సంగారెడ్డి జిల్లాలో ఫండ్స్ విడుదలైనా.. పనులు చేస్తలే ! మరమ్మతులకు నోచుకోని చెరువులు

సంగారెడ్డి జిల్లాలో ఫండ్స్ విడుదలైనా..  పనులు చేస్తలే ! మరమ్మతులకు నోచుకోని చెరువులు
  • 114 చెరువుల ఆధునీకరణకు రూ.31.19 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం
  • 10 నెలలుగా టెండర్లు పిలవని ఇరిగేషన్​ అధికారులు
  • నష్టపోతున్న జిల్లా రైతాంగం

సంగారెడ్డి/పుల్కల్, వెలుగు: జిల్లాలోని సంగారెడ్డి, ఆందోల్ నియోజకవర్గాల పరిధిలో 114 చెరువుల ఆధునీకరణకు 10 నెలల కింద  ప్రభుత్వం రూ.31.19 కోట్లు మంజూరు చేసింది. అయినప్పటికీ నీటి పారుదల శాఖ ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. వానకాలానికి ముందే చెరువుల మరమ్మతు చేయాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల చెరువుల కింది ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, సంగారెడ్డి, ఆందోల్ సెగ్మెంట్లకు మాత్రమే స్పెషల్ ఫండ్స్ రిలీజ్ అయినప్పటికీ పనులు జరగకపోవడంతో అక్కడి చెరువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

టెండర్లు పిలవలేదు..

చిన్న నీటి వనరులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం 2024 సెప్టెంబర్ లో రూ.31.19 కోట్ల నిధులను మంజూరు చేసింది. సంగారెడ్డి మండలాల పరిధిలో 29 చెరువులకు రూ.4.08 కోట్లు మంజూరు కాగా ఆందోల్  నియోజకవర్గం పుల్కల్ మండలంలో 23 చెరువులకు రూ.4.96 కోట్లు, చౌటకూరు మండలంలో 25 చెరువులకు రూ.5.21 కోట్లు, ఆందోల్ మండలంలో 37 చెరువుల ఆధునీకరణకు రూ.16.04 కోట్లు శాంక్షన్ అయ్యాయి. చెరువుల బలోపేతం, లీకేజీలు, అలుగు రిపేర్లు, కాల్వల  పూడికతీత పనులు, అవసరమైన చోట్ల గైడ్ వాల్స్ నిర్మాణం వంటి పనులు చేపట్టాల్సి ఉంది. కానీ దాదాపు 10 నెలలు అవుతున్నా  టెండర్ల ప్రక్రియ ఇంకా మొదలు పెట్టకపోవడం వల్ల రైతుల్లో అసహనం వ్యక్తమవుతోంది. పైగా ఈ ఖరీఫ్ సీజన్ కు ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి నెలకొంది.  

రెండుసార్లు నోటిఫికేషన్

చెరువుల ఆధునీకరణ పనులను జిల్లా నీటి పారుదల శాఖ పర్యవేక్షించాల్సి ఉంటుంది. సంగారెడ్డిలోని ఆ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) టెండర్ల ప్రక్రియను చేపట్టాల్సి ఉండగా ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎస్ఈగా పనిచేసిన యేసయ్య గత మేలో రిటైర్ అయ్యారు. అప్పటినుంచి ఈ పోస్ట్ ఖాళీగా ఉండడంతో టెండర్ల ప్రక్రియ జరగడం లేదు. పుల్కల్, చౌటకూర్ మండలాల చెరువులకు ఫిబ్రవరిలో టెండర్ల నోటిఫికేషన్ వచ్చినప్పటికీ తర్వాత అది రద్దయింది. మేలో  రెండోసారి టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయగా అదే నెలలో ఎస్ఈ రిటైర్మెంట్ కావడంతో టెండర్ల ప్రక్రియ మరింత ఆలస్యమైంది. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం వానకాలం పూర్తయ్యే వరకు చెరువుల్లో పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. రానున్న అక్టోబర్, నవంబర్ లో చెరువుల నీటిమట్టాలు తగ్గాక రిపేర్ పనులు చేపట్టాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలోగా సంబంధిత అధికారులు టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పరిస్థితులకు అనుగుణంగా పనులు మొదలుపెట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.