యాసంగిలో కొనుగోలు సెంటర్లుండవ్

యాసంగిలో కొనుగోలు సెంటర్లుండవ్
  • కాదని రైతులు వరి సాగు చేస్తే మా జిమ్మేదారి కాదు
  • 28 నుంచి రైతుబంధు పైసలు అకౌంట్లలోకి.. 
  • కొత్త జోనల్ సిస్టం ప్రకారమే ఉద్యోగుల విభజన..
  • కలెక్టర్లతో మీటింగ్‌‌లో సీఎం

హైదరాబాద్, వెలుగు: యాసంగిలో రైతుల నుంచి ఒక్క కిలో వడ్లు కూడా కొనేది లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. కొనుగోలు సెంటర్లు కూడా ఉండవని, కాదని రైతులు వడ్లు సాగు చేస్తే ప్రభుత్వం జిమ్మేదారి కాదని మరోసారి స్పష్టంచేశారు. శనివారం జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సీఎం ప్రగతి భవన్‌‌లో పలు అంశాలపై రివ్యూ చేశారు.  రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్లాన్లు సిద్ధం చేసుకోవాలని అధికారులకు కేసీఆర్​ సూచించారు. ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులను ఇతర లాభసాటి పంటల సాగు దిశగా సమాయత్తం చేయాలన్నారు. యాసంగి పంట పెట్టుబడి కింద రైతుబంధు సాయాన్ని ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో వేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం పది రోజుల్లో అందరి ఖాతాల్లో పైసలు జమ అవుతాయని తెలిపారు.

నాలుగైదు రోజుల్లో పూర్తిచేయాలె

కొత్త జోనల్ సిస్టం ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ‘‘వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పని చేయగలిగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యం. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వాలి. భార్యాభర్తలు (స్పౌస్ ఉద్యోగులు) ఒకే చోట ఉంటేనే ప్రశాంతంగా పని చేయగలుగుతారు. తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది’’ అని కేసీఆర్​ తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సూచించారు.

దళితుల బాధను అర్థం చేసుకుని పని చేయండి

‘‘మీకు ఆకాశమే హద్దు. మీరు ఇప్పటి వరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి దళిత బంధు పథకం అమలు కార్యక్రమంలో పాల్గొనడంలో దొరుకుతుంది’’ అని కలెక్టర్లకు కేసీఆర్ సూచించారు. తాము ఎప్పుడూ మోసపోతూనే ఉంటామనే దుఃఖం దళిత వాడల్లో ఉందని, వారి ఆర్తిని అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. దళిత కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను, వ్యాపార, ఉపాధి మార్గాలను వెతకాలని, దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, దళిత అభివృద్ధికి పాటుపడేవారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గంతోపాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును గతంలో ప్రకటించినట్లుగానే అమలు చేస్తామన్నారు.

ఒమిక్రాన్‌పై ఆరా

కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్’ నిరోధానికి చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై హెల్త్ ఆఫీసర్లతో కేసీఆర్ చర్చించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వాక్సినేషన్ పురోగతిపై సీఎంకు ఆఫీసర్లు వివరించారు. ఒమిక్రాన్ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆఫీసర్లు చెప్పారు.