స్కీమ్​లకు పైసల్లేవ్..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం

స్కీమ్​లకు పైసల్లేవ్..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం

 

ఆమ్దానీ వస్తున్నా, కొత్తగా అప్పులు చేస్తున్నా సాల్తలే

  • ఐదు ఎకరాల రైతుల దగ్గర్నేఆగిన రైతు బంధు పంపిణీ
  • ఫీజు రీయింబర్స్​మెంట్​ బాకీలు రూ. 5వేల కోట్లు
  • మిడ్​ డే మీల్స్​ కార్మికులకు రూ. 150 కోట్లు పెండింగ్​
  • గొర్రెల పంపిణీ, కల్యాణ లక్ష్మికీ నిధులు ఇస్తలే
  • ఇంకింత ఆలస్యం కానున్న గృహలక్ష్మి స్కీమ్ 
  • నిధుల సర్దుబాటుకు తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు

హైదరాబాద్, వెలుగు : స్కీములను అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు నానా తంటాలు పడుతున్నది. రెగ్యులర్​గా ఇవ్వాల్సిన వాటికి కూడా నిధులు సాల్తలేవు. ప్రతినెలా పదో తారీఖు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్​ ఎంప్లాయీస్​కు పెన్షన్లు తప్ప ఇంకేమీ ఇవ్వడం లేదు. ఆఖరికి ఆసరా పెన్షన్లు కూడా నెలాఖరులో ఇస్తున్నది. ఒక్కోసారి ఒక నెల పెన్షన్​ను ఇంకో నెలలో పంపిణీ చేస్తున్నది. ఆర్బీఐ నుంచి అప్పులు తీసుకోవడం.. దాంట్లో నుంచి పాత అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు పోను.. ఎంతో కొంత ఫండ్స్ మిగిలితే వాటిని అత్యవసర పనులకు రిలీజ్ చేస్తున్నది. రైతుబంధు సాయం పంపిణీ గత నెల 26న మొదలవగా.. ఇంకా అది 5 ఎకరాల రైతుల దగ్గర్నే ఆగిపోయింది. ఐదు ఎకరాలపైన భూమి ఉన్న రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. ఇక, మిడ్​ డే మీల్స్​ కార్మికులకు నిరుడు అక్టోబర్​ నుంచి బకాయిలు పెండింగ్​లో ఉన్నాయి. దీంతో కార్మికులు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. కొత్త విద్యా సంవత్సరం మొదలై నెల కావొస్తున్నా.. ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలను ప్రభుత్వం రిలీజ్ చేయడం లేదు. ఫీజు రీయింబర్స్​మెంట్​, స్కాలర్​ షిప్​లు దాదాపు రూ. 5 వేల కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. వీటితోపాటు గృహలక్ష్మి, దళిత బంధు, బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం వంటి పథకాలకు ఎట్ల నిధుల సర్దుబాటు చేయాలనే దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతున్నది. అన్నీ సక్రమంగా అమలు కావాలంటే ఇప్పటికిప్పుడు కనీసం రూ. 15 వేల కోట్ల దాకా అవసరమని ఆఫీసర్లు చెప్తున్నారు.

ఈ వానాకాలం రైతుబంధు కేవలం ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకే అందింది. గత నెల 26 నుంచి రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వచ్చారు. ఒక రోజు ఎకరా.. ఆ మరుసటి రోజు రెండెకరాలు.. ఇట్ల ఐదుకెరాల రైతుల వరకు డబ్బులు వేసి ఖజానాలో పైసలు లేక తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో మిగతా రైతులు ఎదురుచూడాల్సి వస్తున్నది. వాస్తవానికి ఈసారి వానాకాలం సీజన్‌‌లో రూ.7,720 కోట్లు రైతుల ఖాతాలలో జమకావాల్సి ఉంది. ఇప్పటి వరకు (5 ఎకరాల రైతుల వరకు) రూ. 4,800 కోట్ల మేర జమ చేసినట్లు తెలిసింది. ఇంకా  5 ఎకరాల పైన ఉన్న పట్టాదారులకు దాదాపు రూ. 3 వేల కోట్ల వరకు రైతుబంధు అందాల్సి ఉంది.

