ప్రమోషన్లు లేవ్..ట్రాన్స్ఫర్లు లేవు..

ప్రమోషన్లు లేవ్..ట్రాన్స్ఫర్లు లేవు..
  • అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలైతలే 
  • ఆందోళన బాట పట్టిన టీచర్లు 

హైదరాబాద్, వెలుగు: టీచర్ల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నాలుగేండ్లుగా బదిలీలు చేపట్టకపోవడంతో పాటు ఏడేండ్లుగా ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ట్రాన్స్‌ ఫర్లు, ప్రమోషన్లపై అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా ఇప్పటికీ అమలు కావడం లేదు. 6 నెలల కింద బదిలీలు నిర్వహిస్తామని హడావుడి చేసిన సర్కారు, విద్యాశాఖ అధికారులు.. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయారు. దీంతో సర్కార్ తీరును నిరసిస్తూ ఆందోళన బాట పట్టారు. ఆదివారం పలు జిల్లా కేంద్రాల్లో యూఎస్​పీసీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు మొదలయ్యాయి. రెండేండ్ల సర్వీస్ పూర్తయిన టీచర్లు బదిలీలు, ప్రమోషన్లకు అర్హులు. రూల్స్ ప్రకారం రెండేండ్లకోసారి బదిలీలు చేపట్టాలి. కానీ రాష్ట్రంలో నాలుగేండ్లయినా బదిలీల ఊసే లేదు. ఉమ్మడి ఏపీలో చివరిసారి 2013లో బదిలీలు, ప్రమోషన్లు చేపట్టారు. తెలంగాణ ఏర్పడినంక 2015లో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఆ తర్వాత అనేక ఆందోళనలతో 2018లో బదిలీలు మాత్రమే చేపట్టారు. 2020 నుంచి త్వరలో చేస్తామంటూ చెప్తున్నారే తప్ప చేయడం లేదు. ప్రస్తుతం మేనేజ్మెంట్ల వారీగా బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా.. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని టీచర్ సంఘాల నేతలు మండిపడుతున్నారు. విభజన తర్వాత ఏపీలో నాలుగు సార్లు బదిలీలు, ప్రమోషన్లు చేపట్టారని పేర్కొంటున్నారు. 

సామూహిక నిరాహార దీక్షలు చేస్తం
బదిలీలు, ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేఖ ఇప్పటికే రాసింది. ఈ నెల 4 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరాహార దీక్షలు చేపడతామని ప్రకటించింది. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 11 నుంచి 23 వరకు హైదరాబాద్ ధర్నాచౌక్​లో రిలే నిరాహార దీక్షలు చేపడతామని కమిటీ వెల్లడించింది. అయినప్పటికీ సర్కారులో చలనం రాకపోతే దసరా సెలవుల్లో చలో అసెంబ్లీ/చలో సెక్రటేరియేట్ నిర్వహించేందుకు సిద్ధమని చెప్పింది. మరోపక్క ఉపాధ్యాయ సంఘాల జేఏసీ(జాక్టో) కూడా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో సమస్యలను మరోసారి సర్కారు దృష్టికి తీసుకుపోయేందుకు టీచర్ల సంఘాలు రెడీ అవుతున్నాయి.

ప్రకటనలే.. అమల్లేదు 
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను త్వరలోనే నిర్వహిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతర్ జిల్లా బదిలీలూ నిర్వహిస్తామని మార్చిలో ప్రకటించారు. జీవో 317 ప్రకారం టీచర్ల విభజన పూర్తయినా బదిలీలు, ప్రమోషన్లపై స్పష్టత ఇవ్వడం లేదు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే టీచర్ల బదిలీలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా రెడ్డి కూడా టీచర్ల సంఘాలు, టీచర్ ఎమ్మెల్సీల మీటింగ్​లలోనూ వెల్లడించారు. ఈ క్రమంలో సీనియార్టీ లిస్టులనూ డీఈఓలు రెడీ చేసి సర్కారుకు పంపించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే తాజాగా దసరా సెలవుల్లో అంటూ ప్రచారం నడుస్తోంది. కానీ సర్కారు పెద్దలు దీనిపై ప్రకటన చేయట్లేదు. 

షెడ్యూల్ రిలీజ్ చేయాలె..  
సమస్యలు చెప్పుకునేందుకు టీచర్ల సంఘాలకు సీఎం అపాయింట్​మెంట్ ఇవ్వట్లేదు. బదిలీలు, ప్రమోషన్లు లేకపోవడంతో ప్రతి స్కూల్​లో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికైనా బదిలీలు, ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ చేయాలి. 

- రఘుశంకర్ రెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు 

హామీ అమలు చేయాలె.. 
బదిలీలు, ప్రమోషన్లు నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించారు. త్వరలోనే నిర్వహిస్తామని పలుమార్లు విద్యాశాఖ మంత్రి కూడా చెప్పారు. అయినా ఇప్పటికీ  చేపట్టడం లేదు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ప్రమోషన్లు ఇచ్చి, బదిలీల ప్రక్రియ నిర్వహించాలి. 

-  కృష్ణుడు, బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు