వాళ్ల కదలికలపై అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రవిగుప్తా

వాళ్ల కదలికలపై అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రవిగుప్తా
  • మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు
  • తెలంగాణ, చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ బార్డర్‌‌‌‌‌‌‌‌లోని భద్రాచలం అడవుల్లో డీజీపీ పర్యటన
  • మూడు జిల్లాల పోలీసు ఆఫీసర్లతో భేటీ

భద్రాచలం, వెలుగు: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులని, వారితో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అన్నారు. సరిహద్దుల్లో వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, పక్క రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ కట్టడి చేయాలని పోలీసులకు సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మావోయిస్టుల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తెలంగాణ-, చత్తీస్‌‌‌‌గఢ్ బార్డర్‌‌‌‌‌‌‌‌లోని భద్రాచలం మన్యంలో సోమవారం డీజీపీ రవిగుప్తా పర్యటించారు. 

భద్రాచలం డివిజన్‌‌‌‌లోని చర్ల మండలం పూసుగుప్ప, చెన్నాపురం, ఉంజుపల్లి సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ బేస్ క్యాంపులను ఆయన సందర్శించారు. హెలీకాప్టర్‌‌‌‌‌‌‌‌లో అక్కడికి చేరుకున్న ఆయన భద్రతా బలగాలతో మాట్లాడారు. వారిలో మనోధైర్యం నింపడంతో పాటు మావోయిస్టుల కదలికపై ఆరా తీశారు. అక్కడి నుంచి బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్‌‌‌‌కు చేరుకున్నారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసుల నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు, ఇతర పోలీసు ఆఫీసర్లతో డీజీపీ భేటీ అయ్యారు. జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు, నియంత్రణకు చేపడుతున్న చర్యలపై రివ్యూ చేశారు. 

లోక్‌‌‌‌సభ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసి, పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు. డీజీపీతో పాటు అడిషనల్‌‌‌‌ డీజీపీ ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ విజయ్ కుమార్, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ సౌత్ జోన్ అడిషనల్ డీజీపీ రవిదీప్ సింగ్ సాహి, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ సౌత్ సెక్టార్ ఐజీపీ చారుసిన్హా, ఎస్‌‌‌‌ఐబీ ఐజీపీ సుమతి ఉన్నారు. కాగా, భద్రాచలం మన్యంలో డీజీపీ రవిగుప్తా పర్యటన నేపథ్యంలో పోలీసులు అడవిని జల్లెడ పట్టారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. డాగ్, బాంబు స్క్వాడ్‌‌‌‌లు రంగంలోకి దించారు. గ్రేహౌండ్స్ బలగాలు చత్తీస్‌‌‌‌గఢ్ బోర్డర్‌‌‌‌‌‌‌‌ని దుమ్ముగూడెం, చర్ల మండల అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. డీజీపీ పర్యటనను పోలీసులు గోప్యంగా ఉంచారు. 

మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌‌‌‌‌‌‌‌ బాంబు పేలి యువకుడు మృతి

చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి 18 ఏండ్ల యువకుడు మృతి చెందాడు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మృత్ వెండి అడవుల్లో కూంబింగ్‌‌‌‌కు వచ్చే బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ప్రెషర్ బాంబును అమర్చారని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. అటవీ ఉత్పత్తులు సేకరించేందుకు గడియా (18) అనే యువకుడు సోమవారం ఉదయం అడవిలోకి వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ప్రెషర్ బాంబుపై కాలుపెట్టగానే, వెంటనే అది పేలి అతని శరీరం ముక్కలైందన్నారు. విషయం తెలుసుకున్న గంగులూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గడియా డెడ్‌‌‌‌బాడీని స్వాధీనం చేసుకొని, పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు తరలించారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.