
- వరిపై కిరికిరి
- దొడ్డు వడ్లు వద్దని ఓసారి.. వరి సాగు 30 శాతం తగ్గించాలని ఓసారి
- ఇప్పుడేమో వరి విత్తనాలు అమ్మొద్దని డీలర్లకు వార్నింగ్
- ప్రభుత్వ తీరుపై రైతుల మండిపాటు
- వరి తప్ప వేరే పంట వేయబోమని పల్లెల్లో తీర్మానాలు
‘‘తెలంగాణల మనమే 65 లక్షల టన్నుల బియ్యం తింటం.. కోటి టన్నుల వడ్లు పండినా కొంటం.. ఏ అనుమానం లేకుండా వరి వేయండి” అని పోయినేడు మార్చి 7న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్... వరి వేయడమంటే ఉరేసుకోవడమేనని పోయిన నెల 12న అన్నారు.
నెట్వర్క్, వెలుగు: వరి సాగుపై రాష్ట్ర సర్కార్ పూటకో మాట మాట్లాడుతోంది. మొదట దొడ్డు వడ్లు వద్దన్న ప్రభుత్వం... ఈ యాసంగిలో 20 నుంచి 30 శాతం వరి సాగు తగ్గించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు టార్గెట్ పెట్టింది. మళ్లీ ఇప్పుడేమో అసలు వరే వద్దన్న రీతిలో కలెక్టర్లతో ప్రకటనలు ఇప్పిస్తోంది. దీంతో అటు రైతుల్లో, ఇటు అగ్రికల్చర్ఆఫీసర్లలో అయోమయం నెలకొంది. సర్కార్ ఆదేశాలతో సోమ, మంగళవారాల్లో జిల్లాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, విత్తన డీలర్లతో సమావేశమైన కలెక్టర్లు... వరి విత్తనాలు అమ్మొద్దని డీలర్లను హెచ్చరించడంతో కలకలం రేగింది. దీనిపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీంతో కొన్ని గ్రామాల్లో రైతులంతా కలిసి సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. వరి సాగుపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని ప్రతిపక్ష లీడర్లు మండిపడుతున్నారు. వరి వద్దంటే లక్షల కోట్లతో ప్రాజెక్టులు ఎందుకు కడుతున్నారని గతంలోనే బీజేపీ స్టేట్ చీఫ్సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనకపోవడం వల్లే వరి వేయొద్దంటున్నామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అర్వింద్ కూడా కౌంటర్ ఇచ్చారు. సీసీఐ కేవలం దొడ్డు వడ్లు మాత్రమే వద్దని చెబుతోందని, ఫైన్ క్వాలిటీ వెరైటీలు పండిస్తే కొంటామని చెప్పిందని గుర్తు చేశారు.
ప్రత్యామ్నాయ పంటలెట్ల?
గతేడాది యాసంగిలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. సర్కార్ చెప్పినట్లు ఈసారి యాసంగిలో 20 నుంచి 30 శాతం వరి సాగు తగ్గించినా, ఇంకా కనీసం 37 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే అవకాశం ఉంటుంది. ఈ మేరకు 16 లక్షల ఎకరాల్లో వరి సాగు తగ్గించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లు కొద్ది రోజుల నుంచి జిల్లాల వారీగా ప్రత్యామ్నాయ పంటలకు అవకాశమున్న ఊర్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయితే ఆయా చోట్ల ఆఫీసర్లపై రైతులు తిరగబడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలు, మార్కెటింగ్సౌకర్యాలు కల్పించకుండా ఎట్ల సాగు చేయమంటరని నిలదీస్తున్నారు. కాగా, సర్కార్ మొత్తానికే వరి వద్దనడంతో అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా పరేషాన్లో పడ్డారు.
వరి తప్ప వేరే పండవు...
సర్కార్ నిర్ణయాన్ని కొన్ని గ్రామాల్లో రైతులు వ్యతిరేకిస్తున్నారు. యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలని ప్రభుత్వం చెప్పడంతో.. మంగళవారం మంచిర్యాల జిల్లా జైపూర్మండలం గంగిపల్లిలో సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తమ భూముల్లో ఆరుతడి పంటలు పండే చాన్స్‌లేదని, ప్రత్యామ్నాయ పంటలు దిగుబడి రావని, గ్రామంలో అడవి పందులు, కోతుల బెడద ఉన్నందున వరి సాగుకు అనుమతి ఇవ్వాలని పంచాయతీలో తీర్మానం చేశారు. తమ భూములకు అనుకూలమైన పంటలు వేస్తామని, ఫలానా పంటలే వేయాలని ప్రభుత్వం ఆదేశించడం కరెక్టు కాదని అన్నారు.
జిల్లాల్లో వరి విత్తనాల అమ్మకాలు బంద్
వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్ చేస్తామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సోమవారం చేసిన వ్యాఖ్యలపై ఓవైపు విమర్శలు వస్తున్నప్పటికీ.. సర్కారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మంగళవారం కూడా పలువురు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో రివ్యూ మీటింగులు పెట్టి, వరి విత్తనాలు అమ్మితే షాపులు సీజ్‌చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆయా జిల్లాల్లో వరి విత్తనాల అమ్మకాలు ఆగిపోయాయి. జనగామ కలెక్టర్ శివలింగయ్య అగ్రికల్చర్ ఆఫీసర్లతో రివ్యూ చేసి.. ఫర్టిలైజర్ షాపుల్లో ఎక్కడా వరి విత్తనాలు అమ్మొద్దని సీరియస్ గా చెప్పారు. దీంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం నుంచే అమ్మకాలు నిలిచిపోయాయి. వరి విత్తనాలు విక్రయిస్తే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని సూర్యాపేట కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి కూడా హెచ్చరించారు. జిల్లాలో విత్తనాలు సరఫరా కాకుండా అన్ని చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేపడతామన్నారు. వరి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కూడా డీలర్లను హెచ్చరించారు. జిల్లాలో ఒక్క ఎకరంలో కూడా వరి సాగు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నాగర్‌కర్నూల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, యాదాద్రి కలెక్టర్పమేలా సత్పతి కూడా యాసంగిలో వరి సాగు చేయకుండా చర్యలు తీసుకోవాలని అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు.
