సీఎం కేసీఆర్‌‌ .. హామీలు తీర్చాకే అడుగు పెట్టాలె

సీఎం కేసీఆర్‌‌ ..  హామీలు తీర్చాకే అడుగు పెట్టాలె

సూర్యాపేట, వెలుగు : సీఎం కేసీఆర్‌‌ పర్యటన సూర్యాపేట జిల్లాలో ఉత్కంఠ రేపుతోంది. హామీలు నెరవేర్చకపోవడంతో సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే ప్రతిపక్ష నేతలు ప్రకటించారు. తమను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న రెండో ఏ‌ఎన్‌ఎంలు,  జీవో 46తో నష్టపోతున్న కానిస్టేబుల్ అభ్యర్థులు,  రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన బాధితులు కూడా సీఎం సభను అడ్డుకుంటామని ప్రకటించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.  పోలీసులు వీరిని గుర్తించి ముందస్తు అరెస్టులు, హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. 

అడ్డుకొని తీరుతాం 

సీఎం ఇచ్చిన హామీలు అమలు చేశాకే జిల్లాలో అడుగు పెట్టాలని, లేదంటే అడ్డుకొని తీరుతామని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేశ్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  నియోజకవర్గంలో 30 వేల మంది నిరుపేదలు ఉంటే 500 డబుల్ బెడ్ రూమ్‌ ఇండ్లను మాత్రమే పంపిణీ చేశారని మండిపడ్డారు.  4 వేల మంది ఐదేళ్లుగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారని, ఎనిమిదేళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కలెక్టరేట్ నిర్మాణంలో  రూ. 300 కోట్ల అవినీతి జరిగిందని,  కలెక్టరేట్ చుట్టూ మంత్రి జగదీశ్‌ రెడ్డికి భూములు ఉన్నాయని ఆరోపించారు.  జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్‌కు శ్రీకాంత్ చారి పేరు,  మెడికల్ కాలేజీకి కొండేటి వేణుగోపాల్ రెడ్డి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. 

విద్యారంగ సమస్యలు తీర్చాలి

జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ ఎయిడెడ్ కాలేజీని ప్రభుత్వ కాలేజీగా మార్చాలని,  ప్రతి మండలంలో జూనియర్ కాలేజీ, నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పోలేబోయిన కిరణ్ డిమాండ్ చేశారు. జిల్లాలో మహిళా యూనివర్సిటీ, వ్యవసాయ కాలేజీ, పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.  అలాగే ఉద్యమకారుల తరఫున టీజే‌ఎస్ లీడర్లు బహిరంగ లేఖ విడుదల చేశారు. జిల్లాలో కమీషన్లు వచ్చే కాంట్రాక్టు పనులు, భారీ భవన నిర్మాణాలు తప్ప నిర్మాణాత్మక అభివృద్ధి జరగలేదని అందులో పేర్కొన్నారు.

 ఇప్పటికైనా ప్రభుత్వ ఐటీఐ, డిగ్రీ కాలేజీ, పీజీ సెంటర్‌‌ ఏర్పాటు చేయాలని, పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. రోడ్ల విస్తరణలో షాపులు, ఇండ్లు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు మరోచోట షెల్టర్ కల్పించాలని రిక్వెస్ట్ చేశారు. సద్దుల చెరువు టాంక్ బండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కలెక్టరేట్, మెడికల్ కాలేజీ నిర్మాణంలో జరిగిన అవినీతిపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 

డిగ్రీ కాలేజీ కోసం నిరసన

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు తగుళ్ల జనార్ధన్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌‌ఎస్‌ సర్కారు విద్యారంగాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డిగ్రీ కాలేజీతో పాటు  మహిళా డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని కోరారు.  నేటి సీఎం కేసీఆర్‌‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీపై ప్రకటన చేయాలని, లేదంటే  సభను అడ్డుకుంటామని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పోలోజు మహేశ్, సాగర్ల అశోక్, లింగంపల్లి మధుకర్, దుబాని మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.