అయ్యో రామప్ప!:ఏడేండ్ల నుంచి పట్టించుకోని సర్కారు

అయ్యో రామప్ప!:ఏడేండ్ల నుంచి పట్టించుకోని సర్కారు
  • బురదలో శిల్పాలు.. గోడలకు పాకురు


ప్రపంచం మెచ్చిన, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప గుడిని నిర్లక్ష్యం వెంటాడుతోంది. తెలంగాణ వచ్చి ఏడేండ్లవుతున్నా మన కాకతీయ కళా సంపదను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రధాన ఆలయం గోడలు పాకురు పడుతున్నాయి. నల్లరాతి శిల్పాలు బురదలో మగ్గుతున్నాయి. అనుబంధ ఆలయాలు కూలే స్థితిలో ఉన్నాయి. ప్రహరీ గోడలు పాడుబడి పడిపోతున్నాయి. అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి.  
జయశంకర్‌‌ భూపాలపల్లి, వెంకటాపూర్‌‌ (రామప్ప), వెలుగు: ప్రపంచం మెచ్చిన, యునెస్కో గుర్తింపుపొందిన మన రామప్ప గుడిని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ప్రధాన ఆలయం గోడలు పాకురుపట్టిపోయాయి. నల్లరాతి శిల్పాలు బురదలో మగ్గుతున్నాయి. అనుబంధ ఆలయాలు కూలే స్థితిలో ఉన్నాయి. తెలంగాణ వచ్చి ఏడేండ్లయినా ఈ కాకతీయ కళా వైభవాన్ని రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో 808 ఏండ్ల కింద నిర్మించిన రామప్ప ఆలయం చుట్టూ ఎటు చూసినా పిచ్చిమొక్కలు, బురద, పుట్టలు కనిపిస్తున్నాయి. రామప్ప టెంపుల్​ ప్రాంగణంలో ప్రధాన కాకతీయ రుద్రేశ్వర ఆలయంతో పాటు కామేశ్వర, కాటేశ్వర, త్రికూట, త్రిపురాలయం వంటి 20 అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రధాన ఆలయం సంరక్షణ లేక పాకురుపట్టి నల్ల రంగులోకి మారిపోయింది. చివరగా తొమ్మిదేండ్ల కింద అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో 2012లో రామప్ప టెంపుల్‌‌ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఆ తర్వాత పట్టించుకునే దిక్కు లేకపోవడంతో  గోపురం నల్లని రంగులోకి మారింది. ఇప్పటికే ఆలయ ప్రహరీగోడ ఓ వైపు కూలిపోయింది. కాగా, యునెస్కో నిబంధనల ప్రకారం టెంపుల్‌‌ చుట్టూ 200 మీటర్ల దూరంలో పారిశుధ్య లోపం కనిపించకూడదు. సందర్శకులు, పర్యాటకులకు ఇబ్బంది లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. కానీ ప్రస్తుతం  టెంపుల్‌‌ తూర్పు ముఖద్వారం వైపు ఎటుచూసినా బురద, నీళ్లే కనిపిస్తున్నాయి. దుర్వాసన వస్తోంది. 
పిచ్చి మొక్కల మధ్య శిల్పాలు, రాతి స్తంభాలు
రామప్ప గుడి  తూర్పు ముఖద్వారం 2012లో కూలిపోయింది. దాని నిర్మాణంతో పాటు శిథిలావస్థకు చేరిన కామేశ్వర ఆలయాన్ని పునరుద్ధరిస్తామంటూ 2013లో అప్పటి ఆఫీసర్లు టెంపుల్‌‌ను విప్పి కుప్పపెట్టారు. అరుదైన నల్లరాతి శిల్పాలను, స్తంభాలను మెయిన్ ​టెంపుల్​కు తూర్పు వైపు ఖాళీ స్థలంలో ఉంచారు. తర్వాత రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లవుతున్నా  శిల్పాలను, రాతి స్తంభాలను పట్టించుకోకపోవడంతో పిచ్చి మొక్కలు మొలిచి మట్టిలో కలిసిపోతున్నాయి.  2017 ఆగస్టులో భారీ వర్షాలకు మెయిన్​ టెంపుల్​ ప్రహరీ పడిపోయింది. అప్పట్లో పత్రికల్లో ని కథనాల ఆధారంగా హైకోర్టు సుమటోగా కేసు నమోదు చేసి ప్రహరీ నిర్మాణం చేయాలని, రామప్ప ఆలయం, అనుబంధ ఆలయాలను పునరుద్ధరించాలని సర్కారు‌ను ఆదేశించింది. అప్పుడు ఆఫీసర్లు హడావుడిగా కొన్ని పనులు చేశారు.  ప్రహరీ పనులు 30 శాతం పూర్తికాకముందే కొద్ది దూరం డంగు సున్నం పూసి మట్టి ఇటుకలతో గోడ కట్టి వదిలేశారు. 
