హైకోర్టు చెప్పినా సర్కార్ వింటలే

హైకోర్టు చెప్పినా సర్కార్ వింటలే
  • తీర్పులు, ఆదేశాల అమలులో సర్కార్ నిర్లక్ష్యం
  • హైకోర్టులో ఏటా వేలాదిగా కోర్టు ధిక్కరణ కేసులు నమోదు 
  • సర్కార్​కు ప్రతినిధిగా ఉండే సీఎస్​పైనే 290 కేసులు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఇస్తున్న తీర్పులు, ఆదేశాల అమలులో రాష్ట్ర సర్కార్ లెక్కలేనట్లుగా వ్యవహరిస్తోంది. పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. న్యాయం కోసం భూనిర్వాసితులు, ఇతర కేసుల్లో బాధితులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులను ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్ర హైకోర్టులో ఏటా నమోదవుతున్న వేలాది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుల్లో 90 శాతం ప్రభుత్వాధికారుల మీద నమోదవుతున్నవే కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. వివిధ కేసుల్లో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యే చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పై సుమారు 290 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కాగా, వివిధ ప్రభుత్వ శాఖల కమిషనర్లు, సెక్రటరీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లపై కూడా వందల్లో కేసులు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో కొందరు ఐఏఎస్ అధికారులు, ఇతర అధికారులకు హైకోర్టు  జైలు శిక్ష, జరిమానా విధించింది. ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోడం, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో కొన్ని సందర్భాల్లో కోర్టు తీర్పులు కూడా పక్కనపెట్టాల్సి వస్తోందని, ఫలితంగా తాము బలికావాల్సి వస్తోందని శిక్షకు గురైన ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైకోర్టు  జోక్యం చేసుకుంటేనే న్యాయం.. 
రాష్ట్రంలో ప్రజలకు ఏ  సమస్య ఎదురైనా న్యాయ స్థానాలు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం స్పందించడం లేదు. వివిధ ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయి నిర్వాసితులుగా మారినోళ్లకు న్యాయం చేయాలని, కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, టెస్టుల సంఖ్య పెంచాలని, ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీని అరికట్టాలని, రాష్ట్రంలో ప్రాచీన కట్టడాలను పరిరక్షించాలని, ఖాళీగా ఉన్న హెచ్ఆర్సీ, మహిళా కమిషన్, బాలల హక్కుల కమిషన్, టీఎస్ పీఎస్సీ లాంటి పాలకవర్గాల్లో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు అనేక తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా హైకోర్టు జోక్యం చేసుకుంటేగానీ కొన్ని సమస్యలకు పరిష్కారం లభించని, సర్కారు స్పందించని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు.

ఏటా వేలల్లో కోర్టు ధిక్కరణ కేసులు.. 
‘ఆర్టీసీ కార్మికులు సెప్టెంబర్ జీతాలు కావాలని హైకోర్టులో కేసు వేశారు. తాము ఆర్టీసీకి నిధులు లేవని నివేదించాం. అలాంటప్పుడు హైకోర్టు ఏం చేస్తది.. కొడుతదా ?’ అని సీఎం కేసీఆర్ స్వయంగా ఆర్టీసీ సమ్మె టైమ్ లో మాట్లాడిన విషయం తెలిసిందే. సీఎం కామెంట్లకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర హైకోర్టులో 2014లో 2,289 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు(సీసీ) కేసులు, 2015లో 2,534 కేసులు, 2016లో 2,651 కేసులు, 2017లో 2851 , 2018లో 3,509 కేసులు, 2019లో 1854 కేసులు, 2‌‌‌‌‌‌‌‌020లో 1,188 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది గడచిన ఆర్నెళ్లలో 757 కేసుల పైనే దాఖలయ్యాయి. గత ఏడేండ్లలో మొత్తం 17,633 కేసులు నమోదయ్యాయి. వీటిలో 90% కేసులు ప్రభుత్వ అధికారులపైనే నమోదయ్యాయంటే.. రాష్ట్రంలో కోర్టు తీర్పుల అమలు ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సర్కార్ విధానాలకు ఐఏఎస్ లు బలి..  
కోర్టు ధిక్కరణ కేసుల్లో సీఎస్ పై అనేక సందర్బాల్లో హైకోర్టు సీరియస్ అవ్వగా, ఈ ఏడాది నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సిద్దిపేట కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా, భూసేకరణ అధికారి శ్రీనివాసులు, ఆర్డీవో జయచంద్రారెడ్డికి జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో తమ అభ్యంతరాలు వినకుండా అధికారులు డిక్లరేషన్, అవార్డు ఇచ్చారని బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించగా, రైతుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. రైతుల అభ్యంతరాలు వినకుండానే డిక్లరేషన్, అవార్డును ఇవ్వడంతో ఆగ్రహించిన హైకోర్టు 2020 జనవరిలో సిద్దిపేట జిల్లా కలెక్టర్‌‌‌‌ వెంకట్రామిరెడ్డి, సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌‌‌‌ కృష్ణభాస్కర్‌‌‌‌కు రూ.2వేలు జరిమానా విధించింది. అలాగే సిద్దిపేట ఆర్డీవో జయచంద్రారెడ్డికి 2 నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేలు జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌‌‌‌ కూడా హైకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. 

సీఎస్ పై 290 కేసులుంటే.. 22 కేసులే ఉన్నట్టు చెప్పిన్రు 
సీఎస్ సోమేశ్ కుమార్ పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుల వివరాలు కావాలని అడ్వకేట్ జనరల్ ఆఫీసులో ఆర్టీఐ దరఖాస్తు చేశాను. మొదట తమ ఆఫీసు పబ్లిక్ అథారిటీ కాదని, ఆర్టీఐ పరిధి లోకి రాదని రిప్లై ఇచ్చారు. ఆర్టీఐ పరిధిలోకి ఎలా వస్తుందో చెప్తూ మళ్లీ దరఖాస్తు చేయడంతో పీఐవో రిప్లై ఇచ్చారు. హైకోర్టు వెబ్‌సైట్ ప్రకారం సీఎస్ పై సుమారు 290 కేసులుంటే.. నాలుగేళ్లలో 22 కంటెంప్ట్ కేసులే ఉన్నట్టు చెప్పారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పని చేస్తున్న సీఎస్ ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
- మోహన్ లాల్, హైకోర్టు అడ్వకేట్

హైకోర్టుతో  కొట్లాడేందుకు సీఎస్​కు రూ.58 కోట్లు
రాష్ట్ర సీఎస్​గా పని చేస్తున్న సోమేశ్​కుమార్​పై 290 కోర్టు ధిక్కరణ కేసులు హైకోర్టులో నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ కమిషనర్​గా పని చేసిన కాలంలో నమోదైనవి దాదాపు వంద వరకు ఉండగా, మిగతావన్నీ సీఎస్​గా, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ)గా పని చేస్తున్న క్రమంలో ఫైల్ చేసినవే. రాష్ట్రంలో అత్యధికంగా కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కొంటున్న అధికారి కూడా ఈయనే. ఈ ఏడాది గత ఐదు నెలల్లోనే  సీఎస్​పై 38 ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఆయనపై నమోదైన కేసుల్లో హైకోర్టులో వాదించడానికి, పెనాల్టీలు కట్టేందుకు సీసీఎల్ఏకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇటీవల రూ.58.95 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది.