
- సిట్టింగ్‌లకే సీట్లివ్వడంతో హైకమాండ్‌పై రగిలిపోతున్న నేతలు
- నియోజకవర్గాల్లో పని చేసుకోవాలని పంపించిన్రు..
- ప్రజల్లో తిరిగి కోట్లు ఖర్చు పెట్టుకున్నం..
- తీరా ఇప్పుడు టికెట్లు లెవ్వంటే ఎక్కడికి పోవాలని ఆవేదన
- పోటీలో ఉండాలని ఒత్తిడితెస్తున్న అనుచరులు
పెద్దపల్లి/నెట్వర్క్, వెలుగు: ‘‘మీ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.. సర్వే రిపోర్టులు కూడా అవే చెప్తున్నాయి.. ఈసారి మీకు టికెట్ పక్కా.. పోయి పనిచేసుకోండి.. పబ్లిక్‌లో తిరగండి.. ప్రభుత్వ స్కీములపై ప్రచారం చేయండి..’’ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ సీనియర్బీఆర్ఎస్లీడర్కు రెండేండ్ల కింద హైకమాండ్ చేసిన సూచన ఇది. అప్పటి నుంచి టికెట్‌పై ఆశపెట్టుకున్న సదరు నేత ఎమ్మెల్యేకు దీటుగా పార్టీ, సేవా కార్యక్రమాల పేరుతో కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. తీరా సిట్టింగుకే సీటు ఇవ్వడంతో హైకమాండ్తీరుపై సదరు నేత మండిపడ్తున్నాడు. పార్టీ పెద్దలు ఆడిన డబుల్ గేమ్ పాలిటిక్స్‌తో తన రాజకీయ భవిష్యత్నాశనమైందని ఆవేదన చెందుతున్నాడు. ఇది ఒక్క పెద్దపల్లి జిల్లాకో, అక్కడి ఒక్క నేతకో పరిమితం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 నుంచి 30 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. బీఆర్ఎస్ హైకమాండ్ మాటలు నమ్మి ఏడాది, రెండేండ్లుగా పబ్లిక్‌లో తిరుగుతున్న సదరు సీనియర్ నేతలంతా పార్టీ పెద్దల తీరుపై రగిలిపోతున్నారు.
ఆశావాహుల నారాజ్..
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మీద స్థానికంగా వ్యతిరేకత పెరగడంతో చిట్కుల్ సర్పంచ్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలం మధును పార్టీ పెద్దలు ప్రోత్సహిస్తూ వచ్చారు. బీసీ అందులోనూ అత్యధిక ఓట్లు ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు కావడం, హైకమాండ్ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇస్తామనే సంకేతాలు రావడంతో నీలం మధు కొంతకాలంగా ప్రజల్లో తిరుగుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఉందనే ధీమాతో ఎన్ఎంయూ యువసేన పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తూ కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ప్రకటించిన హైకమాండ్ మధుకు మొండిచేయి చూపడంతో ఆయన సన్నిహితులు మండిపడ్తున్నారు. బీసీ నేతలను ఏకం చేసి మధుకు అండగా నిలిచారు. కాంగ్రెస్‌లో గానీ బీజేపీలోగానీ చేరాలని ముదిరాజ్ సంఘం నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో మధు నియోజకవర్గంలో బల ప్రదర్శనకు దిగడంతో కేసీఆర్ పిలిపించుకొని మాట్లాడారు. ఆయినా టికెట్‌పై గ్యారెంటీ ఇవ్వలేదు.
మెదక్‌లో పద్మాదేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ హైకమాండ్ ఇతర నాయకులను ఎంకరేజ్ చేసిందనే ఆరోపణలున్నాయి. కేసీఆర్ధీమాతో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ఏడాదిగా స్వగ్రామం కూచన్‌పల్లిలో ఉంటూ తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన ఆయనకు హైకమాండ్ షాక్ ఇచ్చింది. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి కొడుకు డాక్టర్ రోహిత్ కూడా కేటీఆర్ భరోసాతో మెదక్ టికెట్ఆశించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎంఎస్ఎస్వో) ద్వారా పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేసి.. ప్రజల్లో ఇమేజ్ పెంచుకున్న రోహిత్‌కు కూడా మొండిచేయి చూపారు.
