పెద్ద హాస్పిటళ్ల సుస్తీకి చెక్.. ఉస్మానియా అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

పెద్ద హాస్పిటళ్ల సుస్తీకి చెక్.. ఉస్మానియా అనుబంధ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • కనీస సౌకర్యాల నుంచి అడ్వాన్స్ డ్ ఎక్విప్ మెంట్ కల్పన వరకు ప్రతిపాదనలు
  • నిలోఫర్ లో బర్డెన్  తగ్గించేందుకు కింగ్ కోఠిలో పీడియాట్రిక్  యూనిట్
  • ఈఎన్టీకీ కొత్త బిల్డింగ్  కోసం స్థల పరిశీలన

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్ హాస్పిటల్స్ ను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 200కు పైగా హాస్పిటల్స్ కు బ్రాండింగ్  తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఉస్మానియా అనుబంధ హాస్పిటల్స్ కు పూర్వవైభవం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే వరుసగా మూడు రోజులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఉస్మానియా అనుబంధ హాస్పిటల్స్ అయిన  ఈఎన్టీ, సుల్తాన్ బజార్  మెటర్నిటీ, పేట్లబురుజు మెటర్నిటీ, నిలోఫర్, ఎంఎన్ జే క్యాన్సర్, ఫీవర్  హాస్పిటల్, సరోజిని, చెస్ట్  హాస్పిటల్, ఎర్రగడ్డ మెంటల్  హాస్పిటళ్ల  సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఆయా హాస్పిటల్స్ లో నెలకొన్న సమస్యలు. పెండింగ్  పనులు, అవసరమైన ఎక్విప్ మెంట్, ఇతర సమస్యల గురించి ఆరా తీశారు.

హాస్పిటల్స్లో టెస్టులు, ట్రీట్మెంట్ ను వేగవంతం చేసేందుకు అవసరమైన అడ్వాన్స్ డ్  ఎక్విప్ మెంట్  ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నిలోఫర్‌‌ లో ఇప్పటివరకూ ఎంఆర్ఐ స్కానింగ్  మెషీన్  లేకపోవడంతో పేషెట్లను ఎంఎన్ జే హాస్పిటల్ కు పంపాల్సిన పరిస్థితి ఉంది. దీనికి చెక్ పెడుతూ  నిలోఫర్‌‌ లోనే కొత్త ఎంఆర్ఐ మెషీన్‌‌ ను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. దీంతోపాటు ఇతర హాస్పిటల్స్ లో అవసరమైన సీటీ స్కాన్  మెషీన్లు, ఆపరేషన్  థియేటర్  పరికరాలు, అనస్థీషియా మెషీన్ల కోసం అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. పాత మెషీన్లను రిపేర్ చేయించాలని, గడువు ముగిసిన వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు.

కింగ్ కోఠి హాస్పిటల్లో పీడియాట్రిక్  యూనిట్
పీడియాట్రిక్  హాస్పిటల్ గా పేరుగాంచిన నిలోఫర్‌‌ పై భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కింగ్ కోఠి జిల్లా హాస్పిటల్ ఆవరణలో 100 బెడ్లతో ప్రత్యేక పీడియాట్రిక్  యూనిట్‌‌ను ఏర్పాటు చేయాలని మంత్రి  దామోదర ఆదేశించారు. ఎమర్జెన్సీ నుంచి అన్ని వైద్యసేవలను ఇక్కడ అందుబాటులో తేవాలన్నారు. ఇప్పటికే తెలంగాణ వైద్య విధాన పరిషత్  కమిషనర్  డాక్టర్  అజయ్ కుమార్  స్థల పరిశీలన చేశారు. ఈ యూనిట్ అందుబాటులోకి వస్తే నిలోఫర్‌‌ పై భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు నిలోఫర్‌‌ లో పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా బెడ్ల సంఖ్యను పెంచాలని, గతంలో ఐరన్  స్ట్రక్షర్ తో నిర్మించిన నిర్మాణాన్ని వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు. గైనకాలజీ ఓపీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా గైనిక్ ఓపీని, డ్యూటీ డాక్టర్ల కోసం హాస్టల్‌‌ను కూడా నిర్మించాలని నిర్ణయించారు.

ఈఎన్టీకి కొత్త బిల్డింగ్..
శిథిలావస్థకు చేరుకున్న ఈఎన్టీ హాస్పిటల్ కు కొత్త బిల్డింగ్ నిర్మాణానికి మార్గం సుగమం కానుంది. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఇందుకు రూ. 35 కోట్లు కేటాయించినా... నిర్మాణం తలపెట్టిన స్థలం కింద నాలా ఉండడంతో పనులు ఆగిపోయాయి. ఈ సమస్యను అధిగమించేందుకు హాస్పిటల్ ప్రాంగణంలోనే మరోచోట స్థల పరిశీలన చేయాలని అధికారులను మంత్రి దామోదర ఆదేశించారు. దీంతో త్వరలోనే కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నిలోఫర్‌‌ లో పేషెంట్ల అటెండర్ల కోసం జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న ధర్మశాలను స్వాధీనం చేసుకుని వినియోగించాలని మంత్రి ఆదేశించారు.