ఫీజు రీయింబర్స్​మెంట్ బాకీలు 5వేల కోట్లు

ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు ఏటికేడు పేరుకుపోతున్నాయి. అకడమిక్ ఇయర్  పూర్తయ్యేలోగా చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్​మెంట్​ను కొత్త అకడమిక్​ మొదలైనా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత కొన్నేండ్ల ఈ బాకీలు అన్ని కలిపితే దాదాపు రూ. 5 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇట్ల అన్ని సెక్షన్ల స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్​మెంట్​ పెండింగ్​లో ఉంటున్నది. టైంకు సర్కార్​ నిధులను రిలీజ్ చేయకపోవడంతో ప్రైవేట్ కాలేజీల మేనేజ్ మెంట్లు స్టూడెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నాయి. కోర్సులు పూర్తయి పైకోర్సులకు వెళ్లాలనుకునే స్టూడెంట్లు సర్టిఫికెట్ల కోసం కాలేజీలకు పోతే ఫీజులు కడితేనే ఇస్తామని చెప్తున్నాయి. దీంతో కొందరు పేరెంట్స్​ అప్పులు చేసి డబ్బులు కడుతుండగా.. మరికొంతమంది అవి చెల్లించలేకపోతున్నారు. 

మిడ్​ డే మీల్స్​ రూ. 150 కోట్లు పెండింగ్ 

మిడ్​ డే మీల్స్ బకాయిలు దాదాపు రూ. 150 కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించిన మధ్యాహ్న భోజనం బిల్స్ సుమారు రూ. 76 కోట్ల దాకా ఉన్నాయి. ఈ 76 కోట్లలో రెండు రోజుల కింద 15 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చినా.. అవి మిడ్​ డే మీల్స్ కార్మికుల ఖాతాల్లో ఎప్పుడు చేరుతాయోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. 9, 10 తరగతుల స్టూడెంట్లకు సంబంధించినవి సుమారు రూ. 30 కోట్ల వరకూ పెండింగ్​లో ఉన్నాయి. విద్యార్థులకు అందించే గుడ్ల బిల్లు బకాయిలు రూ. 25కోట్ల దాకా పెండింగ్​లో ఉన్నాయి. ఇక.. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి మిడ్​ డే మిల్స్​ కార్మికులకు గౌరవ వేతనం  సుమారు రూ. 50 కోట్ల దాకా పెండింగ్​లో ఉంది. మిడ్​ డే మీల్స్ కార్మికులకు రూ. వెయ్యిగా ఉన్న గౌరవ వేతనాన్ని 3 వేలకు చేరుస్తున్నట్లు నిరుడు అసెంబ్లీలో సీఎం ప్రకటించారు. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో జీవో ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. మిడ్​ డే మీల్స్​ బకాయిలతో పాటు పెరిగిన గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ కార్మికులు ఆందోళన పట్టారు. పలు జిల్లాల్లో వంట బంద్ చేయగా.. ఇంకొన్ని జిల్లాల్లో అధికారులు, గ్రామపెద్దల విజ్ఞప్తులతో మిడ్​ డే మీల్స్ వండిపెడుతున్నారు. 

గొర్రెల పంపిణీ, కళ్యాణ లక్ష్మీకి నో మనీ

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 3.38 లక్షల మంది గొల్ల, కురుమలు ఎదురు చూస్తున్నారు. ఇందుకు కనీసం రూ. 5 వేల కోట్లు అవసరం. ఇప్పటికే  దాదాపు లక్ష మంది గొల్ల, కురుమలు వారి వాటా కింద డీడీలు కట్టారు. అయితే ప్రభుత్వం మాత్రం 10 వేల మందికే పంపిణీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. గొర్రెల పంపిణీకి బడ్జెట్​లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినా.. వాటిని రిలీజ్ చేయడం లేదు.  నేషనల్​ కో ఆపరేటివ్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ (ఎన్​సీడీసీ) లోన్​ వస్తదంటూ ఊరిస్తున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనుమానం వ్యక్తం చేసిన ఎన్​సీడీసీ అప్పును పెండింగ్​లో పెట్టింది. 10 వేల మంది కోసం కేవలం రూ. 20 కోట్లు వాడుకోవాలని స్పష్టంచేసింది. అదీ కూడా గతంలో మిగిలిన నిధుల నుంచే. ఇక.. రాష్ట్రవ్యాప్తంగా కల్యాణలక్ష్మి కోసం కూడా 70 వేల మంది ఎదురుచూస్తున్నారు. ఈ పథకం కింద దాదాపు రూ.700 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. 

