ఎన్నికల ఖర్చుల కోసం భూములు అమ్ముతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు

 ఎన్నికల ఖర్చుల కోసం భూములు  అమ్ముతున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
  • భారీగా నిధులు సమకూర్చుకునే పనిలో నాయకులు 
  • వీరిలో ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ నేతలు 

 హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీకి సిద్ధమవుతున్న నేతలు నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. తమకున్న భూములమ్మి, ఎన్నికల ఖర్చులకు లిక్విడ్ క్యాష్​ను అందుబాటులో ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉండగా.. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఎన్నికల ఖర్చుల కోసం పార్టీ తరఫున ఫండ్ రానుంది. కానీ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఆ స్థాయిలో ఫండ్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ రెండు పార్టీల ఆశావహులు నిధుల కోసం తమ భూముల అమ్మకంపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లను ఖరారు చేయలేదు. అయితే తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్న ఆయా పార్టీల్లోని నేతలు.. ఒకవేళ టికెట్ రాకున్నా మరో పార్టీ నుంచి టికెట్ పొందే అవకాశం ఉన్న నాయకులు.. అవసరమైతే ఇండిపెండెంట్​గా బరిలో నిలవాలనే ఆలోచనతో ఉన్న లీడర్లు తమ భూములను అమ్మకానికి పెడుతూ, నిధులు సమకూర్చుకుంటున్నారు. 

ఇలా ఎందరో.. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి ఓ ప్రధాన పార్టీ తరఫున ఒకాయన రెండోసారి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఈసారి టికెట్ తనకే వస్తుందని, ఎలాగైనా గెలవాలనే ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి ఆర్థికంగా బలంగా ఉండడానికి తోడు అధికార పార్టీ కావడంతో.. ఆ నేతను ఎదుర్కోవాలంటే నిధులు అవసరం. దీంతో తనకున్న భూమిని అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే.. వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. ఈసారి ఆయనకు టికెట్ దాదాపు కన్ఫామ్ అయింది. కానీ ప్రత్యర్థి వరుసగా గెలవడం, ఆర్థికంగా బలమైన నేత కావడంతో ఆయన్ను ఎదుర్కొనేందుకు తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మకానికి పెట్టారు. ఉత్తర తెలంగాణలోని ఓ నియోజకవర్గంలో వారసత్వంగా రాజకీయాల్లోకి ఓ యువ నాయకుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏడాది కాలంగా టికెట్ తనకే వస్తుందనే ధీమాతో ప్రచారం సాగిస్తున్నారు. ఉన్న డబ్బంతా ఇప్పటికే ఖర్చయింది. అసలు టైమ్​లో ఆయనకు ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీంతో తన తాత నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని అమ్మాలని ఆలోచిస్తున్నారు.  ఉత్తర తెలంగాణలో ఓ ప్రముఖ పుణ్యక్షేత్రం ఉన్న నియోజకవర్గం. అక్కడ ఒకాయన వరుసగా మూడు ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రధాన జాతీయ పార్టీకి చెందిన ఆయన.. ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. కానీ ప్రత్యర్థి వందల కోట్లు ఖర్చు పెట్టే స్థాయిలో ఉన్నారు. దీంతో ప్రత్యర్థిని ఎదుర్కొనేందుకు ఊళ్లో ఉన్న పొలం అమ్మకానికి పెట్టారు. 
దక్షిణ తెలంగాణ జిల్లాలోని రిజర్వుడు స్థానం. ఒకాయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు తనకే టికెట్ వస్తుందని అనుకుంటున్నారు. ఆ నేత సిటీ శివారులో కొన్నేండ్ల కింద భూమి కొనుగోలు చేశారు. ఇప్పుడు దానికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎన్నికల ఖర్చు కోసం ఆ భూమిని అమ్మాలని బ్రోకర్లను ఆశ్రయించారు.

హైదరాబాద్ శివారు ప్రాంత నాయకులే ఎక్కువ.. 

భూములు అమ్మకానికి పెడ్తున్న వారిలో హైదరాబాద్ శివారు ప్రాంత నాయకులే ఎక్కువగా ఉన్నారు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్​సభ సీట్ల పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనుకుంటున్న నాయకులు తమ భూములను అమ్మకానికి పెడుతున్నారు. ఇక్కడి భూములకు మంచి  ధరలు పలకడం, ఆయా నేతలు వారసత్వంగా వందల ఎకరాల కలిగి ఉండడంతో వాటిని అమ్మేందుకు రెడీ అవుతున్నారు. పలు జిల్లాల్లోని నాయకులు సైతం తమ భూములను అమ్మకానికి పెడుతున్నారు. తీరా ఎన్నికల టైమ్​లో నిధుల కోసం భూములు అమ్మకానికి పెడితే, అనుకున్నంత రేటు వస్తుందో లేదోనని ముందుగానే అమ్మేందుకు సిద్ధమవుతున్నారు.

 సిటీ శివారులోని ఓ నియోజకవర్గం నుంచి ప్రధాన జాతీయ పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్న ఓ మాజీ ఎమ్మెల్యే.. ఇప్పటికే ఎన్నికల ప్రచారం స్పీడప్ చేశారు. ఆయన ఏడాది కాలంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడడంతో ఖర్చు మరింత పెరిగిపోయింది. దీంతో నిధుల కోసం షాపూర్, బాచుపల్లిలో తనకున్న భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఓ మాజీ ఎమ్మెల్యే మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. అక్కడ ప్రత్యర్థి ఆర్థికంగా బలవంతుడు.. పైగా అధికార పార్టీ. అతన్ని ఢీకొట్టేందుకు కీసర వద్ద ఉన్న తన ఫామ్ హౌస్ లోని కొంత భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు.