షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు మేం రెడీ : సీఈఓ వికాస్ రాజ్

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలకు మేం రెడీ : సీఈఓ వికాస్ రాజ్
  • అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: సీఈఓ వికాస్ రాజ్ 
  • వారం రోజుల్లో స్పెషల్ సమ్మరీ రివిజన్ ముగుస్తుందని వెల్లడి
  • ఈవీఎంల చెకింగ్‌ పూర్తి.. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు 
  • ఏర్పాటు చేస్తున్నామని వివరణ

హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ అన్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఎన్నికలకు రెండు, మూడు నెలలు మాత్రమే సమయం ఉందని చెప్పారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో ఇతర ఎన్నికల అధికారులతో కలిసి ఎలక్షన్ మీడియా సెంటర్‌‌ను వికాస్ రాజ్ ప్రారంభించి, మాట్లాడారు.

ఎన్నికల ప్రక్రియలో వేగం పెరిగిందని, దీంతో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. స్పెషల్ సమ్మరి రివిజన్ మరో వారం రోజుల్లో ముగుస్తుందని తెలిపారు. ఇప్పటికే ఈవీఎంలను చెక్‌ చేశామన్నారు. అధికారుల శిక్షణ కోసం ఈవీఎంలను తెప్పించామని చెప్పారు. వచ్చే నెలలో ఎన్నికలకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వంటివి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 

ప్రిసైడింగ్, పోలింగ్ అధికారులను గుర్తించి, వారికి శిక్షణ ఇవ్వడం, పోలింగ్ స్టేషన్లు పరిశీలించి ఈసీ సూచనల ప్రకారం ఆయా ప్రాంతా ల్లో మౌలిక సౌకర్యాలు ఉన్నాయా? లేదా? పరిశీలించి, సౌలతులు లేకపోతే, వాటిని ఏర్పాటు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాలను గుర్తించి కేంద్ర బలగాలకు వసతి, రవాణా, విధుల కేటాయింపుపై దృష్టి సారించామన్నారు.  

వచ్చే నెల రాష్ట్రానికి కేంద్ర బృందం.. 

ప్రస్తుతం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, ఈవీఎంల ర్యాండమైజేషన్ తదితర ఏర్పాట్లు, అధికారుల కు శిక్షణ కొనసాగుతున్నాయని వికాస్‌‌‌‌ రాజ్‌‌‌‌ తెలిపారు. డబ్బు పంపిణీ ఇతరత్రా వాటిపై కేంద్ర, రాష్ట్ర పరిధిలో 20 ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ ఏజెన్సీలు పని చేయనున్నాయని వెల్లడించారు. వచ్చేనెల 3, 4, 5 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం రానుందని, రాష్ట్రంలోని రాజకీయ నాయకులు, సీఎస్‌‌‌‌, డీజీపీ, కలెక్టర్లతో సమావేశమవుతుందని చెప్పారు.

జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల కొత్త ఓట్లు నమోదయ్యాయని, 3 లక్షల ఓట్లు రద్దయ్యాయని తెలిపారు. ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. కార్య క్రమంలో అడిషనల్ సీఈఓ లోకేశ్‌‌‌‌ కుమార్, జాయింట్ సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, సత్యవతి, ఐఅండ్‌‌‌‌పీఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.