కొత్త పీఆర్సీ ఏర్పాటెప్పుడు.?

కొత్త పీఆర్సీ ఏర్పాటెప్పుడు.?

తెలంగాణ తొలి పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఐదేళ్ల గడువు గత నెల(జూన్)30తో ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వోద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు జులై 2023 నుంచి రెండో పీఆర్సీ అమల్లోకి రావాలి. పీఆర్సీని సకాలంలో ఏర్పాటు చేయకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోంది. దీంతో కొత్త పీఆర్సీ రెకమండేషన్స్ అమల్లోకి రావడం ఆలస్యమవుతోంది. ఏపీ పీఆర్సీ గడువు కూడా గత నెలతోనే ముగిసింది. అక్కడి ప్రభుత్వం వెంటనే నూతన పే రివిజన్ కమిషన్ నియమిస్తూ ఈ నెల12న జీవో కూడా జారీ చేసింది. ఏడాదిలోగా ప్రభుత్వానికి రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. 

ఆ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) ఏర్పాటు చేసుకొని, ఇంటీరియం రిలీఫ్(ఐఆర్) ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణలో మాత్రం నేటి వరకూ పే రివిజన్ కమిషన్ ఊసే లేదు. జేఏసీ ఏర్పాటుకు కొన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రాకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు శాపంగా మారుతోంది. కొన్ని ఉద్యోగ సంఘాల నేతల్లో పోరాటం కాదుకదా, పీఆర్సీ సాధించాలన్న ఆరాటం కూడా కనిపించడం లేదు. తొలి పీఆర్సీలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కలిసిగట్టుగా నడవాల్సిన సంఘాలు ఏమీ పట్టనట్టు ఉదాసీనంగా వ్యవహరించడం ఉద్యోగవర్గాలను ఆవేదనకు గురిచేస్తున్నది. 

తొలి పీఆర్సీలో భారీ నష్టం!

ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కారుగా చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రెండో పే రివిజన్ కమిషన్ ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ జులై నుంచే కొత్త పీఆర్సీ సిఫారసులు అమల్లోకి రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు కనీసం పీఆర్సీ కూడా వేయలేదు. తొలి పే రివిజన్ కమిషన్ సకాలంలోనే ఏర్పాటు చేసినప్పటికీ, అమలులో రికార్డు స్థాయిలో జాప్యం చేసింది. రెండేండ్ల  తొమ్మిది నెలలు ఆలస్యంగా పీఆర్సీ అమలు చేసింది. తొలి పీఆర్సీ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి, ఆచరణలో జరిగింది మరొకటి. ‘ముగ్గురు అధికారులతో ఫస్ట్ పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేస్తం. మూడు నెలల్లో కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది. 2018 జూన్ రెండు నుంచి ఐఆర్,15 ఆగస్టు నుంచి పీఆర్సీ ఫిట్​మెంట్ అమలు చేస్తం’ అని 2018 మే 16 నాడు ప్రెస్ మీట్లో స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆయన చెప్పినట్టే ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో 18 మే, 2018 న తెలంగాణ మొదటి వేతన సవరణ కమిటీ అయితే ఏర్పాటైంది. కానీ 3 నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్సీ రిపోర్ట్, 30 నెలలు ఆలస్యంగా 31 డిసెంబర్ 2020 న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. 

అది కూడా సంఘాలు ఆందోళనలు చేపట్టడం వల్లే. పీఆర్సీ లేటైన సందర్భాల్లో ఐఆర్ మంజూరు చేయడం రివాజు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన పీఆర్సీల్లో ఐఆర్ ఇచ్చారు. 1998 పీఆర్సీ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం11 శాతం ఐఆర్ ప్రకటించింది. 2005 పీఆర్సీలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 8.5 శాతం, 2010 పీఆర్సీలో రోశయ్య ప్రభుత్వం 22 శాతం, 2013 పీఆర్సీలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ 27 శాతం ఐఆర్ మంజూరు చేసింది. గత రెండున్నర దశాబ్దాల్లో కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే ఐఆర్ శాంక్షన్ చేయలేదు. ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు ఎంత మొత్తుకున్నా రాష్ట్ర సర్కార్ పట్టించుకోలేదు. గత పీఆర్సీలకు భిన్నంగా ఐఆర్ లేకుండానే ప్రభుత్వం నేరుగా తొలి పీఆర్సీ అమలు చేసింది. అదీ కూడా జులై 2018 నుంచి వర్తింపజేయాల్సిన ఆర్థిక ప్రయోజనాలను 21 నెలలు ఆలస్యంగా ఏప్రిల్ 2020 నుంచి అమలు చేసింది. జులై 2018 నుంచి పీఆర్సీ అమలు చేస్తూనే, 2020 మార్చి వరకు పెరిగిన వేతనాలు చెల్లించలేదు. 21 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నోషనల్ గా ప్రకటించింది. దీంతో స్వరాష్ట్రంలో అమలైన తొలి పీఆర్సీలో ఒక్కో ఉద్యోగి నోషనల్ కారణంగా సగటున రెండు లక్షల రూపాయలు నష్టపోయాడు. ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే, పీఆర్సీ ఐదేళ్ల పీరియడ్ ముగిసిపోయినప్పటికీ కమిషన్ చేసిన పలు కీలక సిఫారసులపై ప్రభుత్వం నేటికీ జీవోలు జారీ చేయలేదు. తను నియమించిన కమిషన్ చేసిన సిఫారసులను ప్రభుత్వమే పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

జేఏసీగా ఏర్పడాలి!

