అనుమతులు లేని ప్రాజెక్టుల ఆపరేషన్​కు పర్మిషన్​ ఎట్ల ఇస్తరు?

అనుమతులు లేని ప్రాజెక్టుల ఆపరేషన్​కు పర్మిషన్​ ఎట్ల ఇస్తరు?

హైదరాబాద్, వెలుగు : కేఆర్ఎంబీ గెజిట్​ నోటిఫికేషన్​లో ఏపీలోని ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది.  ఆయా ప్రాజెక్టులకు ఎలాంటి అనుమతులు లేకున్నా వాటి ఆపరేషన్​కు అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఈమేరకు కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. 2021 జులై 15న జారీ చేసిన కేఆర్ఎంబీ గెజిట్​ నోటిఫికేషన్​కు అనుబంధంగా 2022 జూలై 17న మరో నోటిఫికేషన్​ ఇచ్చారని తెలిపారు. ఈ గెజిట్​లో ఏపీ రీ ఆర్గనైజేషన్​ యాక్ట్​లోని 11వ షెడ్యూల్​లో పేర్కొన్న ప్రాజెక్టుల ఆపరేషన్​కు రక్షణ కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని కోరుతూ బ్రజేశ్​ ట్రిబ్యునల్​(కేడబ్ల్యూడీటీ –2) ముందు వాదనలు వినిపిస్తున్నామని లేఖలో తెలిపారు. 

పాలమూరు – రంగారెడ్డి, డిండి లిఫ్ట్​స్కీమ్​లు, ఎస్​ఎల్బీసీ టన్నెట్​ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలని తాము కోరుతున్నామని, ఇన్​బేసిన్​లోని తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వకుండా బేసిన్​ అవతలికి నీటిని తరలించే ఏపీ ప్రాజెక్టులకు ఎలా రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. కృష్ణాలో 75 శాతం డిపెండబులిటీ వద్ద తెలంగాణ ప్రాజెక్టులకు న్యాయ పరమైన కేటాయింపులు చేయాలని కోరుతున్నామని తెలిపారు. గెజిట్​లో మినహాయింపు ఇచ్చిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని, అలాంటప్పుడు ఆపరేషన్​మినహాయింపు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఏ ప్రాజెక్టుకు అయినా నీటిని కేటాయించే అధికారం ట్రిబ్యునల్​కే ఉంటుందని, అలాంటప్పుడు మినహాయింపు ఎలా ఇస్తారని నిలదీశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్​యాక్ట్​లోని సెక్షన్​–11లో పేర్కొన్న జాబితా అసమగ్రంగా ఉందని తెలిపారు. 2002 నుంచే పాక్షికంగా ఆపరేషన్​లో ఉన్న ఎస్​ఎల్బీసీ ప్రాజెక్టును ఆ జాబితాలో చేర్చలేదన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టులకు రక్షణను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.