మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య..తుపాకీతో కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి హత్య..తుపాకీతో కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
  • మిస్టరీగా మారిన ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి అనిల్ మర్డర్​
  • నిందితులు ఏపీలోని పొద్దుటూరుకు చెందినవారిగా అనుమానాలు
  • ల్యాండ్ సెటిల్​మెంట్ వ్యవహారంలో హత్య చేసినట్టు సమాచారం

మెదక్/కొల్చారం, వెలుగు: మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మరెల్లి అనిల్ (39) హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని గన్ తో కాల్చి చంపారు. ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన వారు అతన్ని పథకం ప్రకారం హైదరాబాద్ నుంచి వెంటాడి కాల్చి చంపినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి మెదక్, సంగారెడ్డి రూట్లో కొల్చారం మండల పరిధిలోని వరిగుంతం విద్యుత్  సబ్ స్టేషన్ సమీపంలో అనిల్ మృతిచెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. 

అనిల్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఉండటంతో మొదటగా ప్రమాదంగా భావించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న క్రమంలో అక్కడ ఖాళీ బులెట్ షెల్​లు లభ్యమయ్యాయి. పోస్ట్ మార్టంలో అనిల్ కుడి భుజం దగ్గర బులెట్ గాయాలు ఉండటంతో పాటు శరీరంలో నాలుగు బులెట్ లు ఉన్నట్టు తేలింది. దీంతో ప్రత్యర్థులు గన్ తో కాల్పులు జరపడం వల్లే అనిల్ మృతి చెందినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 

అనిల్ సోమవారం హైదరాబాద్ గాంధీభవన్​లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా మీటింగ్ కు హాజరయ్యాడు. అక్కడి నుంచి వెళ్లిన అతను రాత్రి 8.30  గంటల సమయంలో కారులో స్వగ్రామం పైతరకు వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీ భవన్ నుంచి బయటకు వచ్చాక హైదరాబాద్​లోనే  కడప జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మనమడితో ల్యాండ్ సెటిల్​మెంట్​విషయంలో గొడవ జరిగినట్టు తెలిసింది. 

ఈ క్రమంలోనే  ప్రత్యర్థులు రెండు కార్లలో అతన్ని చేజ్ చేసి వచ్చి వరిగుంతం సమీపంలో కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు. అయితే, ఘటన జరిగిన సమయంలో అనిల్ ప్రయాణించిన బెంజ్ కారు ఎవరిదనేది మిస్టరీగా మారింది. అనిల్ హత్యకు గురైన స్థలాన్ని మల్టీ జోన్- 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ ఎస్పీ డీవీ  శ్రీనివాస్ రావు కలిసి పరిశీలించారు. నిందితులను  పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ తెలిపారు.

ప్రేమ పెళ్లి.. చిన్నవయసులోనే మృత్యు ఒడికి 

అనిల్ మృతితో పైతరలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ అదే గ్రామానికి చెందిన శిరీషను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కొడుకులు. చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి.. అంచెలంచెలుగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి స్థాయికి ఎదిగాడు. అంతలోనే మృత్యు ఒడికి చేరడంతో భార్య, పిల్లలు, తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.