Gaddar : గద్దర్ భౌతికకాయానికి జి.వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రముఖుల నివాళులు

Gaddar : గద్దర్ భౌతికకాయానికి జి.వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రముఖుల నివాళులు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజా గాయకుడు గద్దర్‌ (74) (Gaddar) అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6న) కన్నుమూశారు. 
గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. గద్దర్ మరణవార్తతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

అపోలో ఆసుపత్రికి వెళ్లిన మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మరోవైపు.. అపోలో ఆసుపత్రిలో గద్దర్ భౌతికకాయానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, ములుగు ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి. 

అపోలో ఆస్పత్రి వద్ద పలువురు తెలంగాణ కళాకారులు గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. విమలక్క గద్దర్ కు పాటలతో ఆశ్రునివాళులర్పించారు.

ఆస్పత్రిలో ఉన్న సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సహా పలువురు ప్రముఖులు గద్దర్ ను పరామర్శించారు. ఆగస్టు 3వ తేదీన వైద్యులు గద్దర్‌కు బైపాస్‌ సర్జరీ చేయగా, కోలుకున్నట్లు కనిపించారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో గద్దర్‌ బాధపడుతుండటంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు. గద్దర్‌ మరణంతో సికింద్రాబాద్‌ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భూదేవి నగర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.