అక్టోబర్ రెండో వారంలో వంద మందితో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్!

అక్టోబర్ రెండో వారంలో వంద మందితో కాంగ్రెస్  ఫస్ట్ లిస్ట్!
  • ఇప్పటికే 62 స్థానాలపై హైకమాండ్, 
  • రాష్ట్ర పార్టీ ఏకాభిప్రాయం
  • రీ సర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లు ఫైనల్!
  • ఈ నెల 8కి స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.‌ ఈ నెల రెండో వారంలో వంద నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటిదాకా చేసిన సర్వేలపై అనుమానాలున్నాయని పలువురు నేతల ఫిర్యాదుల నేపథ్యంలో 35 నియోజకవర్గాల్లో రీసర్వేకి హైకమాండ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆ రిపోర్ట్ ఇంకా సిద్ధం కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఓ హోటల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో సునీల్ కనుగోలు కూడా పాల్గొన్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెల 8వ తేదీ లోపు.. ఫిర్యాదులొచ్చిన నియోజకవర్గాల రీసర్వేని పూర్తి చేయాల్సిందిగా సునీల్‌ను ఠాక్రే ఆదేశించినట్టు సమాచారం. రిపోర్ట్ లేట్ అవుతుండడంతో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్‌ను ఈ నెల 8కి వాయిదా వేసినట్టు తెలిసింది. తొలుత ఈ నెల 6కి వాయుదా పడిన సమావేశం.. మరో రెండు రోజులు ముందుకు జరిపారు.

ఈ లోపు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కనుక.. కమిటీ మీటింగ్‌లో నివేదికపై చర్చించిన తర్వాత రెండు మూడు రోజుల్లో ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేయాలని పార్టీ భావిస్తున్నది. కాగా, ఇప్పటికే 62 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై హైకమాండ్, రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం కుదిరింది. రీ సర్వే తర్వాత మరో 40 సెగ్మెంట్లు ఫైనల్ అవుతాయని చెప్తున్నారు.  దీంతో ఆ నియోజకవర్గాల లిస్టును విడుదల చేస్తారని తెలుస్తున్నది.