తెలంగాణకు వస్తం..ఏపీలో ఇంకెన్నిరోజులు

V6 Velugu Posted on Aug 22, 2021

హైదరాబాద్, వెలుగు:  వారంతా తెలంగాణ నేటివిటీ ఉన్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు అవుతున్నా ఇంకా ఏపీలోనే పనిచేస్తున్నారు. తమను సొంత రాష్ట్రానికి తీసుకోవాలని ఏండ్లుగా కోరుతున్నా తెలంగాణ సర్కార్ వారిని​పట్టించుకోవట్లేదు. పరాయి రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నామని వారంతా వాపోతున్నారు. ఏపీలో ప్రస్తుతం జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, గెజిటెడ్ అధికారులు మొత్తం సుమారు 300 మంది పనిచేస్తున్నారు. 

పోస్టులు ఖాళీ లేవు..

ఏపీలో పనిచేస్తున్న గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను తెలంగాణకు తీసుకోవడానికి ఇక్కడ పోస్టులు ఖాళీ లేవని అధికారులు అంటున్నారు. చాలా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్నందున సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం అనుకుంటే అదేం పెద్ద సమస్య కాదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు.

ఫోర్త్ క్లాస్ ఉద్యోగులను తీసుకొచ్చిన్రు

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ ను ప్రభుత్వం ఇక్కడకు తీసుకొచ్చింది. ఇటీవలే వివిధ డిపార్ట్ మెంట్లలో పోస్టింగ్ లు ఇచ్చింది. వీరిలో వాచ్ మెన్లు, అటెండర్లు, స్వీపర్లున్నారు. మొత్తం 610 మంది ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, 80 మంది రికార్డు అసిస్టెంట్లను తెలంగాణకు వచ్చారు. ఇంకా ఏపీలో ఫోర్త్ క్లాస్ వాళ్లు మరో 200 మంది ఉన్నారని, వాళ్లను కూడా తెలంగాణకు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.  ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకురావాలని సీఎం కేసీఆర్​కు ఉద్యోగుల జేఏసీ నేతలు మామిళ్ల రాజేందర్, మమత ఇటీవల కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించి సీఎస్ కు ఆదేశాలు ఇచ్చారని వారు తెలిపారు.

వాళ్లు ఇక్కడికొచ్చినా ఏ ఇబ్బందులు ఉండవ్

రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఏపీలో తెలంగాణకు చెందిన ఇంటర్, డిగ్రీ లెక్చరర్లు 232 మంది పనిచేస్తున్నరు. వాళ్లను ఇక్కడకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నం. తెలంగాణకు వాళ్లు వస్తే ఇక్కడి వాళ్లకు ఏ ఇబ్బందులు రావు. ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  అయితే ఇక్కడ ఏపీకి చెందిన లెక్చరర్లు చాలా మంది పనిచేస్తున్నరు. వాళ్లు మాత్రం ఏపీ వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. సేమ్ సబ్జెక్ట్ చెప్పే ఇక్కడి లెక్చరర్ ఏపీకి వెళితే అక్కడి వాళ్లను తీసుకురావచ్చని రూల్ ఉంది. దీన్ని సవరించాలని ప్రభుత్వాన్ని ఎంతో కాలంగా కోరుతున్నం.  

– మధుసూదన్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్

ఏడేండ్లుగా పోరాడుతున్నం..

ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకుపొమ్మని ఏడేండ్ల నుంచి కోరుతున్నం. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఏడేండ్లలో చాలామంది రిటైర్ అయ్యిన్రు. మమ్నల్ని తీసుకుపోవాలంటే మ్యూచువల్ అవగాహనతో హైదరాబాద్​లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు ఏపీకి వెళ్లాలని చెబుతున్నరు. రెండు ప్రభుత్వాలు ఏ రాష్ట్ర ఉద్యోగులు ఆ రాష్ట్రంలో ఉండాలన్న నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నం. ఏడేండ్లవుతున్నా ఇంకా ఏపీలోనే పనిచేస్తున్నం. మా సమస్యను పరిష్కరించాలని తెలంగాణ సర్కార్​కు విన్నవిస్తున్నం. 
– కర్నూలులో డ్యూటీ చేస్తున్న 
తెలంగాణకు చెందిన ఓ గెజిటెడ్ ఆఫీసర్ 

Tagged AP, WORK, seven years, Telangana employee

Latest Videos

Subscribe Now

More News