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలు జేఏసీ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, ఎన్నో ఉత్తర్వులు సాధించాయి. జటిల సమస్యలు పరిష్కరించుకున్నాయి. పీఆర్సీ సందర్భంగా జేఏసీ ఏర్పాటు అత్యంత కీలకం, అనివార్యం కూడా. 2014 నుంచి రాష్ట్రంలోని కొన్ని సంఘాలు జేఏసీ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం శోచనీయం. ఈ పరిస్థితి అంతిమంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు భారీ నష్టం చేస్తోంది. తొలి పీఆర్సీ గడువు ముగిసినా పలు సిఫారసులపై ఉత్తర్వులు ఇంకా వెలువడకపోవడానికి ప్రధాన కారణం సంఘాల మధ్య ఉన్న అనైక్యతే. జేఏసీగా ఏర్పడకపోవడం, ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లనే ప్రభుత్వం ఉద్యోగవర్గాలను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలి. వెంటనే జేఏసీ ఏర్పాటు చేయాలి. దీనికోసం తమ మధ్య ఉన్న విభేదాలు, భేషజాలను తాత్కాలికంగానైనా సంఘాలు పక్కకు పెట్టాలి. రాష్ట్రంలో ఉన్న దాదాపు పది లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు వారి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి. దీని కోసం సంఘాలు చొరవ చూపాలి. గతంలో మాదిరిగా అన్ని సంఘాలతో బలమైన ఉమ్మడి వేదిక(జేఏసీ) ఏర్పాటు చేయాలి. 30 శాతం ఐఆర్ ప్రకటించాలని స్వయంగా సీఎం కేసీఆర్​ను కలిసి గట్టిగా కోరాలి. పకడ్బందీ వ్యూహం, ఉమ్మడి పోరాటాలతోనే ఐఆర్ సహా సమస్యలు సాధించవచ్చు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల రాష్ట్ర నేతల దక్షతపైనే ఇది ఆధారపడి ఉంది. తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని సీఎం, మంత్రులు పదేపదే చెప్తుంటారు. అదే నిజమైతే, గత పీఆర్సీ చేసిన అన్ని సిఫారసులపై జీవోలు జారీ చేయాలి. రెండో పే రివిజన్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. జులై 2023 నుంచి వర్తించే విధంగా 30 శాతం ఐఆర్ ప్రకటించాలి. తమది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ సర్కార్ అని ఆచరణలో చూపాలి.

30 శాతం ఐఆర్ ఇవ్వాలి

మెరుగైన పీఆర్సీ ఫిట్​మెంట్ పొందాలంటే ముందుగా ఐఆర్ సాధించుకోవాల్సిందే. ఐఆర్ ఇవ్వకుండా నేరుగా ఫిట్​మెంట్ అమలు చేయడంతో తొలి పీఆర్సీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఆర్థికంగా భారీగా నష్టపోయిన విషయాన్ని సంఘాలు మర్చిపోవద్దు. జులై 2023 నుంచి వర్తించే విధంగా 30 శాతం ఐఆర్ ప్రకటించాల్సిందిగా సంఘాలు కలిసిగట్టుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. 30 శాతం ఐఆర్ సాధించుకుంటే పీఆర్సీలో మంచి ఫిట్​మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఐఆర్ మంజూరు చేస్తే, మూలవేతనంలో కనీస పెరుగుదలకు హామీ లభించినట్లే. పైగా, నోషనల్ తిప్పలు తప్పడానికి  అవకాశం కూడా ఉంటుంది. ఐఆర్ ఇవ్వకపోతే, పీఆర్సీ అమలు వరకు నోషనల్ గా ప్రకటించే ప్రమాదం కూడా ఉంది. తొలి పీఆర్సీలో జరిగింది ఇదే. మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కారాదు. అదీ కాకుండా, ఇప్పుడు 30 శాతం ఐఆర్ సాధిస్తేనే, ఉద్యోగవర్గాల ఆకాంక్షల కనుగుణంగా మంచి ఫిట్​మెంట్ పొందడం సులువు అవుతుంది. నాలుగైదు నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి, ఆ వెంటనే లోకసభకు ఎన్నికలు జరగనున్నాయి. దీని దృష్ట్యా ఐఆర్ వెంటనే సాధించుకోవాల్సి ఉంది. సాధారణంగా ఎన్నికల ముందు ప్రభుత్వాలు కాస్త ఉదారంగా ఉంటాయి. ఈ అవకాశాన్ని సంఘాలు ఒడిసి పట్టుకోవాలి. 

మానేటి ప్రతాపరెడ్డి, గౌరవాధ్యక్షుడు, టీఆర్ టీఎఫ్