రైతుల అప్పుల్లో దేశంలో తెలంగాణకు ఐదో స్థానం

రైతుల అప్పుల్లో దేశంలో తెలంగాణకు ఐదో స్థానం
  • కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడి
  • రైతుల అప్పుల్లో దేశంలో తెలంగాణకు ఐదో స్థానం
  • సగటున ఒక్కో రైతు కుటుంబం నెల సంపాదన కేవలం రూ.9,403
  • రైతుబంధు మినహా ఇంకే సాయం చేయని సర్కారు
  • కౌలు రైతులకు అదీ అందుతలే
  • 37 లక్షల మందికిపైగా రైతులకు రుణమాఫీ కాలే
  • రైతుబంధు పైసలు, పంట డబ్బుల్ని హోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెడుతున్న బ్యాంకులు
  • రుణ భారంతో పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు
  • రాష్ట్రం వచ్చినంక 8 వేల మందికి పైగా సూసైడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంటకు గిట్టుబాటు ధర రాక, పంట నష్టపోతే పరిహారం అందక, రుణమాఫీ జరగక.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతుపై సగటున రూ.1,52,113 అప్పు ఉంది. రైతుల అప్పుల విషయంలో దేశంలోనే ఐదో స్థానంలో తెలంగాణ ఉండటం వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతున్నది. పెరుగుతున్న సాగు ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెరగడం లేదు. రాష్ట్రంలో సగటున ఒక రైతు కుటుంబం నెలకు సంపాదిస్తున్నది కేవలం రూ.9,403 మాత్రమే! పార్లమెంట్‌‌లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో ఈ విషయం బయటపడింది.

కౌలు రైతు కుదేలు

రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పేరుతో డబ్బు సాయం చేస్తున్నా.. రైతులకు దాని వల్ల జరుగుతున్న మేలు కొంత వరకే. కేవలం భూ యజమానులకే ఆ పథకాన్ని సర్కారు వర్తింపచేస్తున్నది. దీంతో చిన్నా చితకా కౌలు రైతులకు సాయం అందడం లేదు. కౌలు రైతులకు రైతుబంధు ఇచ్చేది లేదని సీఎం కేసీఆర్ గతంలో తేల్చిచెప్పారు. వారికి బ్యాంకుల నుంచి పంట రుణాలూ రావట్లేదు. ఫలితంగా కౌలు రైతులు ఎక్కువ వడ్డీలకు బయటి నుంచి అప్పులు తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ధరణి వచ్చాక పట్టాపాసు పుస్తకాల్లో కాస్తు కాలం ఎత్తేయడంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో సగానికిపైగా ఉన్నది కౌలు రైతులేనని ఇటీవలి ఓ సర్వే తేల్చింది. రైతు బంధు పేరు చెప్పి రాష్ట్రంలో రైతులకు ప్రయోజనం కలిగించే మిగతా పథకాలన్నింటినీ రాష్ట్ర సర్కారు బంద్​పెట్టేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఏడాది ఒక్కరికీ రుణమాఫీ కాలే

తెలంగాణ ఏర్పడ్డాక రైతులకు లక్ష వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని సక్రమంగా అమలు చేయట్లేదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క రైతుకూ రాష్ట్ర సర్కారు రుణమాఫీ చేయలేదు. 2018 ఎన్నికలప్పుడు నాలుగు విడతల్లో రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. దాని ప్రకారం 2020లో 25 వేల లోపు రుణాలు తీసుకున్న 2.96 లక్షల మంది రైతులకే మాఫీ చేశారు. తర్వాత 2021లో 25 వేల నుంచి రూ.50 వేల వరకున్న రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా.. కొంత మంది రైతులకే ప్రయోజనం కలిగింది. 37 లక్షల మందికిపైగా రైతులు రుణమాఫీ జరగక.. అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు బ్యాంకుల్లో జమ అయిన రైతుబంధు పైసలు, పంట అమ్మాక వచ్చిన డబ్బులను బ్యాంకర్లు హోల్డ్‌‌లో పెడ్తున్నారు. రైతుల నుంచి వడ్డీ కట్టించుకున్నాకే వాటిని రిలీజ్​ చేస్తున్నారు. దీని ఫలితంగా లక్షలాది మంది చిన్న సన్న కారు రైతులపై అప్పుల భారం పెరిగిపోతున్నది.

నష్ట పరిహారమూ అందుతలే

వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చింది. 2018 వరకు ఆ స్కీంలో భాగమైన రాష్ట్ర సర్కారు.. తర్వాత దాన్నుంచి బయటికొచ్చింది. ప్రస్తుతం ఎలాంటి ప్రీమియం చెల్లించట్లేదు. ఈ స్కీం కింద రైతు 50% ప్రీమియం చెల్లిస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 25% వాటాను చెల్లించాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర సర్కారు తన వాటాను చెల్లించకుండా కాలం వెళ్లదీస్తూ వచ్చింది. తర్వాత ఆ స్కీం నుంచి బయటకు వచ్చేసింది. ఫలితంగా వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదు. మూడేండ్లలో లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయినా రైతులను ఆదుకోలేదు. విచిత్రంగా ఓ వైపు పంట నష్టంపై కేంద్రానికి విజ్ఞప్తులు పంపామని చెబుతూ.. అసలు రాష్ట్రంలో పంట నష్టమే జరగలేదని నిరుడు హైకోర్టులో ప్రభుత్వం వాదించింది. పంట నష్టపోయిన రైతులకు ఇన్​పుట్ సబ్సిడీనీ బంజేసింది. ఏడేండ్ల నుంచి దాని ఊసే ఎత్తడం లేదు.+

ఆగని రైతు ఆత్మహత్యలు

అప్పుల బాధలు పెరిగిపోతుండడం, పంట నష్టపోయినా సర్కారు నుంచి సాయం అందకపోవడంతో రోజూ ఎక్కడో చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 8 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్కలు చెప్తున్నాయి. అయితే రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా ప్రయోజనాన్ని కల్పిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. కానీ రైతులు ఆత్మహత్యలకు పాల్పడకముందే వారిని ఆదుకునే ప్రయత్నాలు మాత్రం చెయ్యట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఫ్రీ ఎరువులు ఏమాయె

2018 ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్.. రైతులందరికీ ఎరువులను ఫ్రీగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ప్రగతిభవన్‌‌కు పిలిపించుకుని మరీ ఈ ప్రకటన చేశారు. తన ప్రకటనతో దేశం దేశమే ఆగమైపోతదని, అదో చరిత్ర అవుతదని, కేసీఆర్ పుట్టిందే అందుకు కావొచ్చని చెప్పిన ఆయన.. ఇప్పటికీ ఒక్కరంటే ఒక్క రైతుకూ ఎరువులను ఉచితంగా ఇవ్వలేదు. నిజానికి ప్రభుత్వం ఇచ్చే రైతుబంధు పైసలు కేవలం ఎరువులకే సరిపోతున్నాయి. మరోవైపు ఇంతకుముందున్న సీడ్ సబ్సిడీని కూడా సర్కార్ ఎత్తేసింది. విత్తనాలపై 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని రైతులు కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు.