టైగర్ జోన్ నిర్వాసితులకు భూములపై సర్వ హక్కులు

టైగర్ జోన్ నిర్వాసితులకు భూములపై సర్వ హక్కులు
  • 276.03 ఎకరాలకు అలయనెబుల్ రైట్స్ వర్తింపు
  • రిజర్వ్ ఫారెస్ట్ భూముల డీనోటిఫై .. 94 మంది నిర్వాసితులకు కేటాయింపు
  • టైగర్ జోన్ నుంచి మరో గ్రామం తరలింపుకు ప్రతిపాదనలు
  • ఇప్పటికే రెండు గ్రామాలకు పునరావాసం పూర్తి

నిర్మల్, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులకు సాగు కోసం కేటాయించిన భూములను డీనోటిఫై చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పునరావాస ప్యాకేజీ ఒప్పందంలో భాగంగా కవ్వాల్ టైగర్ జోన్ నిర్వాసితులైన 94 మందికి 276.03 ఎకరాల భూములను కేటాయిస్తూ కొద్దిరోజుల క్రితం రెవెన్యూ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములు రిజర్వ్ ఫారెస్ట్​లో ఉండడంతో వాటిని డీనోటిఫై కూడా చేసింది. 

మొత్తం 276.03 ఎకరాలకు గాను కడెం మండలంలోని రచన ఎల్లాపూర్​లో 243.24 ఎకరాలను 87 మంది లబ్ధిదారులకు కేటాయించి, మరో ఏడుగురికి పునరావాసం కల్పించిన మద్దిపడగలోనే 32.19 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు చోట్ల లబ్ధిదారులకు కేటాయించిన 276.03 ఎకరాల భూములకు ప్రభుత్వం వారం క్రితం అలయనెబుల్ హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో లబ్ధిదారులకు వారసత్వ హక్కులు లభించడమే కాకుండా ఆ భూములను సాగు చేసుకునేందుకు, అమ్ముకునేందుకు, బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు, రుణాలు తీసుకునేందుకు హక్కులు లభించనున్నాయి.

పునరావాస గ్రామంలో ఇప్పటికే ఇండ్లు, సౌకర్యాలు

టైగర్ జోన్ కోర్ ఏరియా పరిధిలోకి వస్తుండడంతో నిర్మల్​ జిల్లా కడెం మండలంలోని మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలకు ఇదే మండలంలోని మద్దిపడగలో పునరావాసం కల్పించారు. గ్రామంలో ఇప్పటికే పునరావాసుల కోసం ఇల్లు నిర్మించడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. అయితే పునరావాస ప్యాకేజీలో కొంతమంది ఆర్థిక పరిహారాన్ని ఎంచుకోగా మరికొంతమంది భూ ఆధారిత పరిహారాన్ని ఎంచుకున్నారు. ఆర్థిక పరిహారం ఎంచుకున్న 48 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే ఆ పరిహారం అందించింది. భూఆదారిత పరిహారం ఎంచుకున్న 94 మందికి మద్దిపడగ వద్ద వారికి ఇండ్లు నిర్మించి పునరావాస కాలనీని ఏర్పాటు చేసింది. వారికి 276.03 ఎకరాల భూములను సైతం కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

జీడిమాది గ్రామ తరలింపునకు ప్రతిపాదనలు

టైగర్ జోన్ నుంచి ఇప్పటికే రాంపూర్, మైసంపేట గ్రామాలను సురక్షిత ప్రాంతానికి తరలించగా మరో గ్రామాన్ని కూడా ఈ అటవీ ప్రాంతంలో నుంచి తరలించాలని నిర్ణయించింది. పెంబి మండలంలోని జీడిమాది గ్రామాన్ని టైగర్ జోన్ నుంచి తరలించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ జారీ కాగానే ఈ గ్రామాన్ని పూర్తిస్థాయిలో ఇక్కడి నుంచి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.