డీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు

డీఎస్సీ పాత నోటిఫికేషన్ రద్దు
  • ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్ 
  • ఇయ్యాల 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్
  • జూన్ నెలాఖరులో ఆన్​లైన్​లో పరీక్షలు 

హైదరాబాద్, వెలుగు: టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. గతేడాది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ రిలీజ్ చేసిన డీఎస్సీ–2023 నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న11,062 టీచర్ పోస్టుల భర్తీకి గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. వీటికి జూన్ నెలాఖరులో ఆన్​లైన్ లో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. 

గతేడాది సెప్టెంబర్ 6న 5,089 టీచర్ పోస్టుల భర్తీకి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ డీఎస్సీ–2023 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆయా పోస్టులకు1,77,502 దరఖాస్తులు అందాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ప్రస్తుతం రాత పరీక్షలు జరగకపోవడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని తెలిపింది. 

కొత్త నోటిఫికేషన్​లో డీఎస్సీ 2023కి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్​లో తక్కువ పోస్టులు ఉండటంతో పాటు వర్టికల్ విధానంలో పోస్టులను భర్తీ చేయడంతో తక్కువ దరఖాస్తులు అందాయి. తాజాగా భారీగా పోస్టులు పెరగడంతో మరో రెండు లక్షలకు పైగా కొత్త దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఇయ్యాల నోటిఫికేషన్..

11,062 పోస్టులతో గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయాత్తమయ్యారు. పాత నోటిఫికేషన్​లోని 5,089 పోస్టులతో పాటు కొత్తగా మరో 5,973 పోస్టులను జత చేయనున్నారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టుల్లో 4,957 జనరల్ టీచర్ పోస్టులుండగా.. 1,016 స్పెషల్ టీచర్ పోస్టులు ఉన్నాయి. తొలిసారిగా స్పెషల్ టీచర్ పోస్టులు భర్తీ చేస్తుండటంతో ఆయా పోస్టులకు కొత్తగా సర్వీస్ రూల్స్ తయారు చేశారు. ఈ పోస్టులకు ప్రత్యేక అర్హతలు ఉండనున్నాయి. అయితే ఈ పోస్టులకు మే నెలాఖరు, జూన్ మొదటివారంలో రాత పరీక్షలు నిర్వహించాలని సర్కారు భావించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండటంతో అదే నెలాఖరులో పరీక్షలు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది. 

డీఎస్సీ–2024 పోస్టులు ఇలా..


స్కూల్ అసిస్టెంట్    2,849
ఎస్​జీటీ        7,304 
పండిట్         727 
పీఈటీ        182 
మొత్తం        11,062