వరి వద్దంటే ప్రాజెక్టులు ఎందుకు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
లక్షల కోట్లు పెట్టి కాళేశ్వరం, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్, అనంతసాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టినంక.. ఇప్పుడు వరి వద్దంటే రైతుల పరిస్థితి ఏమిటని బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఆయన మంగళవారం మెదక్ లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కోసం ఏటా దాదాపు రూ.4 వేల కోట్ల కరెంటు బిల్లులు కడ్తున్నది.. రైతుల నోట్లో మట్టి కొట్టేందుకేనా? అని ప్రశ్నించారు. ‘‘ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ లేదు. చెరుకు మిల్లులు బంద్అయితన్నయ్. పత్తికి డిమాండ్ ఉన్నా జిన్నింగ్ మిల్లులు లేవు. ఫుడ్ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇన్ని సమస్యలు ఉండగా వరి వద్దనడం కరెక్ట్ కాదు’’ అని చెప్పారు. ‘‘సీఎం మాటలు మూర్ఖంగా విని 50 టీఎంసీల మల్లన్న సాగర్రిజర్వాయర్తో 20 గ్రామాలను ముంచేసి ప్రజలను నిర్వాసితులను చేసిన సిద్దిపేట కలెక్టర్.. ఇప్పుడు వరి విత్తనాలు అమ్మే వాళ్లను శిక్షిస్తా అంటున్నాడు. లిఫ్ట్ చేసి తెచ్చిన నీళ్లు ప్రగతి భవన్లో పోసుకుంటారా?” అని ప్రశ్నిస్తూ ప్రవీణ్ ట్వీట్ చేశారు.
కలెక్టర్ పై పీఎంఓకు ఫిర్యాదు: ఏఐసీసీ మెంబర్ మహేశ్
సుప్రీంకోర్టును కించపరిచేలా మాట్లాడిన సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ మెంబర్ కొనగాల మహేశ్ ఈ–మెయిల్ద్వారా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ (పీఎంఓ)కు మంగళవారం ఫిర్యాదు చేశారు. కలెక్టరే కోర్టుల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడితే సమాజంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అందుకే ఆయనను రీకాల్ చేయాలని కోరారు. ఈ అంశాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించి చర్యలు తీసుకోవాలని సుప్రీంను కూడా కోరామని మహేశ్ తెలిపారు.
రైతులకు వరి విత్తనాలు అందిస్తం...
కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టి, ఇప్పుడేమో ‘వరి వేస్తే ఉరే’ అంటే రైతులు చూస్తూ కూసోవల్నా. కొన్ని భూముల్లో వరి తప్ప.. ఆరుతడి పంటలు పండవు. మీరేమో గోడౌన్ల నిండా వడ్లు ఉన్నయి అంటున్నరు. మరోవైపు దేశంలో 70% మందికి సరైన తిండి లేదని వార్తలు రాస్తున్నరు. వరి విత్తనాలు అమ్మితే షాపులను సీజ్ చేస్తమని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అంటున్నరు. ఆయన సీఎంకు బానిస అయినంత మాత్రాన.. రైతులందరూ అయితరా? కోర్టులను కించపరిచిన కలెక్టర్‌పై జడ్జీలు సుమోటో కింద కేసుపెట్టి కఠిన చర్యలు తీసుకోవాలె. ఈ ప్రభుత్వం రైతులకు వరి విత్తనాలు అందించకపోతే.. కాంగ్రెస్ తరఫున మేమే అందిస్తం.
- పొన్నం ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
నేనట్ల అనలే..
ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం జరిగిన సమావేశంలో నేను చెప్పిన అంశాలను సోషల్ మీడియాలో వక్రీకరించి సర్క్యులేట్ చేశారు. యాసంగిలో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని కోరానే తప్ప.. వేరే ఉద్దేశం లేదు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాను. యాసంగిలో అందరూ వరి సాగు చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కోరాను.
- వెంకట్రామిరెడ్డి, సిద్దిపేట కలెక్టర్
పునాస పంటలతో లాభం ఉండదు
మా పొలాలు చెరువు కింద ఉన్నయ్. అక్కడ వరి తప్ప వేరే పండదు. ఇప్పుడు ప్రభుత్వం వరి వేయొద్దంటే ఎట్ల? మాలాంటి రైతులు ఏ పంటలు వేసుకోవాలె. పునాస పంటలు పండవు. పండినా లాభం ఉండదు. మరి మా పరిస్థితి ఏందో సర్కారే చెప్పాలె.
- మద్దూరి ఎల్లయ్య, బుస్సాపూర్
వరి వద్దంటే ఎట్ల?
నాకు చెరువు కింద మూడెకరాల పొలం ఉంది. అక్కడ వరి తప్ప వేరే పంట పండది. కలెక్టరేమో యాసంగిలో వరి వద్దని చెబుతున్నరు. ఆరు తడి పంటలకు నా భూమి సరిపోదు. మరి నా పొలంలో ఏ పంట వేసుకోవాలె. ఎట్ల బతకాలె.
- ఆరుట్ల వెంకట్ రెడ్డి, పెద్ద లింగారెడ్డిపల్లి, సిద్దిపేట జిల్లా