మహారాష్ట్రతో పేచీ రాకుండా .. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ!

మహారాష్ట్రతో పేచీ రాకుండా .. తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీ!
  • మహారాష్ట్రతో పేచీ రాకుండా 
  • ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన
  • తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు
  • ఎక్కడ కట్టాలనే దానిపై స్టడీ చేయించాలని సర్కారు యోచన
  • గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు
  • ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్​ పూర్తి
  • అక్కడి నుంచి చిన్న లిఫ్ట్​ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్​
  • గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లంపల్లికి తీసుకొచ్చే మరోమార్గంపైనా కసరత్తు
  • దీంతోపాటు తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్​ డ్యామ్ నిర్మించాలని ఆలోచన
  • కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన
  • త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్​లో రానున్న క్లారిటీ

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడ​ ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో తెలంగాణ నీటి అవసరాలు తీర్చేందుకు పాత ప్రాణహిత ప్రాజెక్టుపై సర్కారు కసరత్తు చేస్తున్నది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే  మహారాష్ట్ర  అభ్యంతరం తెలిపే అవకాశమున్నందున ప్రత్యామ్నాయంగా తుమ్మిడిహెట్టి దిగువన తక్కువ ఖర్చుతో, ఎక్కువ నీటిని మళ్లించేలా కొత్త బ్యారేజీని నిర్మించాలని యోచిస్తున్నది.  ఇప్పటికే పలు ప్రతిపాదనలు తెరపైకి రాగా.. అన్ని అంశాలపైనా ఫీజిబిలిటీ స్టడీస్​ చేయించేందుకు సిద్ధమవుతున్నది. 

2008లో ఉమ్మడి ఏపీలో అప్పటి వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ప్రభుత్వం తుమ్మిడిహెట్టి వద్ద 165 టీఎంసీల నీటిని తీసుకునేలా డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఎల్లంపల్లి వైపు గ్రావిటీ కెనాల్​ పనులు 71.5 కిలోమీటర్ల వరకూ పూర్తయ్యాయి.

కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్​ సర్కారు.. ప్రాజెక్టు రీఇంజినీరింగ్​పేరుతో తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. కానీ దాని  వల్ల ఆశించిన ప్రయోజనం లేకపోగా.. అందులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఏడో బ్లాక్​ను మళ్లీ కొత్తగా కట్టి.. బ్యారేజీకి మళ్లీ టెస్టులు చేసి డిజైన్లను రివ్యూ చేయాలని ఇటీవల నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ అథారిటీ (ఎన్​డీఎస్​ఏ) తుది నివేదికలో సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చేందుకు తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని ఇటీవల సీఎం సహా ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రకటించారు. 

తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే మహారాష్ట్ర పేచీ పెట్టే అవకాశం ఉండడంతో  దిగువన ఎక్కడ బ్యారేజీ నిర్మిస్తే బాగుంటుందో సర్కారు సమాలోచనలు చేస్తున్నది. ప్రభుత్వం ముందు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు ఉండగా,  త్వరలో సీఎంతో జరగనున్న సమీక్షలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.

బోరేపల్లి వద్ద ప్రతిపాదనలు..

తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మించేందుకు మహారాష్ట్ర అభ్యంతరాలతోపాటు కొన్ని టెక్నికల్​ అంశాలు అడ్డంకిగా మారుతున్నాయి. 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ససేమిరా అంటున్నది. ఆ ఎత్తులో నిర్మిస్తే తమ భూభాగంలో ముంపు పెరుగుతుందని వాదిస్తున్నది.  148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించుకోవాలని గతంలో చెప్పింది.  దాంతోపాటు రివర్​ క్రాస్​ సెక్షన్​ వల్ల బ్యారేజీ డిజైన్​లోనూ కొన్ని తేడాలు వచ్చే అవకాశం ఉండడంతో.. తుమ్మిడిహెట్టికి 9 కిలోమీటర్ల దిగువన బోరేపల్లి వద్ద బ్యారేజీని మనకు కావాల్సిన ఎత్తులో నిర్మించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఇరిగేషన్​ శాఖ మాజీ అధికారి విఠల్​ రావు గతంలో ఓ ప్రతిపాదన పెట్టారు. దాంతోపాటు తుమ్మిడిహెట్టికి దిగువన  పలుచోట్ల ఎక్కడైతే బ్యారేజీ బాగుంటుందన్న దానిపై అధికారులు సిఫార్సులు సిద్ధం చేసినట్లు తెలిసింది. 

