
- ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాల మైనింగ్‌పై దృష్టి
- ఇసుక అక్రమ రవాణా, ఓవర్ లోడ్, దళారుల దోపిడీకి చెక్
- ఇసుక రీచ్‌లు, యార్డుల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్
- ప్రస్తుతమున్న పాలసీలో మార్పులు చేసే యోచన
హైదరాబాద్, వెలుగు: మైనింగ్ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. ముఖ్యంగా ఇసుక, చిన్న తరహా ఖనిజాల మైనింగ్‌పై దృష్టిసారించింది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని, నేరుగా వినియోగదారులకే అందించాలని యోచిస్తున్నది. ఇందుకోసం ఇప్పుడున్న పాలసీలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తున్నది. దీనికి తోడు అన్ని ఇసుక రీచ్‌లు, యార్డుల వద్ద సీసీ కెమెరాలు, లారీలకు జీపీఎస్, వేబ్రిడ్జిలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించనున్నది. విజిలెన్స్ దాడులు నిర్వహించి ఓవర్ లోడ్, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నది.
అధిక ధరలకు ఇసుక విక్రయం..
సాధారణంగా ఇసుక టన్నుకు రూ.405 ఉంటుంది. అయితే ట్రాన్స్పోర్ట్చార్జీలు కలిపితే టన్నుకు రూ.1,600 లోపు వినియోగదారుడికి అందాల్సి ఉంది. కానీ కొందరు అక్రమార్కులు టన్ను ఇసుక రూ.2 వేలు, ఆపైన అమ్ముకుంటున్నారు. దీంతో దళారులపై ఆధారపడకుండా, నేరుగా వినియోగదారులే ఇసుక బుక్‌చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్ తీసుకురావాలని భావిస్తున్నారు. ఓఆర్ఆర్, జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఇసుక యార్డులు ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి టీఎస్ఎండీసీ ద్వారా కస్టమర్లకు ఇసుకను అందించనున్నారు.
ఈ పద్ధతి ద్వారా మధ్యవర్తులు, దళారుల ప్రమేయం తగ్గి ఇసుక తక్కువ ధరకే లభ్యమవుతుందనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ప్రతి లారీకి జియోట్యాగింగ్ ఏర్పాటు చేసి.. ఇసుక లోడింగ్ నుంచి అన్‌లోడింగ్ వరకు ఆ లారీ ఏయే ప్రాంతాల్లో ప్రయాణించిందనేది ట్రాక్చేయనున్నారు. ఇందుకోసం ఇసుక రీచ్‌లు, టోల్ గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. వాటిని హైదరాబాద్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నట్టు తెలుస్తున్నది. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 7 లక్షల క్యూబిక్మీటర్లపైన ఇసుక అందుబాటులో ఉందని, ఎవరూ అధిక ధరలు చెల్లించవద్దని అధికారులు సూచిస్తున్నారు.
క్రమంగా తగ్గుతున్న ఆదాయం..
కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇసుకపై దాదాపు రూ.1,400 కోట్ల ఆదాయం వచ్చింది. నిజానికి 2018–19 నుంచి ఇసుక ఆదాయం క్రమంగా తగ్గుతూ వచ్చింది. దోపిడీ పెరగడంతో ప్రభుత్వ ఆదాయం తగ్గి, అక్రమార్కులు దండుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. నాడు రూ.900 కోట్లు ఉన్న ఆదాయం.. 2021 నాటికి రూ.800 కోట్లకు, 2022లో రూ.750 కోట్లు, 2023 నాటికి రూ.670 కోట్లకు తగ్గింది. అయితే ఏటా 10 శాతం వృద్ధి రేటుతో రాబడి రూ.1200 కోట్లకు పెరగాల్సి ఉండగా పడిపోయింది. దీంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి ఆదాయం పెంచుకునేందుకు సర్కార్ చర్యలు తీసుకుంటున్నది.
చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం..
తెలంగాణ ఏర్పడిన పదేండ్ల తర్వాత ప్రభుత్వం చిన్నతరహా ఖనిజ బ్లాకుల -వేలం చేపట్టింది. మొదటి దశలో 19 బ్లాకులను వేలం వేయగా, రూ. 56.74 కోట్ల ఆదాయం వచ్చింది. ఇకపై ప్రతి నెల విడతల వారీగా ఖనిజ బ్లాకుల వేలం నిర్వహించాలని గనుల శాఖ యోచిస్తున్నది. దీనివల్ల ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుందని భావిస్తున్నది. ప్రధాన ఖనిజాలకు ఉన్న వేలం విధానాన్ని చిన్నతరహా ఖనిజాలకూ విస్తరింపజేశారు. దీంతో ఇష్టారాజ్యం పోయి.. అందరికీ అవకాశాలు రావడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది.
లక్ష్యం రూ.6,500 కోట్లు
మైన్స్ అండ్ జియాలజీ శాఖ 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,588 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. బొగ్గు నుంచి రూ.2,944 కోట్లు, ప్రధాన ఖనిజాల నుంచి రూ.3,168 కోట్లు, చిన్నపాటి ఖనిజాల నుంచి రూ.2,100 కోట్లు, ఇసుక నుంచి రూ.1,320 కోట్లు రాబట్టుకోవాలని టార్గెట్ పెట్టుకుంది.
అయితే ఇందులో బొగ్గు నుంచి రూ.3 వేల కోట్ల పైనే వచ్చినప్పటికీ.. ప్రధాన ఖనిజాల నుంచి రూ.230 కోట్లు , చిన్నపాటి ఖనిజాల నుంచి దాదాపు రూ.1,600 కోట్లు, ఇసుక నుంచి రూ.720 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. ఇక 2025–26లో రూ.6,500 కోట్లు, 2026–27లో రూ.7,500 కోట్లు, 2027–28లో రూ.9 వేల కోట్ల ఆదాయం రాబట్టుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.