
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్‌ను ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి, దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 1.10 లక్షలకు పైగా దరఖాస్తులను రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, డెస్క్‌వర్క్‌ను సిద్ధం చేశాయి.
వరుస సెలవులు రావడంతో అన్ని అప్లికేషన్లకు సంబంధించి రిపోర్టులు సిద్ధం కాలేదు. దీంతో డ్రైవ్‌ను 17 వరకు పొడిగించారు. ఆ లోపు అన్ని అప్లికేషన్లను పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిశీల నకు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా నియమించారు. ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెండింగ్ దర ఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్‌లో కూడా దరఖాస్తుదారుడే ఉన్నాడా? లేడా? అన్నది నిర్ధారించుకునేందుకు క్షేత్రస్థాయి సర్వే చేపట్టి నివేదికలు సిద్ధం చేసుకున్నాయి. ధరణి పోర్టల్‌లో ఆర్డీవోలు, తహసీల్దార్లకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తుల అప్రూవల్, ఆన్‌లైన్ వర్క్ త్వరలో ప్రారంభమవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.