మొదలుపెట్టే స్కీములకు ఎట్లానో

ఈ నెలలో దళితబంధు, గృహలక్ష్మీ (ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షల సాయం) స్కీములు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవోలు కూడా జారీ చేసింది. అయితే ఇంకా అప్లికేషన్ల ప్రాసెస్​ మొదలుపెట్టలేదు. అప్లికేషన్లు తీసుకుంటే.. నిధులు మంజూరు చేయాల్సి వస్తుందని సర్కార్​ వెనకడుగు వేస్తున్నట్లు తెలిసింది. ఈ స్కీములకు సంబంధించి బడ్జెట్​ ఉత్తర్వులు ఎప్పుడో ఇచ్చినప్పటికీ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఆయా డిపార్ట్​మెంట్లు కనీసం ఇప్పటికి రూ. 2 వేల కోట్ల చొప్పున అయినా ఇవ్వాలని కోరుతున్నా.. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 

బీసీలకు ‘లక్ష సాయం’ ..15 వేల మందికే?

బీసీల్లోని చేతివృత్తుల వారికి రూ. లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని ఆ మధ్య ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ గడువు ఇచ్చినా దాదాపు 5.50 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 15న లబ్ధిదారుల లిస్ట్​ పెడుతామని ఆఫీసర్లు చెప్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల నుంచి 15 వేల మందికే ఆర్థిక సాయం అందేలా బీసీ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​ కు ఫండ్స్​ రిలీజ్​ అయ్యాయని అంటున్నారు. వాస్తవానికి అప్లికేషన్లలో అర్హులందరికీ ఇవ్వాలంటే కనీసం రూ. 4 వేల కోట్లు అవసరం అవుతాయని ఆఫీసర్లు చెప్తున్నారు.

రాబడి, ఖర్చు ఇట్లా..!

రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా, గ్రాంట్​ ఇన్​ ఎయిడ్​, నాన్ ట్యాక్స్​ రెవెన్యూ.. ఇట్ల అన్ని కలిపి ప్రతి నెలా యావరేజ్​ గా రూ.12 వేల కోట్లు వస్తుంది. వివిధ మార్గాల నుంచి తీసుకునే అప్పులు రూ.5 వేల కోట్ల దాకా తోడవుతున్నాయి. మొత్తంగా ప్రతి నెలా రూ.16 వేల కోట్ల నుంచి రూ.17 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. ఇందులో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్​ ఎంప్లాయీస్​ పెన్షన్లకు దాదాపు రూ.5 వేల కోట్లు చెల్లిస్తున్నారు. గతంలో చేసిన అన్ని రకాల అప్పులకు కడుతున్న వడ్డీ రూ.3 వేల కోట్లు ఉంటున్నది. ఇక అప్పుల కిస్తీలకు కడుతున్న మొత్తం రూ.4 వేల కోట్లపైనే. ప్రభుత్వ నిర్వహణ వ్యయం, క్యాపిటల్​ ఎక్స్​పెండిచర్​ పేరు మీద యావరేజ్ గా రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఇక మిగిలిన వాటిలో ఆసరా పెన్షన్లు, అత్యవసరంగా ఇవ్వాల్సి న వాటికి సర్దుబాటు చేస్తున్నారు. దీంతో స్కీములకు చెల్లించేందుకు నిధులు ఉండటం లేదు.

పైసల్లేక ‘మిడ్​ డే మీల్స్​’ బంజేసినం

మేం నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం జడ్పీహెచ్​ఎస్​లో పనిచేశాం. స్కూల్​లో 300 మంది దాకా పిల్లలున్నారు. సెప్టెంబర్ నుంచి బకాయిలు రావాలి. రెండున్నర లక్షలు అప్పు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టినం. ఇంకా అప్పులు పుట్టక, చేతిలో పైసల్లేక ఇప్పుడు బంద్ చేసినం.  ప్రభుత్వం నుంచి నిధులు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నం. ఎంఈఓ ఆఫీసు చుట్టూ తిరిగినా ఉపయోగం ఉంటలేదు. 
‌‌‌‌‌‌‌‌‌‌‌‌- సూర్యకుమార్, మిడ్​ డే మీల్స్ కార్మికుడు, గుండారం స్కూల్, నిజామాబాద్​ జిల్లా