సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్..దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్

సీఎం రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్..దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్

తెలంగాణ రాష్ట్రం దేశ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని రాస్తోంది.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశ రాజకీయ డైనమిక్స్‌‌‌‌లో మార్పులకు, చర్చకు  కేంద్ర బిందువవుతుండడం,  దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నాయకత్వం తెలంగాణ గడ్డ నుంచి  పరివర్తన  చెందుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం.  జాతీయ పార్టీలాంటి కాంగ్రెస్​లో  సీఎం రేవంత్  పట్టుపెంచుకోవడమేకాక తనదైన ముద్ర వేసుకుంటున్న తీరు, ఆయన రాజకీయ ప్రయాణం దేశ రాజకీయాలపై  ప్రభావంపై చర్చ జరుగుతోంది.  ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక, కులగణన, బీసీ రిజర్వేషన్ల పోరాటం రేవంత్​ రాజకీయ సమర్థతను తెలియజేస్తున్నాయి.   ఫిర్యాదులు, గ్రూపులు, వర్గాలు, ముఖ్యమంత్రుల మార్పులు జాతీయ పార్టీల్లో సాధారణం.  కానీ,  ఆ  పసలేని ప్రచారాలకు  ఫుల్ స్టాప్ పెట్టేలా సీఎం రేవంత్ నిర్ణయాలు ఇవాళ జాతీయస్థాయిలో ఓ ఎజెండా అవడంతోపాటు, దేశ రాజకీయాల్లో ట్రెండ్ అవుతుండడం గమనార్హం.  పాలనానుభవం లేదని కొందరు, అధిష్టానం దగ్గర పతార లేదనే చాయ్బండి చౌరస్తాల ముచ్చట్లకు ఆయన పనితీరే చెక్ పెడుతోందని చెప్పాలి. 

భారత ఉప రాష్ట్రపతి పదవి ఒక రాజ్యాంగబద్ధమైన, ఉన్నతమైన స్థానం. తాజా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జస్టిస్ బీ  సుదర్శన్ రెడ్డి (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)ని అభ్యర్థిగా ప్రకటించడంలో రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జస్టిస్  సుదర్శన్ రెడ్డి తెలంగాణకు చెందినవారు కావడం, ఆయన న్యాయపరమైన నిష్పక్షపాతం, సామాజిక న్యాయం పట్ల ఆయన ఆలోచనలు.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తోంది.  తెలంగాణలో కులగణన (కులసర్వే) చేపట్టడం ద్వారా రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్‌‌‌‌ను సెట్ చేశారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా,  బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ, రాష్ట్రస్థాయిలో ఇలాంటి సర్వేలు చేపట్టడం ద్వారా, రేవంత్ రెడ్డి ఒక సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇది దేశవ్యాప్తంగా కులగణన డిమాండ్‌‌‌‌ను పెంచింది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని జాతీయ ఎజెండాగా తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాలు ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారుతున్నాయి.

కాంగ్రెస్‌‌‌‌లో రేవంత్ మార్కు 

కాంగ్రెస్ పార్టీ గత దశాబ్దంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంది. అయితే,  రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, జాతీయ స్థాయిలో దాని బలాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌ను ఓడించి, కాంగ్రెస్‌‌‌‌ను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత రేవంత్‌‌‌‌ది. ఈ విజయం కేవలం రాష్ట్రస్థాయిలోనే కాక, జాతీయస్థాయిలో కాంగ్రెస్‌‌‌‌కు ఊపిరిపోసింది. రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ తీసుకునే నిర్ణయాల్లో  రేవంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేశంలో  సామాజిక నిర్ణయాలు, సంక్షేమ పథకాలలోపై ఆయన ఆకర్షింపబడుతున్నారు.   

వైఎస్‌‌‌‌తో పోలికలు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక శక్తిమంతమైన నాయకుడు. ఆయన సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, పాలనలో సంస్కరణలు వంటి అంశాలతో జాతీయస్థాయిలో కాంగ్రెస్‌‌‌‌కు బలాన్ని చేకూర్చారు. రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి నాయకత్వ లక్షణాలతో ముందుకు సాగుతున్నారు. వైఎస్ తన పాలనలో ఆరోగ్య శ్రీ,  రైతు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, కులగణన వంటి  కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. ఈ ఇద్దరు నాయకుల్లోనూ ఉన్న ఒక సామాన్య లక్షణం.. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలను పరిష్కరించే చొరవ.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో అజేయశక్తిగా మార్చారు.  అదే స్ఫూర్తితో  రేవంత్ రెడ్డి  తెలంగాణలో  కాంగ్రెస్‌‌‌‌ను బలోపేతం చేస్తూ జాతీయ రాజకీయాల్లో కూడా పార్టీకి 
దిశానిర్దేశం చేస్తున్నారు.

