
గోదావరి కావేరి లింక్‌లో భాగంగా తరలించే 148 టీఎంసీల జలాల్లో సగం వాటా (74 టీఎంసీలు) ఇవ్వాలని రాహుల్ బొజ్జా డిమాండ్ చేశారు. జీసీ లింక్‌ను తెలంగాణ భూభాగం నుంచే చేపడుతున్నా.. కేవలం 45 టీఎంసీలే కేటాయించారని అన్నారు. కాబట్టి రాష్ట్రంలోని కరువు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని సగం వాటా ఇవ్వాలని కోరారు. అయితే, రాష్ట్ర విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ తిరస్కరించింది. సగం వాటా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. కాగా, ఇచ్చంపల్లి నుంచి జీసీ లింక్‌ను చేపడితే.. పలు షరతులతో చేపట్టాలని రాహుల్‌బొజ్జా ఎన్‌డబ్ల్యూడీఏ చైర్మన్‌కు సూచించారు.
తొలుత తమకు గోదావరిలో కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి రక్షణ కల్పించాలన్నారు. 148 టీఎంసీల తరలింపునకు చత్తీస్‌గఢ్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్తీసుకోవాలన్నారు. జీసీ లింక్‌తో దేవాదుల లిఫ్ట్‌లో 38.16 టీఎంసీలు, సమ్మక్కసాగర్‌లో 46.96 టీఎంసీలు, సీతమ్మసాగర్– సీతారామ లిఫ్ట్ ప్రాజెక్టుల్లో 67.05 టీఎంసీలు కలిపి 152.17 టీఎంసీల నీటి వినియోగానికి ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చూడాలని, వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే సమ్మక్కసాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడకుండా చూడాలని, అందుకు అనుగుణంగా గేట్ ఆపరేషన్ ప్రొటోకాల్ షెడ్యూల్‌పై సిమ్యులేషన్ స్టడీస్ చేయాలని కోరారు. అంతేకాకుండా రాష్ట్రానికి జీసీ లింక్‌లో ఇచ్చే వాటాతో పాటు రాష్ట్రంలోని కరువు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు 200 టీఎంసీలు ఇచ్చంపల్లి నుంచి వాడుకునేలా అనుమతి ఇవ్వాలని కోరారు.
ఎక్కడైనా వాడుకుంటం..
తెలంగాణ కోటా కింద ఇచ్చే నీళ్లను శ్రీరాంసాగర్ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకు వాడుకోవాలన్న రూల్స్‌ను ఎన్‌డబ్ల్యూడీఏ పెడుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర సర్కారు అందుకు అంగీకరించలేదు. ఆ నీటిని రాష్ట్రంలో ఎక్కడైనా వాడుకునేలా తమకు స్వేచ్ఛనివ్వాలని రాహుల్‌బొజ్జా స్పష్టం చేశారు. జీసీ లింక్‌లో భాగంగా కృష్ణా బేసిన్లో అవసరమున్న చోట రెండు రిజర్వాయర్లను కట్టివ్వాలని, ఆయా రిజర్వాయర్లకు నీటి తరలింపు వ్యవస్థలను నిర్మించాలని కోరారు. జీసీ లింక్‌లో భాగంగా సాగర్‌కు నీటిని తరలించే కన్వేయర్ సిస్టమ్‌లో చాలా వరకు వ్యవసాయ భూములు ముంపునకు గురవుతున్నాయని, ఆ ముంపును తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
తరలించే నీటిని నేరుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి తీసుకెళ్లవద్దని, సాగర్ టెయిల్‌పాండ్‌కు తరలించి అక్కడి నుంచి తీసుకెళ్లాలని సూచించారు. సాగర్‌లోకి నీటిని తరలిస్తున్నందున అక్కడ రీప్లేస్‌మెంట్‌కు బదులుగా కర్నాటకకు ఆల్మట్టిలో అదనంగా 16 టీఎంసీల నీటిని వాడుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారని, దాని వల్ల తెలంగాణకు గేట్‌వే ప్రాజెక్ట్ అయిన జూరాలకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సాగర్ నుంచి రీప్లేస్మెంట్అన్నారే తప్ప ఎలా అనే వివరాలను మాత్రం చెప్పలేదన్నారు. ఈ నిర్ణయంపై పునఃసమీక్షించాలన్నారు. అన్ని రాష్ట్రాలూ సమ్మతించాకనే మెమోరాండమ్ఆఫ్ అగ్రిమెంట్‌పై ముందుకు వెళ్లాలని, ఇప్పుడే చేస్తే అది తొందరపాటే అవుతుందని స్పష్టం చేశారు.