భూ సమస్యను వెంటనే పరిష్కరించాలి : గడ్డం లక్ష్మణ్

భూ సమస్యను వెంటనే పరిష్కరించాలి : గడ్డం లక్ష్మణ్

లింగాల, వెలుగు: మండలంలోని రాయవరం గ్రామ రైతుల భూ సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని, సర్వే నెంబర్ 83ను రెవెన్యూ భూమిగా ప్రకటించి రైతులకు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్  గడ్డం లక్ష్మణ్  డిమాండ్ చేశారు. రాష్ట్ర పౌర హక్కుల సంఘం, ఉమ్మడి మహబూబ్​నగర్  జిల్లాల కమిటీ సభ్యులు ఆదివారం రాయవరం గ్రామ శివారులోని భూమిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పోడు భూముల పంపిణీలో గ్రామంలో సాగులో లేని వారికి పట్టాలివ్వడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు.

సర్వే నెంబర్ 83లో 1,398 ఎకరాల రెవెన్యూ భూమిని 200 మంది రైతులు సాగు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ భూమిని 2019లో అటవీ భూమిగా మార్చారని గుర్తు చేశారు. ఎన్నికల సందర్భంగా ఈ భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. వెంకటేశ్వర్లు, రహిల్, మల్లయ్య, యాదయ్య, నరసింహ, పెంటయ్య, నరసింహారెడ్డి, సలేశ్వరం పాల్గొన్నారు.