మాయావతి ట్వీట్ .. డైలమాలో తెలంగాణ బీఎస్పీ

మాయావతి ట్వీట్ ..  డైలమాలో తెలంగాణ బీఎస్పీ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర బీఎస్పీలో గందరగోళం నెలకొంది. బీఎస్పీ చీఫ్​  మాయావతి చేసిన ట్వీట్​తో అంతా అయోమయంగా మారింది.  ‘‘ఎన్నికల్లో పొత్తులు, మూడో ఫ్రంట్ ఏర్పాటు పూర్తిగా అబద్ధం. అవన్నీ తప్పుదోవ పట్టించే వార్తలు. మీడియా అటువంటి వార్తలు ప్రచారం చేయొద్దు. వారి విశ్వసనీయతను కాపాడుకోవాలి. ప్రజలు కూడా పుకార్లపై అప్రమత్తంగా ఉండాలి’’ అని శనివారం మాయావతి ట్విటర్ లో పోస్టు  చేశారు. దీంతో రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్​ మధ్య పొత్తు మాయావతికి తెలిసే జరిగిందా లేక బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ సొంత నిర్ణయమా అనే దానిపై ఆ పార్టీలోని లీడర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్‌‌తో ప్రవీణ్  ఇటీవలే భేటీ కావడం,  లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని ఇరువురు నేతలు ప్రకటించడం తెలిసిందే. ఈ అంశంపై కేసీఆర్  మాట్లాడుతూ.. ప్రవీణ్ తో ప్రస్తుతం మాట్లాడామని, బీఎస్పీ అధినేత్రి మాయావతితో కూడా మాట్లాడతానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో  కచ్చితంగా కలిసి పోటీచేస్తామని, సీట్ల  పంపకాలపై త్వరలోనే ప్రకటన చేస్తామని కేసీఆర్  తెలిపారు. అయితే, తాజాగా మాయావతి చేసిన ప్రకటనతో  బీఎస్పీ రాష్ట్ర క్యాడర్ లో గందరగోళం నెలకొంది. 

బీఆర్ఎస్​తో పొత్తు అంశాన్ని ప్రవీణ్​ ఆగమేఘాలపై తెచ్చారా లేదా ఎవరైనా మాయావతికి ఆయనపై కంప్లయింట్​  చేయడంతో ట్వీట్​ వచ్చిందా అని క్యాడర్  చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ప్రవీణ్  నిర్ణయంతో బీఎస్పీకి పలువురు రాజీనామా చేశారు. అయితే  ఇండియా, ఎన్డీఏ, థర్డ్ ​ప్రంట్​ వంటి పొత్తులపై మాయావతి ప్రకటన చేశారని, ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్​తో పొత్తు గురించి కాదని, అంతా ఆమెకు తెలుసని ప్రవీణ్  కుమార్​ వర్గం అంటున్నది.