
- సభ్య రాష్ట్రాలకు సమాచారం ఇవ్వకుండా ఎట్ల నిర్వహిస్తరు?
- బోర్డుకు ఈఎన్సీ జనరల్ లేఖ
- చైర్మన్ అనుమతి తీసుకునే బోర్డుకు ప్రజెంటేషన్ ఇచ్చాం
- బోర్డు మెంబర్ సెక్రటరీపై ఉద్యోగులు ఆరోపణలు చేసినా దానిపై చర్చే లేదు
- బోర్డు కేడర్ స్ట్రెంత్పై రివ్యూ చేస్తే మాకు తీవ్రమైన ఆర్థిక భారమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) మీటింగ్ డ్రాఫ్ట్ మినిట్స్‌లో పేర్కొన్న అంశాలు వాస్తవదూరంగా ఉన్నాయని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. బోర్డుకు సంబంధించి వివరాలపై ప్రజెంటేషన్ ఇస్తామని చైర్మన్ అనుమతి తీసుకున్నామని, పర్మిషన్ ఇచ్చాకే ప్రజెంటేషన్ ఇచ్చామని స్పష్టం చేసింది. కానీ, మీటింగ్ మినిట్స్‌లో మాత్రం చైర్మన్ మాట్లాడుతున్నప్పుడు అనుమతి లేకుండా తెలంగాణ జోక్యం చేసుకుని వాళ్ల సొంత ఎజెండాను ప్రజెంట్ చేశారని పేర్కొన్నదని, ఇలా మినిట్స్‌లో పేర్కొనడం అర్థరహితమని తేల్చి చెప్పింది.
ఈ మేరకు మీటింగ్ మినిట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు ఈఎన్సీ జనరల్ లేఖ రాశారు. ప్రజెంటేషన్‌లో తెలంగాణ తెలియజేసిన అంశాలను మినిట్స్‌లో కనీసం పేర్కొనలేదని అన్నారు. అసలు సభ్య రాష్ట్రాలకు కనీస సమాచారం ఇవ్వకుండా.. వారి అభిప్రాయాలు తీసుకోకుండా సమావేశం తేదీలను ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. బోర్డు మీటింగ్స్ తేదీలను పదే పదే మార్చకుండా సమావేశం తేదీలపై మెంబర్ స్టేట్స్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు.
బోర్డు, కేంద్ర జలశక్తి శాఖ మధ్య జరిగిన ఏ మీటింగ్అయినా సభ్య రాష్ట్రాలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ ఏడాది జనవరి 6న కేంద్ర జలశక్తి శాఖకు (బనకచర్ల ప్రాజెక్టుపై) ఏపీ సీఎం ఇచ్చిన 24 పేజీల కాన్సెప్ట్ సహా అన్ని వివరాలనూ ఇవ్వాల్సిందిగా ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి పట్టుబట్టారని, ఆ విషయాలనూ బోర్డు మినిట్స్‌లో చేర్చాలని ఆయన స్పష్టం చేశారు.
మాకు ఆర్థిక భారం
గోదావరి బోర్డుకు శాంక్షన్ చేసిన పోస్టులపై రివ్యూ చేసేందుకు కమిటీకి రిఫర్ చేయాలని నిర్ణయించారని, కానీ, ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకున్న ఉద్యోగుల జీతభత్యాలను కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కాకుండా రాష్ట్రాల రూల్స్ ప్రకారమే చెల్లించేందుకు డిమాండ్ చేస్తున్నామని ఈఎన్సీ తెలిపారు. ఈ విషయాన్ని మినిట్స్‌లో చేర్చాలని స్పష్టం చేశారు. బోర్డులో అదనంగా సీఈ, డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల ను క్రియేట్ చేయాలని చెబుతున్నా.. దాని వల్ల రాష్ట్రాలపై ఆర్థిక భారం మరింత పెరుగు తుందని, దాంతోపాటు వాహనాలు, సిబ్బంది వంటి అంశాల్లోనూ ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కమిటీకి రిఫర్ చేసే అంశాన్ని మినిట్స్ నుంచి తొలగించా లని సూచించారు. కేవలం పెద్దవాగు ప్రాజెక్టు కు సంబంధించిన సీడ్మనీనే ఇస్తామని, ఆ ప్రాజెక్టును అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా మని మాత్రమే చెప్పామని తెలిపారు. వర్కింగ్ మాన్యువల్‌పై తయారు చేసిన డ్రాఫ్ట్‌ను ఫైనలై జ్ చేయలేదని, కానీ, ఫైనలైజ్ చేశారంటూ మినిట్స్‌లో చెప్పారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
మాన్యువల్‌పై అభిప్రాయాలు చెప్పేం దుకు 2 రాష్ట్రాలూ ఒప్పుకున్నాయని మినిట్స్‌లో పేర్కొన్నారని, కానీ, మాన్యువల్‌పై ముందు కెళ్లడానికి ముందు మీటింగ్‌ను నిర్వహించి కమిటీకి తమ స్టేట్మెంట్స్ సబ్మిట్ చేయాల ని కోరామని గుర్తు చేశారు. కానీ, మాన్యువల్ కమిటీకి చైర్మన్‌గా ఉన్న మెంబర్ సెక్రటరీ.. మీటింగ్ నిర్వహించాక ఫైనలైజ్ చేయాలని తాము చెబుతున్నా ఏకపక్షంగా బోర్డు మీటింగ్‌లో దీనిని ఎజెండాగా పెట్టారని ఆరోపించారు. కాబట్టి ఈ విషయాన్ని మినిట్స్ నుంచి తొలగించాలని ఈఎన్సీ లేఖలో పేర్కొన్నారు.
మాకు చెప్పరా?
వీఐపీ రిఫరెన్స్ కింద ఓ రాష్ట్రం ఏదైనా అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకొచ్చినప్పుడు.. ఆ విషయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కౌంటర్ స్టేట్‌కు బోర్డు చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఈఎన్సీ తన లేఖలో పేర్కొన్నారు. ఏ విషయమైనా బోర్డు దృష్టికి వచ్చినప్పుడు కచ్చితంగా సభ్య రాష్ట్రాలకు ఆ సమాచారాన్ని బోర్డు మెంబర్ సెక్రటరీ ఇవ్వాల్సి ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. జీఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీపై తెలంగాణ ఉద్యోగుల ఆరోపణలపై కనీసం చర్చించలేదని, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. అయితే మెంబర్ స్టేట్స్, కేఆర్ఎంబీల నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు సభ్యుల నిజనిర్ధారణ కమిటీ వేసి ఒక్క నెలలో రిపోర్టు ఇవ్వాలని సూచించారన్నారు.
ఈ విషయం కూడా బోర్డు మీటింగ్ మినిట్స్‌లో మెన్షన్ చేయలేదని పేర్కొన్నారు. స్టాఫ్ డిప్యూటేషన్‌కు సంబంధించి రిక్రూట్మెంట్ రూల్స్‌లో మార్పులు చేయాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని గుర్తు చేశారు. విభజనచట్టం ప్రకారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని స్టాఫ్‌ను 2 రాష్ట్రాలకు పంచారని, దీంతో రెండు రాష్ట్రాల్లోనూ సిబ్బంది కొరత ఉన్నదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అవసరమైన సూటబుల్ అధికారినే డిప్యూట్ చేసేందుకు వెసులుబాటు కల్పించారని గుర్తు చేశారు.