
గడిచిన 24 గంటల్లో భారీ వర్షాలకు హైదరాబాద్ తో సహా తెలంగాణ అల్లకల్లోలం అయ్యింది. వర్షాలకి ఇల్లులు, రోడ్లు మునిగిపోయాయి. వరదలు ఉప్పొంగి రాకపోకలను ఆగిపోయాయి. కొన్ని చోట్ల వరదల తాకిడికి వాహనాలు కొట్టుకుపోయి గల్లంతయ్యారు. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీం కాపాడినప్పటికీ కొన్ని ఊర్లు, కాలనీలు నీట మునిగాయి.
అయితే ఇవాళ గురువారం ఉదయం నుండి హైదరాబాద్‌లో వర్షపాతం తగ్గింది. కొన్ని చోట్ల చినుకులు, తేలికపాటి జల్లులు మాత్రమే నమోదు కాగా, తెలంగాణలోని చాల జిల్లాలకు తీవ్ర వర్ష హెచ్చరిక జారీ అయ్యింది. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రిలలో భారీ వర్షాలు కొనసాగనున్నాయి అలాగే నిర్మల్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వరకు ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉంది.
Also read:-బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీలోనూ 4 రోజులు భారీ వర్షాలు
తెలంగాణ వెదర్‌మ్యాన్ ప్రకారం, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్‌లలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కామారెడ్డిలో ఇప్పటికే గడిచిన 36 గంటల్లో 500 - 600 మి.మీ వర్షపాతం నమోదైంది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్‌లలో కూడా రాబోయే కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక హైదరాబాద్‌లో కుత్బుల్లాపూర్, గాజులరామారం, సేరిలింగంపల్లి, మాదాపూర్, బాలానగర్, మియాపూర్, ఆర్‌సి పురం, అల్వాల్, అమీర్‌పేట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, మల్కాజిగిరి సహా ఉత్తరాది ప్రాంతాల్లో రానున్న గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.