కాంగ్రెస్‌‌లో టికెట్ టెన్షన్‌‌..ఆలేరులో ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్సీ పేర్లు

కాంగ్రెస్‌‌లో టికెట్ టెన్షన్‌‌..ఆలేరులో ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్సీ పేర్లు
  •     ఆలేరులో ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్సీ పేర్లు
  •     కోమటిరెడ్డి పోటీపై సోషల్​మీడియా పోస్టులు
  •     భువనగిరి నుంచి 11, ఆలేరు నుంచి 17 మంది అప్లికేషన్లు
  •     నేడు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయ సేకరణ

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై యాదాద్రి జిల్లాలో టెన్షన్​వాతావరణం నెలకొంది. భువనగిరి నుంచి 11, ఆలేరు నుంచి 17 మంది అప్లికేషన్లు పెట్టుకోగా..  అభ్యర్థుల ఎంపికపై బుధవారం జిల్లాలో అభిప్రాయ సేకరణ జరగనుంది.  ఆశావహులతో పాటు సీనియర్‌‌‌‌ నాయకులు, మండల అధ్యక్షుల అభిప్రాయాలు తీసుకోనున్నారు. కాగా,  భువనగిరి, ఆలేరులో బీసీ అభ్యర్థులే పోటీ చేస్తారంటూ ఒకవైపు,  ఒకచోట ఓసీ బరిలో నిలబడతారని ఆ పార్టీ లీడర్లు అంటున్నారు.  ఓసీ స్థానంలో కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డితో పాటు ఓ ఎన్‌‌ఆర్‌‌‌‌ఐ పేరు కూడా వినిపిస్తోంది. 

సోషల్​మీడియాలో కోమటిరెడ్డి పేరు

నల్గొండ అసెంబ్లీలో బీసీకి అవకాశమిస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటెడ్డి ప్రకటించిన్పటి నుంచి సీన్​ మారింది.  భువనగిరి అసెంబ్లీకి కోమటిరెడ్డి పోటీ చేస్తారన్న ప్రచారం మొదలైంది. స్థానిక కాంగ్రెస్​ లీడర్లు కొందరు కోమటిరెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు. ఆయనకు సంబంధించిన నేతలు, అనుచరులు ‘మన భువనగిరి - మన కోమటిరెడ్డి’ పేరిట సోషల్​మీడియాలో పోస్టులు పెడుతున్నారు  కాబోయే ఎమ్మెల్యే అంటూ వైరల్‌‌ చేస్తున్నారు. 

ఆలేరులో ఆ నలుగురు

ఆలేరు నియోజకవర్గంలో పోటీ చేసేందుకు 17 మంది అప్లై చేసుకున్నారు. ఈ నియోజకవర్గంలో 2009 నుంచి 2018 వరకూ కాంగ్రెస్​ తరపున బీసీ అభ్యర్థి పోటీ చేశారు. ఈసారి కూడా బీసీకే అవకాశమిస్తారని అంటున్నారు. అప్లై చేసుకున్న వారిలో నలుగురి పేర్లు సెలక్ట్​ చేశారని తెలుస్తోంది. బీసీల తరపున బీర్ల అయిలయ్య, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్​ కుడుదుల నగేశ్​, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. 

అభ్యర్థుల ఎంపికపై నేడు అభిప్రాయ సేకరణ

భువనగిరి లోక్​సభ పరిధిలోని భువనగిరి, ఆలేరు అభ్యర్థుల ఎంపికపై భువనగిరి, యాదగిరిగుట్టలో బుధవారం వేర్వేరుగా మీటింగ్​ నిర్వహించనున్నారు. భువనగిరి పార్లమెంట్​ ఇన్​చార్జ్​ ఎమ్మెల్యే (కర్ణాటక) శ్రీనివాస్​ మానె ఈ మీటింగ్​లో పాల్గొని అభిప్రాయాలను సేకరిస్తారు. ఎమ్మెల్యే టికెట్​ కోసం అప్లై​ చేసుకున్న అభ్యర్థులతో పాటు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు హాజరుకానున్నారు. వీరందరూ తమతమ అభిప్రాయాలు మీటింగ్​లో చెప్పాల్సి ఉంటుంది.  ఈ అభిప్రాయాలను హైకమాండ్‌‌కు పంపించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

తెరపైకి ఎన్ఆర్ఐ?

భువనగిరి నియోజవర్గంలో పోటీ చేసేందుకు 11 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వీరిలో  ముగ్గురు మినహా అందరూ బీసీలే ఉన్నారు. ప్రస్తుతం బీఆర్​ఎస్​లో ఉన్న పాతకాపు చింతల వెంకటేశ్వర్​రెడ్డికి టికెట్​ కన్ఫామ్​ చేస్తే కాంగ్రెస్​లో చేరుతారని అంటున్నారు.  బీసీకి అవకాశం ఇస్తే రామాంజనేయులు గౌడ్, పచ్చిమట్ల శివరాజ్​ గౌడ్​ పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే అన్ని విధాలుగా బలంగా ఉన్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డిని ఎదుర్కోవాలంటే.. ఆర్థిక వనరులు ఉన్న అభ్యర్థి అవసరమని కాంగ్రెస్​ భావిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా తెరమీదికి ఎన్ఆర్ఐ ప్రస్తావన వచ్చినట్టు సమాచారం. ఆయన ఎవరన్న విషయం ఇంకా బయటికి రాలేదు.