అప్పుల కోసం..భూములు తాకట్టు బ్యాంకుల్లో కుదువ పెట్టాలని రాష్ట్ర సర్కారు యోచన

అప్పుల కోసం..భూములు తాకట్టు బ్యాంకుల్లో కుదువ పెట్టాలని రాష్ట్ర సర్కారు యోచన
  • తొలి దశలో రూ.6 వేల కోట్లు తీసుకోవాలని ప్లాన్
  • వచ్చే రెండు నెలల్లో రూ.15 వేల కోట్ల దాకా సేకరించాలని టార్గెట్‌‌
  • ఆదాయ వనరులపై మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: ఇప్పటి దాకా భూములు అమ్ముకుంటూ వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై ల్యాండ్స్‌‌ను తాకట్టు పెట్టి అప్పులు తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నది. మార్కెట్ వ్యాల్యూ కోట్ల రూపాయల్లో ఉన్న భూములను బ్యాంకుల్లో, ఆర్థిక సంస్థల వద్ద కుదువ పెట్టి ఖజానా నింపుకోవాలని భావిస్తున్నది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటం, మరోవైపు ముఖ్యమైన పథకాలు అమలు చేసేందుకు నిధులు సర్దుబాటు కాకపోవడంతో.. భూములను తాకట్టు పెడితే వెంటనే అప్పు పుడుతుందని, ఆ సొమ్మును పథకాలకు డైవర్ట్ చేయాలని చూస్తున్నది. హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్‌‌‌‌హెచ్ఆర్డీలో సోమవారం ఆదాయ వనరులపై మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో రివ్యూ జరిగింది. ఈ సందర్భంగా రెండు నెలల్లో ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్లను ఎట్లా సమకూర్చాలనే దానిపైనే చర్చించారు. అందులో భాగంగానే కొన్నిచోట్ల అమ్ముడుపోకుండా మిగిలిన భూములు, అమ్మాలని అనుకున్న మరిన్ని భూములను తాకట్టు పెట్టాలని చర్చించారు. దీంతో పాటు 58, 59 జీవోల కింద వచ్చిన అప్లికేషన్లతో దాదాపు రూ.1,500 కోట్ల మేర వస్తుందని అంచనా వేశారు. ఈ అప్లికేషన్లకు సంబంధించిన ప్రక్రియను కూడా ఈ నెలలోనే పూర్తి చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డును 30 ఏండ్లకు ఒక ప్రైవేట్ కంపెనీకి లీజుకు ఇవ్వగా.. దాంతో రానున్న రూ.7,380 కోట్లు కూడా ఖజానాకు మళ్లించనున్నట్లు తెలిసింది.

ఎక్కువ మొత్తం ఇచ్చే బ్యాంకులను సంప్రదించి..

భూములను తాకట్టు పెట్టడం ద్వారా మొదటి దఫాలో రూ.6 వేల కోట్ల అప్పు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు మార్కెట్ వ్యాల్యూ ఉన్న ఏరియాల్లో ప్రభుత్వ భూములు కుదువ పెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే హెచ్ఎండీఏకు ప్రభుత్వ భూములను కేటాయించింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోని ప్రైమ్ ఏరియాలో ఉన్న 150 ఎకరాల నుంచి 200 ఎకరాల భూములను మొదటి దశలో బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎక్కువ మొత్తంలో అప్పు ఏ బ్యాంకు ఇస్తుందో సంప్రదించి.. ఈ ప్రక్రియను నెల రోజుల్లోపు పూర్తిచేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర సర్కార్ అప్పు కొండలా పెరిగిపోతున్నది. రాష్ట్ర అప్పు దాదాపు రూ.5 లక్షల కోట్లకు చేరింది. దీనికి కడుతున్న వడ్డీలు తడిసిమోపెడు అవుతున్నాయి. ఇప్పుడు భూములను కుదువ పెట్టి అప్పులు తీసుకుంటే వాటికయ్యే వడ్డీల పరిస్థితి ఏంటనేది ఆందోళనకరమని ఆఫీసర్లు అంటున్నారు.

58, 59 జీవోల అప్లికేషన్లతో రూ.1,500 కోట్లు

జీవో 58, 59 కింద ఆక్రమిత భూముల రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం ఈ నెలలో పూర్తి చేయనున్నట్లు తెలిసింది. ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన అప్లికేషన్లు దాదాపు లక్షన్నర ఉన్నాయి. వాటిని పరిశీలించి.. పూర్తి చేయడం ద్వారా రూ.1,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ రెండు జీవోల కింద గతంలో 2014 జూన్​2 వరకు ఉన్న కబ్జాలకే ప్రభుత్వం అప్లికేషన్లు తీసుకున్నది. ఇటీవల దాన్ని 2020 దాకా పొడిగించింది. 58 జీవో కింద 125 గజాలలోపు స్థలాలను ఆక్రమించి నిర్మించుకున్న ఇండ్లను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తారు. 250 గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50 శాతం, 250 నుంచి 500 గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. 500 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు అప్పటి మార్కెట్ ధరకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేసుకోవాలి. నివాసేతర వినియోగ భూములకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరను పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.