపి మొత్తం రూ.54,102 కోట్లు. పాత అప్పుల రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కింద మరో రూ.6,213 కోట్లు కలపడంతో మొత్తం మార్కెట్ రుణ పరిమితి రూ.60,315 కోట్లకు చేరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.53,900 కోట్లు అప్పుగా తెచ్చింది. దీంతో మొత్తం పరిమితిలో మిగిలిన వెసులుబాటు రూ.6,415 కోట్లు మాత్రమే. అయితే రీప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ మొత్తాన్ని మినహాయిస్తే తొమ్మిది నెలల కోటాలో మిగిలిన నికర వెసులుబాటు రూ.202 కోట్లే.