
హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో రియల్ఎస్టేట్ దందాలోకి దిగాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేటు వెంచర్లకు చెక్‌పెట్టాలని.. కేవలం సర్కారే వెంచర్లను అభివృద్ధి చేసి ఇచ్చేలా నిబంధనలు తేవాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీనిద్వారా అక్రమాలు, లొసుగులు లేకుండా జనానికి ప్లాట్లు అందుబాటులోకి రావడంతోపాటు ఖజానాకు భారీగా ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. పదెకరాలకు మించిన ఏ వెంచర్ అయినా సర్కారే అభివృద్ధి చేసి ఇస్తుందని, ఇందుకోసం డెవలప్మెంట్ ఫీజును, యూజర్ చార్జీలను వసూలు చేస్తుందని అంటున్నాయి. ముందుగా అర్బన్, ఏరియా డెవలప్మెంట్ అథారిటీల్లో దీనిని అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారని, త్వరలోనే మున్సిపల్ అధికారుల బృందం పర్యటనలు చేయనుందని తెలిసింది.
జనానికి ఇబ్బందుల్లేకుండా..
రియల్ఎస్టేట్ సంస్థలు, వ్యాపారులు తమ వెంచర్లకు సంబంధించి భారీగా ప్రకటనలు గుప్పిస్తుంటారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ కనెక్షన్, పెద్ద పార్కులు ఇలా ఎన్నో చెప్తుంటారు. కొందరైతే వివాదాస్పద భూములు, అసైన్డ్ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న ఘటనలూ ఉన్నాయి. ఆ ప్లాట్లను కొన్నవారు తర్వాత తలపట్టుకుంటున్నారు. ముందుగా చెప్పిన వసతులు ఉండవు. చిన్నరోడ్లు, సగంలోనే ఆగిన డ్రైనేజీ, ఇతర సదుపాయాల నిర్మాణాలు, పార్కు స్థలంగా చెప్పిన భూమిలోనూ ప్లాట్లు వేసి అమ్మడం వంటివెన్నో కనిపిస్తాయి. అలాంటి సమయంలో వెంచర్ వేసినవారిపై చీటింగ్ కేసు పెట్టడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ప్రభుత్వమే వెంచర్లను అభివృద్ధి చేయాలని, అటు భారీగా ఆదాయమూ వస్తుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
జనంలో నమ్మకం కూడా..
ప్రభుత్వమే వెంచర్లు డెవలప్ చేయడం వల్ల జనంలో భయం, అనుమానాలు లేకుండా ప్లాట్లు కొనేందుకు వీలుంటుందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కొందరు రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేయడం, మౌలిక వసతులు సరిగా లేకపోవడం, అనుమతి లేని లే ఔట్లు ఏర్పాటు చేయడం వంటివాటితో కొనుగోలు దారులు ఇబ్బందిపడుతున్నారు. అధిక లాభాల కోసం కొందరు వ్యాపారులు తక్కువ ధరలకు అసైన్డ్ భూములు కొని ప్లాట్లుగా వేసి అమ్ముతున్నారు. అవి కొన్నవారు తర్వాత అవి అసైన్డ్ భూములని, లొసుగులు ఉన్నాయని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. చాలా మంది రియల్టర్లు డబ్బుకు కక్కుర్తి పడి రోడ్లు, పార్కులు, ఓపెన్ ప్లేస్ ను కూడా ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని.. అందువల్ల సర్కారు స్వయంగా అభివృద్ధి చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నారని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అసలు వెంచర్ వేసే భూమికి సంబంధించి ఏవైనా లొసుగులు, లోపాలు ఉన్నాయా అన్నది సర్కారు పరిశీలిస్తుందని, దానివల్ల వివాదాలు తలెత్తే అవకాశం ఉందని చెప్పారు. ‘‘నిబంధనలకు విరుద్ధంగా ఉండే భూమిని డెవలప్ చేయం. దాన్ని బ్లాక్ లిస్టులో పెడతం. రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రేషన్ల శాఖకు వివరాలు ఇస్తం..’’ అని వివరించారు. మొత్తంగా ప్రజలకు తాము కొనే ప్లాట్‌పై నమ్మకం ఉంటుందని, వారి పెట్టుబడికి ఎలాంటి భయం ఉండదని పేర్కొన్నారు.
బోలెడు డబ్బులొస్తయ్..
రియల్ ఎస్టేట్ వ్యాపారం, వెంచర్ల అభివృద్ధి చేపడితే భారీగా ఆదాయం వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఒక ఎకరం భూమిని అభివృద్ధి చేయాలంటే రూ.20 లక్షల వరకు ఖర్చవుతోంది. ఈ మేరకు ప్రైవేటు వ్యక్తుల డెవలప్మెంట్ఫీజుతోపాటు కొంత యూజర్ చార్జీలు వసూలు చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయడం వల్ల ఏటా రూ.10 వేల కోట్లు అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముందుగా డెవలప్మెంట్ అథారిటీల్లో..
హెచ్ఎండీఏతోపాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు.. గజ్వేల్, యాదగిరిగుట్ట, వేములవాడ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా అథారిటీల పరిధిలో ప్రభుత్వమే వెంచర్లను అభివృద్ధి చేసేలా నిబంధనలు పెట్టే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘భూమిని అభివృద్ధి చేయడానికి అథారిటీల వద్ద కావాల్సినంత యంత్రాంగం లేదు. థర్డ్ పార్టీకి ఇచ్చి అన్ని వసతులతో వెంచర్లు అభివృద్ధి చేయిస్తం. దీన్నివల్ల పారదర్శకత ఉంటుంది..’’ అని వివరించారు. ముందుగా ఈ ప్రాంతాల్లో అమలయ్యేలా నిబంధనలు రూపొందించి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
రెరాకు స్పందన లేక..
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అక్రమాలను అరికట్టడానికి కేంద్రం రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ)ను తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా రాష్ట్ర సర్కారు కూడా తెలంగాణ పరిధిలో రెరాను ఏర్పాటు చేసింది. కానీ చాలా మంది వ్యాపారులు రేరాలో రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. తప్పకుండా నమోదు చేయించుకోవాలనే నిబంధన లేదు. తమ వద్ద నమోదైన వెంచర్లలో లోపాలుంటేనే అధికారులు విచారించి వినియోగదారులకు న్యాయం చేస్తున్నారు. మిగతా వాటి విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అలాంటి చోట మోసాలు జరుగుతున్నాయి. దీంతో సర్కారే స్వయంగా వెంచర్లను అభివృద్ధి చేస్తే బెటరని అధికారవర్గాలు చెప్తున్నాయి.
ల్యాండ్ పూలింగ్ ఫెయిలవడంతో..
హెచ్ఎండీఏ ఇటీవల చేపట్టిన ల్యాండ్ పూలింగ్ ఫెయిలైంది. నేరుగా రైతులు, ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి తీసుకుని అభివృద్ధి చేయాలని.. కొంత భూమిని వారికిచ్చి, మిగతా ప్లాట్స్ ను మార్కెట్లో అమ్మాలని భావించింది. ఇందుకోసం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మూడు ప్రాంతాలను గుర్తించింది. స్థానికులతో అవగాహన సదస్సులు నిర్వహించింది. కానీ భూములిచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. రియల్టర్లు, ఇతర ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే హెచ్ఎండీఏకు ఇవ్వలేదని, దాంతో పథకం విఫలమైందని అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రైతుల నుంచి భూమి సేకరించడం కంటే రియల్టర్ల నుంచి భూమి తీసుకుని, అభివృద్ధి పర్చడం తేలికని ఉన్నతాధికారులు అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది.