తుఫాన్‌‌తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎకరాకు రూ.10 వేలు: సీఎం రేవంత్

 తుఫాన్‌‌తో పంట నష్టపోయిన రైతులకు  పరిహారం ఎకరాకు రూ.10 వేలు: సీఎం రేవంత్
  •     ఇండ్లు మునిగిన వారికి 15 వేలు.. మృతుల కుటుంబాలకు 5 లక్షలు 
  •     గ్రేటర్‍ వరంగల్‌‌లోని నాలాల కబ్జాలు తొలగించాల్సిందే
  •     అధికారుల మధ్య కో ఆర్డినేషన్‍ లేక సమస్యలు పెరుగుతున్నయ్‍ 
  •     కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్‌‌ చేయాలి.. ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడాల్సిందేనని ఆదేశం
  •     హుస్నాబాద్‍, గ్రేటర్‍ వరంగల్‌‌లో సీఎం రేవంత్‍రెడ్డి ఏరియల్‍ సర్వే
  •     తుఫాన్‍ బాధితుల సమస్యలు విని.. ఓదార్చిన ముఖ్యమంత్రి

వరంగల్‍, వెలుగు: మొంథా తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎకరా పంట నష్టానికి రూ.10 వేల చొప్పున అందజేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి తెలిపారు.  వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇండ్లు మునిగిన వారికి రూ.15 వేల చొప్పున చెల్లిస్తామని తెలిపారు.  శుక్రవారం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి, పొన్నం ప్రభాకర్‍, సీఎం సలహాదారు వేం నరేందర్‍రెడ్డితో కలిసి తుఫాన్‌‌ ప్రభావిత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‍, గ్రేటర్ వరంగల్‌‌లో సీఎం రేవంత్‌‌రెడ్డి  ఏరియల్‍ సర్వే నిర్వహించారు. అనంతరం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌‌ అండ్‍ సైన్స్‌‌ కాలేజీ హెలిప్యాడ్‍లో దిగారు. ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. బాధితులతో మాట్లాడి సాధకబాధకాలు తెలుసుకున్నారు. భారీ వర్షాలు, వరద నష్టంపై  వరంగల్ కలెక్టరేట్‌‌లో రివ్యూ నిర్వహించారు. వీలైనంత తొందరగా పంట నష్టం అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ఇసుక మేటలు వేసినచోట ఎన్‍ఆర్‍ఈజీఎస్‍ స్పెషల్‍ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. 

పశు సంపదైన మేకలు చనిపోతే రూ.5 వేలు, ఆవులు, బర్రెలులాంటి పెద్ద పశువులు చనిపోతే రూ.50 వేలు చెల్లిస్తున్న క్రమంలో.. వీటికి సంబంధించిన అంచనాలు కూడా పంపాలని చెప్పారు. మనుషులు చనిపోయినచోట పోలీసులు వెంటనే కావాల్సిన ఎఫ్‍ఐఆర్‍ నమోదు చేసి.. బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా సహకారం అందించాలన్నారు. సీఎం వెంట  మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి, మేయర్‍ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, వరంగల్‍, హనుమకొండ కలెక్టర్లు సత్య శారద, స్నేహ శబరీశ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‍ చాహత్‍ బాజ్‍పాయ్ ఉన్నారు.  

కబ్జాలను వదలొద్దు

గ్రేటర్‌‌ వరంగల్‌లో ఏటా వరద సమస్యకు ప్రధానంగా నాలాల ఆక్రమణ, కబ్జాలే కారణమవుతున్నాయని సీఎం రేవంత్‍రెడ్డి తెలిపారు. 10  మంది కోసం 10 వేల మందికి నష్టం జరుగుతుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ  కబ్జాలను ఉపేక్షించొద్దని అధికారులను ఆదేశించారు. వరదలు తగ్గగానే సమన్వయంతో శానిటేషన్‍, మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. తుఫాన్‍ ప్రభావం ఎక్కువగా ఉన్న 12  జిల్లాల్లో అధికారులు ఫీల్డ్‌ విజిట్‍ చేసి ప్రాణ, పంట, పశు సంపద నష్టాలకు సంబంధించి రిపోర్టులు తెప్పించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధులు సైతం కలెక్టర్లకు తమ నియోజకవర్గాల నివేదికలు  అందించాలన్నారు. వాతావరణ మార్పులతో క్లౌడ్‍ బరస్ట్ కామన్‌గా మారిందని తెలిపారు.  ఈ సమస్యను అధిగమించడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గ్రేటర్‍ వరంగల్‌లో స్మార్ట్‌ సిటీ, ఇతర అభివృద్ధి పనులపై ప్రత్యేక రిపోర్ట్‌ తయారు చేయాలని చెప్పారు.  అధికారుల మధ్య కో ఆర్డినేషన్‍ లేక సమస్యలు పెరుగుతున్నాయని అన్నారు. నిర్లక్ష్యం వీడాల్సిందేనని తెలిపారు. క్షేత్రస్థాయిలో కోఆర్డినేషన్‍ కమిటీ వేసుకొని మున్సిపల్‍, ఇరిగేషన్‍ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

బాధితుల ఇండ్లకు వెళ్లి.. భరోసా కల్పించి..

హనుమకొండ కేయూ వందఫీట్ల రోడ్డులో ఊర చెరువు పొంగి నీట మునిగిన కాలనీలను సీఎం రేవంత్‌‌ పరిశీలించారు. బురదతో నిండిన సమ్మయ్య నగర్‍ చుట్టూరా ఉన్న బాధితులను పరామర్శిం చారు. వారి సమస్యలను విన్నారు. వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఓ మహిళకు చెందిన గుడిసెలో పప్పులు, ఉప్పులుసహా నిత్యావసరాలు నీటమునగ్గా.. సీఎం స్వయంగా పరిశీలించారు. ఆమెకు ధైర్యం చెప్పి.. బాధితురాలికి పూర్తి సాయం అందించాలని కలెక్టర్‍ స్నేహ శబరీశ్‌‌, గ్రేటర్‍ కమిషనర్‌‌‌‌ను ఆదేశించారు. మొంథా తుఫాన్‌‌ వల్ల నష్టపోయినవారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడినుంచి నిరుడు  రూ.90 కోట్లతో నిర్మించిన నయీంనగర్‍ బ్రిడ్జి, నాలా అభివృద్ధి పనులను పరిశీలించాడు. భద్రకాళి ఆలయం దగ్గరలోని కాపువాడ, రంగంపేట, పోతన నగర్‍ ముంపు కాలనీలకు వెళ్లారు. కాలనీవాసులు చెప్పిన సమస్యలు, కావాల్సిన సౌకర్యాలు ఏంటో అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు కోల్పోయినవారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా చూడాలన్నారు. 

సమగ్ర నివేదికలు అందించాలి: మంత్రి పొంగులేటి

భారీ వర్షాల కారణంగా జిల్లాల్లో జరిగిన పంట, ప్రాణ, ఆస్తి నష్టాలపై జిల్లా కలెక్టర్లు వీలైనంత త్వరగా సమగ్ర నివేదికలు అందించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా..తుఫాన్‍ బాధితులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ స్పీకర్‍ డాక్టర్‍ రామచంద్రు నాయక్‍, మహబూబాబాద్‍ ఎంపీ పోరిక బలరాం నాయక్‍, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కేఆర్‍. నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.