సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్ .. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు

సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై ఫోకస్ .. గవర్నమెంట్ స్కూళ్ల బలోపేతంపై ప్రభుత్వం కసరత్తు
  • కొత్తగా ప్రైమరీ స్కూల్ స్టూడెంట్లకూ నోట్ బుక్స్ 
  • వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసుల ప్రారంభానికి చర్యలు 
  • లక్ష మందికిపైగా టీచర్లకు 5 రోజుల ట్రైనింగ్ 
  • వచ్చేనెలలో పకడ్బందీగా బడిబాట నిర్వహణకు ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు:  సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గత కొన్నేండ్లుగా ఎన్ రోల్మెంట్ తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో దీనికి వచ్చే అకడమిక్ ఇయర్​లో చెక్ పెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కీలక నిర్ణయాలు తీసుకున్నది. ప్రైమరీ స్కూళ్లలో అడ్మిషన్ల పెంపు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. 2024–25 విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సర్కారు, గురుకులాలు, ప్రైవేట్ అన్నీ కలిపి 41,628 స్కూళ్లుండగా, వాటిలో 59,65,797 మంది విద్యార్థులు చదువుకున్నారు. వీటిలో 26,101 సర్కారు, లోకల్ బాడీ స్కూళ్లలో 16,81,469 మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లు11,365 ఉండగా.. 34,80,546 అడ్మిషన్లు జరిగాయి.

 అయితే, గతంలో విద్యార్థులతో కళకళలాడిన వేలాది స్కూళ్లు.. ప్రస్తుతం అడ్మిషన్లు లేక వెలవెలబోతున్నాయి. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వం.. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపుపై పెద్దగా దృష్టిసారించలేదు. కేవలం గురుకులాలపై ఫోకస్ పెట్టింది. అయితే, కొత్త ప్రభుత్వం మాత్రం గురుకులాలతో పాటు గవర్నమెంట్ స్కూళ్లపైనా దృష్టిసారించింది. దీంట్లో భాగంగా అడ్మిషన్లను ఎలా పెంచాలనే దానిపై పలు సమావేశాలు నిర్వహించి కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా బడుల్లో చిన్నచిన్న రిపేపర్లనూ అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా పూర్తి చేయిస్తోంది. వచ్చే నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తోంది. 

సర్కారులోనూ ప్రీప్రైమరీ క్లాసులు.. 

పేరెంట్స్ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రీప్రైమరీ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం డిసైడ్ అయింది. ప్రైవేటు బడుల్లో మూడేండ్ల చిన్నారులకు నర్సరీ, ఎల్​కేజీ పేర్లతో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇదే విధానాన్ని అంగన్ వాడీల ద్వారా అమలు చేసేందుకు ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. తొలివిడతలో 2025–26 విద్యాసంవత్సరంలో వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ క్లాసులు స్టార్ట్ చేయనున్నారు. ప్రైమరీ స్కూల్ ఆవరణలో కొనసాగుతున్న అంగన్ వాడీల్లో వీటిని మొదలుపెట్టనున్నారు. ఒక్కో జిల్లాలో 20 నుంచి 50 వరకూ ఎంపిక చేశారు. ప్రతి ప్రైమరీ స్కూల్ నుంచే ప్రత్యేకంగా ఇన్ స్ట్రక్టర్, ఆయాను నియమించి, వారికి ఆటల ద్వారా చదువులకు శ్రీకారం చుట్టనున్నారు. 

ప్రైమరీ స్టూడెంట్లకు నోట్ బుక్స్.. 

ఇప్పటివరకూ సర్కారు బడుల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే స్టూడెంట్లకు మాత్రమే ప్రభుత్వం నోట్ బుక్స్ అందించేది. కానీ, ఈ కొత్త అకడమిక్ ఇయర్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ చదివే విద్యార్థులకూ వర్క్ బుక్స్ తో పాటు నోట్ బుక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఒకటి, రెండో తరగతుల పిల్లలకు మూడు.. మూడు, నాలుగు, ఐదు తరగతుల పిల్లలకు నాలుగు నోట్ బుక్స్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇప్పటికే డీఈఓల నుంచి ఇండెంట్లు సేకరించి జిల్లాలకు నోట్ బుక్స్ పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గనున్నది.  

టీచర్లకు ట్రైనింగ్.. 

టీచింగ్ స్కిల్స్ పెంచేందుకు సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు ప్రారంభించింది. ఎస్​జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, లాగ్వేజీ పండిట్లు.. ఇలా అన్ని కేటగిరీల వారికి సబ్జెక్టుల వారిగా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కో టీచర్​కు వివిధ అంశాలపై ఐదు రోజుల పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇది సర్కారు స్టూడెంట్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నారు. 

బడిబాటతో ప్రజల్లోకి.. 

వచ్చేనెల12 నుంచి స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. ఈ నేపథ్యలో సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం జూన్ 6 నుంచి 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏడాది నిర్వహించే బడిబాటలో మహిళా సంఘాల ప్రతినిధులను, ఓల్డ్ స్టూడెంట్లనూ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, నోట్ బుక్స్, మిడ్ డే మీల్స్, యూనిఫామ్స్, వర్క్ బుక్స్ తదితర వివరాలను బడిబాటలో పేరెంట్స్ కు వివరించనున్నారు.  

11వేల మంది కొత్త టీచర్లు..

గత విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యాక కొత్తగా 11 వేల మంది టీచర్లు సర్కారు బడుల్లోకి వచ్చారు. అప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం కొత్తగా స్కూళ్లకు 6,508 మంది ఎస్​జీటీలు, 2,629 మంది స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజీ పండిట్లు 727 మంది, పీఈటీలు 182 మందితో పాటు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు 1,016 మంది వచ్చారు. 2025–26 విద్యాసంవత్సరంలో వీరంతా అడ్మిషన్ల ప్రక్రియలో పాల్గొననున్నారు. అన్ని బడుల్లో టీచర్ల సంఖ్య పెరగడం కూడా పేరెంట్స్ లో మంచి అభిప్రాయం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.