డిసెంబర్ వరకు యునెస్కో గడువు
టెంపుల్‌‌ సమగ్ర సంరక్షణకు డిసెంబర్‌‌ వరకు యునెస్కో గడువిచ్చింది. ఆలయ ప్రాంత పరిరక్షణకు ఆ ఏరియా పేరుతో స్పెషల్ డెవలప్​ మెంట్ జోన్  ప్రకటించాలని,  ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను ఖరారు చేయాలని సూచించింది. ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాలు, కట్టడాలతో పాటు రామప్ప సరస్సును హెరిటేజ్​ పరిధిలోకి తెచ్చి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పదేండ్ల కింద విప్పదీసిన కామేశ్వరాలయం పునర్‌ నిర్మాణ పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది. ఈ క్రమంలో ఇప్పటికైనా రాష్ట్ర సర్కారు రంగంలోకి దిగి రామప్ప ఆలయ సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. రామప్ప టెంపుల్‌‌ సంరక్షణ చర్యలను తానే స్వయంగా పర్యవేక్షిస్తామని రాష్ట్ర హై కోర్టు కూడా బుధవారం వ్యాఖ్యానించింది. ఆఫీసర్లతో కమిటీ వేయాలని ఆదేశించింది. అక్టోబర్‌‌లో యునెస్కో బృందం మరోసారి రామప్ప టెంపుల్​ను  పరిశీలించడానికి రానుంది. ఈ 2 నెలల గడువులోగా ఆఫీసర్లు పెండింగ్‌‌ పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంది. 
ఆగిపోయిన అభివృద్ధి పనులు
రామప్ప గుడికి 2019 సెప్టెంబర్‌‌ 25, 26 తేదీల్లో యునెస్కో బృందం వస్తుందని తెలిసి స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ హడావుడి చేసింది. రూ. 80 లక్షలతో పాలంపేట‒ములుగు ప్రధాన రహదారి నుంచి రామప్ప మెయిన్‌‌ టెంపుల్‌‌ వరకు 2 వరసల రోడ్డు, మధ్యలో డివైడర్లు, సెంట్రల్‌‌ లైటింగ్‌‌ పనులు చేపట్టినా మధ్యలోనే ఆగిపోయాయి. రూ. 5 కోట్లతో రామప్ప సరస్సు మధ్యలో ఉన్న 15 ఎకరాల ఐలాండ్‌‌లో ధ్యాన మందిరం, కోటిలింగాల గుడిని నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే రామప్ప సరస్సు ఒడ్డు నుంచి ఐలాండ్‌‌ వరకు రోప్‌‌ వే నిర్మిస్తామని, శిల్పారామం ఏర్పాటు చేసి కాకతీయుల చరిత్ర, కాకతీయ రాజుల శిల్పాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇట్ల చెప్పి రెండేండ్లు గడుస్తున్నా  పైసా కూడా రిలీజ్‌‌ కాలేదు.  40 లక్షలతో ఎకోపార్కు నిర్మిస్తామని ప్రకటించినా మాటలకే పరిమితమైంది.  
చేసింది ఒకరు.. చెప్పుకుంటోంది మరొకరు
రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో కాకతీయ హెరిటేజ్‌‌ సంస్థ ప్రతినిధులు పాపారావు, పాండు రంగారావుతో పాటు సెంట్రల్‌‌ అర్కియాలజీ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన ఆఫీసర్లు ఎంతో కృషి చేశారు. కానీ సీఎం కేసీఆర్‌ వల్లే యునెస్కో గుర్తింపు వచ్చిందంటూ రాష్ట్ర మంత్రులు ప్రచారం చేసుకుంటున్నారు. టెంపుల్​ దుస్థితి ఇలా ఉందని గతంలో పత్రికలు ఫొటోలు తీసి రాసినా ప్రభుత్వంగాని, ఆఫీసర్లుగాని పట్టించుకోలేదు. కానీ ఇటీవల యునెస్కో గుర్తింపు రాగానే మంత్రులు గంగుల కమలాకర్‌‌, సత్యవతి రాథోడ్‌‌ వచ్చి సంబురాలు చేసుకున్నారు.