ఇప్పటికే మైలారం వరకు 71.5 కిలోమీటర్ల మేర కెనాల్స్​ సిద్ధంగా ఉండడంతో.. అక్కడ ఓ లిఫ్ట్​ను నిర్మించి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోయాలనే ఒక సిఫార్సుపై వర్కవుట్​ చేస్తున్నారు. కాగా, లిఫ్ట్​ లేకుండా నేరుగా గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లేలా చూసే ప్రతిపాదనలపై పనిచేయాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే లిఫ్ట్​తోనైతే ఎక్కడ బ్యారేజీని నిర్మించాలి.. లిఫ్ట్​ లేకుంటే ఎక్కడ కట్టాలి అన్న దానిపైనా సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

లిఫ్ట్​ కడితే అదొక భారంగా మారుతుందని, అదనపు ఆర్థిక భారం లేకుండా గ్రావిటీతోనే నీళ్లను తీసుకెళ్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా చెప్తున్నారు. కాగా, ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని 2 లక్షల ఎకరాలకు సైతం నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. చెన్నూరు నియోజకవర్గంలో 31,500 ఎకరాలు, బెల్లంపల్లిలో 73 వేల ఎకరాలు, సిర్పూర్​లో 73 వేల ఎకరాలు, ఆసిఫాబాద్​ నియోజకవర్గంలో 38,830 ఎకరాలకు నీళ్లివ్వడానికి వీలవుతుంది. 

తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్​ డ్యామ్ 

తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీతోపాటు మరో సిఫార్సునూ అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. తుమ్మిడిహెట్టి దగ్గర ఓ రబ్బర్​ డ్యామ్​ నిర్మించి.. మొదట సుందిళ్లకు, అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్తే ఎలా ఉంటుందన్న దానిపైనా సమాలోచనలు జరుపుతున్నారు. వాస్తవానికి మల్లారం వరకు కాల్వ రెడీగా ఉన్నా.. అక్కడి నుంచి ఎల్లంపల్లికి నీటిని తీసుకెళ్లాలంటే లిఫ్ట్​ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

ఇలా లిఫ్టింగ్​కు అవకాశం లేకుండా గ్రావిటీ ద్వారా నీళ్లను సుందిళ్లకు తరలించి.. అక్కడి నుంచి జైపూరు వాగుకు పంపి ఎల్లంపల్లికి నేరుగా నీటిని తీసుకెళ్లే  అవకాశం ఉందంటున్నారు. దీని ద్వారా దూరం కూడా తగ్గుతుందని  చెబుతున్నారు. అయితే, తుమ్మిడిహెట్టి వద్ద ఎడమవైపు టైగర్​ రిజర్వ్​ ఉన్నది.  దీంతో టైగర్​ రిజర్వ్​కు నష్టం చేయకుండా అక్కడ రబ్బర్​ డ్యామ్​ను ఎలా నిర్మించాలన్నదానిపైనా అధికారులు ఫీజిబిలిటీ స్టడీ చేస్తున్నట్టు తెలిసింది.

మళ్లీ స్టడీ చేయాల్సిందే..

అప్పుడెప్పుడో 2007లో తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టుకు స్టడీలు చేశారు. డీపీఆర్​లు తయారు చేశారు. ఈ 18 ఏండ్లలో అక్కడ ప్రాణహిత నది పరిస్థితులు మారి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. నది ప్రవాహ క్రమం, నీటి లభ్యత, నేల పరిస్థితుల వంటి వాటిలో మార్పులు వచ్చి ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి దిగువన బ్యారేజీగానీ.. తుమ్మిడిహెట్టి వద్ద రబ్బర్​ డ్యామ్​గానీ.. ఏది నిర్మించినా మళ్లీ స్టడీలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. నీటి లభ్యత, నదీ ప్రవాహతీరును తెలుసుకునేందుకు హైడ్రాలజీ స్టడీస్​, నేల పరిస్థితులను తెలుసుకునేందుకు జియోలాజికల్​ ఇన్వెస్టిగేషన్లను చేయాల్సి ఉంటుందని అంటున్నారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం తదితర అంశాలనూ సమీక్షించాల్సి ఉంటుందని, అవన్నీ అయ్యాక మళ్లీ కొత్తగా డీపీఆర్​ను సిద్ధం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

మేడిగడ్డ భవితవ్యం ఏంటి?

మేడిగడ్డ బ్యారేజీపై ఇప్పటికే ఎన్డీఎస్​ఏ తుది నివేదిక ఇచ్చింది. ఏడో బ్లాక్​ను పూర్తిగా తొలగించి కొత్తగా నిర్మించాలని సిఫార్సు చేసింది. వానాకాలం దగ్గరపడుతున్న క్రమంలో మేడిగడ్డ బ్యారేజీపై ఏం చేయాలన్నదానిపైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. రీస్టోర్​ చేసినా ఆ బ్యారేజీని ఎలా వినియోగించుకోవాలన్నదానిపై కసరత్తు చేస్తున్నది. ఒకవేళ బ్యారేజీకి రిపేర్లు చేసినా.. పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపుకోవడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి. బ్యారేజీ కెపాసిటీ 16 టీఎంసీలు కాగా, ఆ స్థాయిలో నీటిని నిల్వ చేయడం వల్లే  బ్యారేజీకి ముప్పు వాటిల్లిందని ఎన్డీఎస్​ఏ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే బ్యారేజీకి మరమ్మతులు చేశాక 5 టీఎంసీల వరకు మాత్రమే నీటిని నిల్వచేసే అవకాశముందని, అంతకుమించి  నిల్వ చేస్తే మళ్లీ ప్రమాదం జరిగే అవకాశముందని  ఇరిగేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు.