షాబాద్‌లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం

షాబాద్‌లో భూముల వేలం ద్వారా రూ.33 కోట్లకు పైగా ఆదాయం

రంగారెడ్డి జిల్లా షాబాద్లోని భూముల అమ్మకం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి రూ.33 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. షాబాద్లో 100 ఎకరాల్లో హెచ్ఎండీఏ లే అవుట్ వేసింది. మంగళవారం (ఆగస్టు 8వ తేదీన) 50 ప్లాట్లకు వేలం వేసింది. 300 చదరపు గజాల చొప్పున ఉన్న 15వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లకు రూ.15కోట్ల ఆదాయం వస్తుందని భావించారు.

చదరపు గజానికి అప్‌సెట్‌ ధరను రూ.10వేలుగా నిర్ణయించారు. ఈ-వేలంలో చదరపు గజం గరిష్ఠంగా రూ.27వేలు, కనిష్ఠంగా రూ.18వేలు పలికింది. 50 ప్లాట్ల విక్రయంతో రూ.33.06 కోట్ల ఆదాయం కేసీఆర్ ప్రభుత్వానికి సమకూరింది.

బుద్వేలులో భూముల వేలం ఆపాలని హైకోర్టు న్యాయవాదుల సంఘం పిల్‌

బుద్వేలులో హెచ్‌ఎండీఏ నిర్వహిస్తున్న భూముల వేలం  ఆపాలని హైకోర్టులో న్యాయవాదుల సంఘం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. హైకోర్టు నిర్మాణం కోసం బుద్వేలు భూములు కేటాయించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బుద్వేలులో 100 ఎకరాలు కేటాయించాలని 2012 నుంచి కోరుతున్నామని, అప్పటి ప్రభుత్వం హైకోర్టుకు భూమి ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించిందని న్యాయవాదుల సంఘం తెలిపింది.