సూర్యాపేట జిల్లా కోదాడలో నియోజకవర్గ ఇన్చార్జి కన్మంత శశిధర్ రెడ్డిని కాదని 2018లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు టికెట్ ఇచ్చారు. ఈసారి సీఎం కేసీఆర్ టికెట్ హామీ ఇవ్వడంతో ఏడాది కాలంగా శశిధర్‌రెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త వనపర్తి లక్ష్మీనారాయణ కూడా టికెట్ ఆశించి వనపర్తి సేవాదళ్ పేరుతో ఆర్థిక సాయం అందించారు. టికెట్ రాకపోవడంతో వీరిద్దరూ నారాజ్ అయ్యారు.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నీకే అవకాశం ఉంటుందని కేటీఆర్ ఎంకరేజ్ చేయడంతో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి నియోజకవర్గంతో తిరుగుతూ బాగానే ఖర్చు పెట్టుకున్నారు. చివరకు టికెట్ చేజారడంతో పోటీలో ఉండాల్సిందేనని మద్దతుదారులు ఒత్తిడి చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ముధోల్లోనూ విఠల్ రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఉండడంతో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్ బాబు జాదవ్ ను మంత్రి కేటీ ఆర్ ప్రోత్సహిస్తూ వచ్చారు. నియోజక వర్గంలో పనిచేసుకోవాలని స్వయంగా కేటీఆరే చెప్పడంతో రాజేశ్ బాబు వివిధ కార్యక్రమాలు చేపడ్తూ పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. విఠల్‌రెడ్డిపై నారాజ్‌గా ఉన్న క్యాడర్ కూడా రాజేశ్‌కు మద్దతు పలికారు. టికెట్ దక్కకపోవడంతో నిరాశలో మునిగారు.
పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిపై ఆరోపణల నేపథ్యంలో ఇతర నేతలను హైకమాండ్ ప్రోత్సహించింది. మంథని నుంచి చల్ల నారాయణరెడ్డి, పెద్దపల్లి నుంచి నల్ల మనోహర్‌రెడ్డి, బొద్దుల లక్ష్మణ్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి పలుసార్లు కేటీఆర్‌ను కలవగా.. లోకల్‌గా పనిచేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అయితే వీరెవరికీ అవకాశం దక్కలేదు. దీంతో నలుగురూ హైకమాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అవుతున్నారు. పెద్దపల్లి నుంచి నల్ల మనోహర్‌రెడ్డి, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి పోటీకి రెడీ అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న హైకమాండ్ హామీతో నల్గొండ జిల్లాకు చెందిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి రెండు, మూడేండ్లుగా ప్రజల మధ్య తిరుగుతున్నాడు. అమిత్ తాత గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో పేదలకు ఆర్థిక సాయం, నిరుద్యోగులకు ఫ్రీ కోచింగ్, పేషెంట్లకు పౌష్టికాహారం పంపిణీలాంటి కార్యక్రమాలు చేపట్టాడు. ఈ క్రమంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అమిత్ నల్గొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించగా, రెండుచోట్లా సిట్టింగులకే కేటాయించారు. దీంతో అమిత్‌రెడ్డి, ఆయన తండ్రి సుఖేందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు లోనయ్యారు.
కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావుపై వ్యతిరేకత నేపథ్యంలో స్టేట్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. టికెట్ ఆఫర్ చేయడంతో ఆయన జీఎస్సార్ ట్రస్ట్ పేరిట ఏడాదిన్నర నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లీడర్ షిప్ ప్రోగ్రాంలు, హెల్త్ క్యాంపులు, జాబ్‌మేళాలు నిర్వహించారు. సేవా కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేశారు. చివరికి టికెట్ వనమాకే ఇవ్వడంతో ఆయన నారాజ్ అయ్యారు.
ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పేరుతో..
2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ రాష్ట్రంలో తమకు తిరుగులేదని భావిస్తున్న టైంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా రూలింగ్ పార్టీని నిరాశపరిచాయి. కీలకమైన హుజూరాబాద్ బై ఎలక్షన్లో ఓటమి తర్వాత అధికార పార్టీ పెద్దల్లో ఆందోళన పెరిగింది. ఈక్రమంలో గడిచిన రెండేండ్లుగా హైకమాండ్ నియోజకవర్గాల్లో సర్వేల మీద సర్వేలు చేయించింది. ఆయాచోట్ల పార్టీ పరిస్థితిని, ఎమ్మెల్యేల పనితీరును, ప్రజలనాడీని అంచనా వేసింది. 20 నుంచి 30 నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని, వాళ్లకు మళ్లీ టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదని అంచనాకు వచ్చింది. దీంతో ఆయా చోట్ల పార్టీ పెద్దలు ప్రత్యామ్నాయ లీడర్లను పిలిపించుకొని వచ్చే ఎన్నికల్లో మీకే టికెట్ ఇస్తామని, పబ్లిక్‌లో తిరుగుతూ, ప్రభుత్వ స్కీములపై ప్రచారం చేయాలని చెప్పి పంపించింది. అప్పటి నుంచి తమకే టికెట్ వస్తుందన్న ఆశతో పార్టీ, సేవా కార్యక్రమాల పేరుతో నియోజకవర్గాల్లో కోట్లు ఖర్చు పెట్టుకున్న నేతలున్నారు. తీరా సిట్టింగుకే సీటు ఇవ్వడంతో అలాంటి లీడర్లంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.