వ్యూహాత్మక రాజకీయం

 వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డిల మధ్య సమానత్వాలు ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య కొన్ని తేడాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. వైఎస్ ఒక ఏకఛత్రాధిపత్య నాయకుడిగా రాష్ట్రంలో ఆధిపత్యం చెలాయించారు. అయితే, రేవంత్ రెడ్డి సమష్టి నాయకత్వంతో,  రాహుల్ గాంధీతో సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.  వైఎస్ రాజకీయ అనుభవం, పరిపక్వత ఆధారంగా పాలన సాగించగా, రేవంత్ యువశక్తి, ఆధునిక రాజకీయ వ్యూహాలతో కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అయితే, ఇద్దరూ సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం పట్ల ఒకే విధమైన నిబద్ధతను చూపించారు.  ఇక  రాహుల్ గాంధీతో  రేవంత్ రెడ్డి సంబంధాలు మరింత ఆసక్తికరం. తెలంగాణలో  కాంగ్రెస్ అధికారంలోకి రావడం నుంచి,  జాతీయస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం వరకు రేవంత్​ పాత్ర అమూల్యం.  అయితే,  రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి మధ్య ' గ్యాప్' అనేది ఊహాజనితమే తప్ప, నిజంకాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  రాహుల్ జాతీయస్థాయి నాయకత్వాన్ని చేపట్టగా  రేవంత్ రాష్ట్ర స్థాయి నుంచి సమన్వయం చేస్తున్నారు. 

ఏపీ పార్టీల దారెటు?

ఇక, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని పార్టీలు వైఎస్ఆర్‌‌‌‌సీపీ, టీడీపీ  ఈ అభ్యర్థిత్వంపై ఎలా స్పందిస్తాయి?  టీడీపీ ఎన్డీఏలో భాగమైనందున ఆ పార్టీ  కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌‌‌‌కు మద్దతు ఇవ్వడం సహజం. అయితే, వైఎస్ఆర్‌‌‌‌సీపీ విపక్ష స్థానంలో ఉండి, ఇండియా కూటమికి మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తికరం.  అయితే, ఈ ఎన్నికలు రాజకీయ పార్టీల సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను పరీక్షిస్తాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఈ చర్చలు పార్టీల అంతర్గత ఒత్తిళ్లను, వ్యూహాలను బయటపెడుతున్నాయి. మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి నుంచి జాతీయ సామాజిక న్యాయం వరకు సీఎం రేవంత్​ వ్యూహాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి.  తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు ఆయన నుంచి మరిన్ని సంస్కరణలు,  సామాజిక నిర్ణయాలు చూసే అవకాశం ఉంటది. రాబోయే రోజుల్లో ఆయన రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.  

దేశ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్

రేవంత్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా, దేశ రాజకీయాల్లో కూడా ఒక ట్రెండ్ సెట్టర్‌‌‌‌గా మారారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో  బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ప్రమాదం అనే నినాదంతో  రేవంత్​ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు.  ఈ నినాదం ఇండియా కూటమి వ్యూహంలో కీలకంగా మారి బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసింది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రదర్శన మెరుగుపడడంలో రేవంత్ వ్యూహాలు ముఖ్యమైనవి.  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జస్టిస్ బీ  సుదర్శన్ రెడ్డి  ఎంపిక దక్షిణ భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంచే వ్యూహంగా చూడవచ్చు. ఈ ఎన్నికలు కేవలం ఒక రాజ్యాంగబద్ధ పదవికి సంబంధించినవి మాత్రమే కాకుండా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఒక లిట్మస్ పరీక్షగా మారుతున్నాయి.  

బీఆర్ఎస్ అడుగులెటు?

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్  ప్రస్తుతం అధికారం కోల్పోయి విపక్ష స్థానంలో ఉంది.  జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వం 
బీఆర్ఎస్‌‌‌‌కు పచ్చి వెలక్కాయలాంటిది. ఎందుకంటే, ఆయన కులగణన, సామాజిక సమానత్వం వంటి అంశాలపై బలమైన వైఖరిని కలిగి ఉన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం గతంలో కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.  ఇప్పుడు ఇండియా కూటమి ఈ అంశాలను ముందుంచి పోరాడుతోంది. బీఆర్ఎస్ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తుందా?  లేక స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటుందా అనేది చూడాలి. ఇది పార్టీ అంతర్గత డైనమిక్స్‌‌‌‌ను పరీక్షించే అంశం.

‌‌‌‌‌‌‌‌

- వెంకట్ గుంటిపల్లి, 
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం